బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 06, 2020 , 00:43:49

చేజారింది

చేజారింది

న్యూజిలాండ్‌ను టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌ చేసి మంచి జోష్‌లో ఉన్న టీమ్‌ఇండియాకు షాక్‌ తగిలింది. బ్యాటింగ్‌లో రాణించినా.. బౌలింగ్‌లో తేలిపోవడంతో తొలి వన్డేలో కివీస్‌ చేతిలో ఓటమి తప్పలేదు. అయ్యర్‌ తొలి శతకం సహా చివర్లో రాహుల్‌ మెరుపులు తోడవడంతో భారీ స్కోరు నమోదు చేసినా ఫలితం లేకపోయింది. లక్ష్యఛేదనలో కివీస్‌ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ అజేయ శతకంతో చివరి వరకు నిలిస్తే.. లాథమ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి కీలకపాత్ర పోషించాడు. వీరిద్దరూ టీ20ని తలపిస్తూ 10కి పైగా రన్‌రేట్‌తో భాగస్వామ్యం నమోదు చేసి భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో వన్డేల్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన రికార్డును కివీస్‌ మూటగట్టుకుంటే.. మూడు వన్డేల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించి కోహ్లీసేన ఒత్తిడిలో పడిపోయింది.

  • భారీ లక్ష్యాన్ని కాపాడలేకపోయిన భారత బౌలర్లు
  • తొలి వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో కివీస్‌ చేతిలో ఓటమి
  • అయ్యర్‌ శతకం వృథా.. టేలర్‌, లాథమ్‌ మెరుపు బ్యాటింగ్‌

హామిల్టన్‌: న్యూజిలాండ్‌ పర్యటనలో టీమ్‌ఇండియాకు తొలి ఓటమి ఎదురైంది. టీ20సిరీస్‌ను 5-0తో కైవసం చేసుకున్న కోహ్లీసేన వన్డే సమరంలో తడబడింది. బుధవారం ఇక్కడి సెడాన్‌పార్క్‌ మైదానంలో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 4వికెట్ల తేడాతో ఆతిథ్య కివీస్‌ చేతిలో పరాజయం పాలై.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. శ్రేయస్‌ అయ్యర్‌(107బంతులకు 103; 11ఫోర్లు, ఓ సిక్సర్‌) వన్డేల్లో తొలి శతకంతో పాటు కేఎల్‌ రాహుల్‌(64బంతుల్లో 88; 3ఫోర్లు 6సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 50ఓవర్లలో 4వికెట్లకు 347పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌ కోహ్లీ(51) అర్ధశతకంతో రాణించాడు. కివీస్‌ బౌలర్లలో సౌథీ రెండు, గ్రాండ్‌హోమ్‌, సోధీ చెరో వికెట్‌ తీసుకున్నారు. 


లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌(84 బంతుల్లో 109నాటౌట్‌; 10ఫోర్లు, 4సిక్సర్లు) అద్భుత బ్యాటింగ్‌కు తోడు టామ్‌ లాథమ్‌(48 బంతుల్లో 69; 8ఫోర్లు, 2సిక్సర్లు) అదరగొట్టాడు. దీంతో 48.1 ఓవర్లలోనే కివీస్‌ 6 వికెట్లకు 348 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్‌దీప్‌ 2, మహమ్మద్‌ షమీ, ఠాకూర్‌ చెరో వికెట్‌ తీసుకున్నా ధారాళంగా పరుగులిచ్చేశారు. పొదుపుగా బౌలింగ్‌ చేసినా... బుమ్రా వికెట్‌ తీయలేకపోవడం మైనస్‌గా మారింది. శతక్కొట్టిన కివీస్‌ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో పరాజయం తర్వాత కివీస్‌తో భారత్‌ ఆడిన తొలి వన్డే ఇదే. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆక్లాండ్‌ వేదికగా శనివారం జరుగుతుంది. 


పర్వాలేదనిపించిన కొత్త జంట

ధవన్‌, రోహిత్‌ శర్మ గాయాల కారణంగా సిరీస్‌కు దూరమవడంతో ఈ మ్యాచ్‌లో టెస్టు సంచలనం మయాంక్‌ అగర్వాల్‌(32), యువ ప్లేయర్‌ పృథ్వీ షా(20) ఓపెనింగ్‌ దిగారు. వన్డేల్లో వీరిద్దరికీ ఇదే అరంగేట్రం కావడం విశేషం. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై తొలి రెండు ఓవర్లు ఆచితూచి ఆడినా.. మూడో ఓవర్‌ రెండో బంతికి మయాంక్‌ బౌండ్రీ బాదితే.. ఆ తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి పృథ్వీ వేగం పెంచాడు. 7.5ఓవర్లలోనే 50పరుగుల భాగస్వామ్యం పూర్తయ్యాక తర్వాతి బంతికే షాను కివీస్‌ బౌలర్‌ గ్రాండ్‌హోమ్‌ ఔట్‌ చేయగా.. ఆ తర్వాతి ఓవర్లో సౌథీ బౌలింగ్‌లో బ్లండెల్‌కు క్యాచ్‌ ఇచ్చి మయాంక్‌ వెనుదిరిగాడు. 


నిలబెట్టిన అయ్యర్‌, కోహ్లీ 

రెండు వికెట్లు వెంటవెంటనే పడడంతో కెప్టెన్‌ కోహ్లీ(51), శ్రేయస్‌ అయ్యర్‌ ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను నిర్మించడంలో సఫలమయ్యారు. ఈ క్రమంలో 62బంతులకు అర్ధశతకం పూర్తి చేసుకున్న కోహ్లీ 29ఓవర్లో సోధీ బౌలింగ్‌లో బౌల్డ్‌ అవడంతో 102పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అయితే, మధ్య ఓవర్లలో రాహుల్‌ - కోహ్లీ కాసేపు నిదానంగా ఆడడంతో ఇన్నింగ్స్‌ మందకొడిగా సాగింది. 


రాహుల్‌, జాదవ్‌ మెరుపులు  

ఆ తర్వాత శ్రేయస్‌కు రాహుల్‌ జతకలువడంతో పరుగుల రాక వేగం పుంజుకుంది. అర్ధశతకం తర్వాత అయ్యర్‌ బాదుడు పెంచితే.. 35ఓవర్లో సోధీ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టిన రాహుల్‌ దూకుడుగా ఆడి 42బంతుల్లోనే హాఫ్‌సెంచరీ చేశాడు. ఇక నిలకడగా ఆడిన అయ్యర్‌ 43ఓవర్లో సాంట్నర్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసి 101బంతుల్లో కెరీర్‌లో తొలి శతకం నమోదు చేశాడు. హిట్టింగ్‌ చేసే ప్రయత్నంలో అయ్యర్‌ ఔటైనా.. చివర్లో రాహుల్‌కు తోడు కేదార్‌ జాదవ్‌(26) అదరగొట్టడంతో 48ఓవర్లో 20పరుగులు పిండుకున్న భారత్‌ చివరికి 347పరుగులు చేసింది. 


నికోల్స్‌ నిలకడగా.. 

కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గైర్హాజరీలో భారీ లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు గప్టిల్‌(32), హెన్రీ నికోల్స్‌(78) తొలుత నిదానంగా ఆడడంతో 10ఓవర్లలో కివీస్‌ 40పరుగులే చేయగలిగింది. కాసేపటి తర్వాత భారీ షాట్‌కు యత్నించిన గప్టిల్‌.. ఔటయ్యాడు. నికోల్స్‌ అర్ధశతకం చేసి జోరు పెంచినా.. బ్లండెల్‌ను కుల్దీప్‌ ఔట్‌ చేశాడు. వరుస బౌండ్రీలతో రెచ్చిపోయిన నోకోల్స్‌ను కోహ్లీ అద్భుత రనౌట్‌తో వెనక్కి పంపాడు.  10పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కివీస్‌ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ టేలర్‌ ఇచ్చిన క్యాచ్‌ను కుల్దీప్‌ వదిలేయడంతో భారత్‌ మూల్యం చెల్లించుకుంది. 


దాదాను దాటేసిన కోహ్లీ  

వన్డేల్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా విరాట్‌ కోహ్లీ కొత్త రికార్డు సృష్టించాడు. 148 వన్డేలకు సారథ్యం వహించిన సౌరవ్‌ గంగూలీ కెప్టెన్‌గా 5,123 పరుగులు చేయగా, ఈ మ్యాచ్‌లో అర్ధశతకం చేసిన కోహ్లీ 5,123 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దాదాను కోహ్లీ కేవలం 87 మ్యాచ్‌ల్లోనే దాటడం విశేషం. అలాగే, ఈ మ్యాచ్‌లో కండ్లు చెదిరేలా ముందుకు డైవ్‌ చేసి.. నికోల్స్‌ను కోహ్లీ రనౌట్‌ చేసిన తీరు వహ్వా అనిపించింది.


న్యూజిలాండ్‌ అద్భుతంగా ఆ డింది. ఈ పిచ్‌పై 347 పరుగులు సరిపోతాయని అనుకున్నాం. కానీ టేలర్‌ లాంటి అనుభవజ్ఞుడు కివీస్‌ జట్టులో ఉన్నాడు. అలాగే లాథమ్‌ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ చేజారిపోయింది. ఈ మ్యాచ్‌ క్రెడిట్‌ అంతా టేలర్‌, లాథమ్‌కే దక్కుతుంది. 

- విరాట్‌ కోహ్లీ 


348 వన్డేల్లో న్యూజిలాండ్‌కు ఇదే అత్యధిక లక్ష్యఛేదన. 2007లో ఆస్ట్రేలియాపై 347పరుగులు ఛేజ్‌ చేసిన కివీస్‌ ఇప్పడు ఆ రికార్డును తిరగరాసింది. 


టేలర్‌, లాథమ్‌ భీకర బ్యాటింగ్‌

ఆ తర్వాత రాస్‌ టేలర్‌, టామ్‌ లాథమ్‌ జోడీ అద్భుతంగా ఆడింది. వీరిద్దరి దూకుడును భారత బౌలర్లు ఏ మాత్రం నియంత్రించలేకపోయారు.  కుల్దీప్‌, శార్దూల్‌ పేలవ బౌలింగ్‌తో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. శార్దూల్‌ వేసిన 40ఓవర్లో లాథమ్‌ ఓ సిక్సర్‌ కొట్టగా.. టేలర్‌ ఓ సిక్స్‌, రెండు ఫోర్లతో దుమ్మురేపడంతో 10ఓవర్లలో 56 పరుగులకు సమీకరణం పడిపోయింది. 10.48రన్‌రేట్‌తో 79బంతుల్లోనే టేలర్‌ - లాథమ్‌ జోడీ 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్‌ చేతిలో నుంచి మ్యాచ్‌ జారిపోయింది. ఆ తర్వాత లాథమ్‌ ఔటైనా టేలర్‌ జాగ్రత్తగా ఆడాడు. ఆఖరి మూడు టీ20ల్లో జట్టు తడబడి పరాజయం చెందడంతో మరోసారి అలా జరగకుండా జాగ్రత్త పడి వేగంగా పరుగులు చేశాడు. 44ఓవర్లో సింగిల్స్‌ తీసిన టేలర్‌ శతకం పూర్తి చేసుకొని చివరి వరకు నిలిచాడు. 46ఓవర్లో నీషమ్‌, గ్రాండ్‌హోమ్‌ ఔట్‌ కావడంతో భారత్‌ ఆశలు చిగురించినా... శార్దూల్‌ వేసిన 48వ ఓవర్లో సాంట్నర్‌ సిక్స్‌, ఫోర్‌ కొట్టడంతో 11బంతులు మిగిలుండగానే న్యూజిలాండ్‌ విజయం సాధించింది. 


టీమ్‌ఇండియాకు జరిమానా

స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా చివరి రెండు టీ20ల్లో జరిమానాకు గురైన టీమ్‌ఇండియా మరోసారి అదే తప్పిదం చేసింది. తొలి వన్డేలో ఆలస్యంగా బౌలింగ్‌ చేసినందుకు గాను మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ భారత ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 80శాతం కోత విధించారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన నిర్ణీత సమయంలో 46ఓవర్లే పూర్తి చేసి.. జరిమానాకు గురైంది. 


24  ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు మొత్తం 24వైడ్లు వేయడంతో కివీస్‌కు లక్ష్యఛేదన మరింత సులువైంది. బుమ్రా ఒక్కడే 13 వైడ్లు సమర్పించి నిరాశపరిచాడు. 

111 34 - 41ఓవర్ల మధ్య టేలర్‌, లాథమ్‌ రెచ్చిపోయి ఆడడంతో 13.88 రన్‌రేట్‌తో కివీస్‌ 111 పరుగులు చేయగలిగింది. 

స్కోరు బోర్డు 

భారత్‌: పృథ్వీ షా(సి) లాథమ్‌ (బి) గ్రాండ్‌హోమ్‌ 20; మయాంక్‌ అగర్వాల్‌ (సి) టామ్‌ బ్లండెల్‌ (బి) సౌథీ 32 ; విరాట్‌ కోహ్లీ (బి) సోధీ 51 ; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) సాంట్నర్‌ (బి) సౌథీ 103 ; లోకేశ్‌ రాహుల్‌  88 నాటౌట్‌ ; కేదార్‌ జాదవ్‌ 26 నాటౌట్‌  ; ఎక్స్‌ట్రాలు: 27 ; మొత్తం: 50ఓవర్లలో 347/4 ; వికెట్ల పతనం : 1-50, 2-54, 3-156, 4-292, బౌలింగ్‌: సౌథీ 10-1- 85-2, హమిష్‌ బెన్నెట్‌ 10-0-77-0, గ్రాండ్‌హోమ్‌ 8-0-41-1, జేమ్స్‌ నీషమ్‌ 8-0-52-0, మిచెల్‌ సాంట్నర్‌ 10-0-58-0, ఇష్‌ సోధీ 4-0-27-1

న్యూజిలాండ్‌ : మార్టిన్‌ గప్టిల్‌ (సి) జాదవ్‌ (బి) శార్దూల్‌ ఠాకూర్‌ 32 ; హెన్రీ నికోల్స్‌ రనౌట్‌(కోహ్లీ) 78 ; టామ్‌ బ్లండెల్‌ (స్టంప్‌) రాహుల్‌ (బి) కుల్‌దీప్‌ యాదవ్‌ 9; రాస్‌ టేలర్‌  109 నాటౌట్‌ ; టామ్‌ లాథమ్‌ (సి) మహమ్మద్‌ షమీ (బి) కుల్‌దీప్‌ 69 ; నీషమ్‌ (బి) కేదార్‌ జాదవ్‌ (బి) షమీ 9 ; డీ గ్రాండ్‌హోమ్‌ రనౌట్‌(అయ్యర్‌/కోహ్లీ) ; సాంట్నర్‌ నాటౌట్‌ 12 ; ఎక్స్‌ట్రాలు : 29 ; మొత్తం : 48.1ఓవర్లలో 348/6 ; వికెట్ల పతనం : 1-85, 2-109, 3-171, 4-309, 5-328, 6-331 ; బౌలింగ్‌ : జస్ప్రీత్‌ బుమ్రా 10-1-53-0, షమీ 9.1-0-63-1, శార్దూల్‌ ఠాకూర్‌ 9-0-80-1, రవీంద్ర జడేజా 10-0-64-0, కుల్దీప్‌ యాదవ్‌ 10-0-84-2  


logo