మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 05, 2020 , 11:29:56

అయ్యర్‌ 'సెంచరీ' అద్భుతం.. భారత్‌ స్కోరు 347/4

అయ్యర్‌ 'సెంచరీ' అద్భుతం.. భారత్‌ స్కోరు 347/4

కేఎల్‌ రాహుల్‌(88 నాటౌట్‌: 64 బంతుల్లో 3ఫోర్లు, 6సిక్సర్లు), విరాట్‌ కోహ్లీ(51: 63 బంతుల్లో 6ఫోర్లు) అర్ధశతకాలతో విజృంభించడంతో 50 ఓవర్లలో భారత్‌ 4 వికెట్లకు 347 పరుగులు చేసింది.

హామిల్టన్‌:  న్యూజిలాండ్‌ పర్యటనలో భారత్‌ బ్యాట్స్‌మెన్‌ జోరు కొనసాగుతోంది. టీ20 సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసి ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమ్‌ఇండియా తొలి వన్డేలో గొప్పగా బ్యాటింగ్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌(103 :107 బంతుల్లో 11ఫోర్లు, సిక్స్‌) పోరాటం అద్భుతం. భారత్‌ భారీ స్కోరు సాధించిందంటే అది అయ్యర్‌ పోరాట ఫలితమే. తక్కువ స్కోరుకే ఓపెనర్లు వెనుదిరగడం.. బ్యాటింగ్‌ అంతకంతకు కష్టంగా మారుతున్న సమయంలో అయ్యర్‌ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, ఎంతో పరిణతితో బ్యాటింగ్‌ చేశాడు.  క్రీజులో పాతుకుపోయి ఆతిథ్య బౌలర్లను విసిగిస్తూ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసి వన్డే కెరీర్‌లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. 

భారత ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌(88 నాటౌట్‌: 64 బంతుల్లో 3ఫోర్లు, 6సిక్సర్లు), విరాట్‌ కోహ్లీ(51: 63 బంతుల్లో 6ఫోర్లు) అర్ధశతకాలతో విజృంభించడంతో 50 ఓవర్లలో భారత్‌ 4 వికెట్లకు 347 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత ఓపెనర్లు పృథ్వీ షా(20), మయాంక్‌ అగర్వాల్‌(32) అరుదైన రికార్డు నమోదు చేశారు.  ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ఓపెనర్లు అరంగేట్రం చేయడం భారత్‌ క్రికెట్‌ చరిత్రలో ఇది నాలుగోసారి. ఓపెనింగ్‌ జోడీ నిలదొక్కుకొని వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్లు చేజార్చుకున్నారు. 

ఆఖర్లో కేదార్‌ జాదవ్‌(26 నాటౌట్‌ 15 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌) మెరుపులు మెరిపించాడు. కివీస్‌ బౌలర్లు ఆరంభ ఓవర్లలో మినహా ఎక్కడా భారత్‌ దూకుడును అడ్డుకోలేకపోయారు. సీనియర్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ ధారళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. 10 ఓవర్లు వేసి రెండు వికెట్లు తీసి 85 రన్స్‌ ఇచ్చాడు. గ్రాండ్‌హోం, ఇష్‌ సోధీ చెరో వికెట్‌ తీశారు. ఒకానొక దశలో భారత్‌ 270 పరుగులకే పరిమితమవుతుందని అనుకున్నారు కానీ అయ్యర్‌ శతకంతో భారత్‌ పటిష్ఠస్థితిలో నిలిచింది.


logo
>>>>>>