గురువారం 22 అక్టోబర్ 2020
Sports - Oct 18, 2020 , 00:50:36

గబ్బర్‌ గర్జన

గబ్బర్‌ గర్జన

  • శతక్కొట్టిన శిఖర్‌
  • చెన్నైపై ఢిల్లీ ఘన విజయం

శిఖర్‌ ధావన్‌ బౌండ్రీల వర్షంలో షార్జా స్టేడియం తడిసి ముద్దయింది. గబ్బర్‌ పూనకం వచ్చినట్లు బాదుతుంటే.. చెన్నై బౌలర్లు చేష్టలుడిగిపోయారు. మిగిలినవారంతా తలాకొన్ని పరుగులు చేసి శిఖర్‌కు తోడు నిలిస్తే.. లీగ్‌లో ధావన్‌ తొలి సెంచరీ తన పేరిట రాసుకున్నాడు. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు సాధించిన ఢిల్లీ ఈ దెబ్బతో అనధికారికంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడితే.. చెన్నై ఆరో పరాజయంతో అరో స్థానానికే పరిమితమైంది. ఇక ముందడుగు వేయాలంటే ధోనీసేన చెమటోడ్చాల్సిందే.

షార్జా: సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌ (58 బంతుల్లో 101 నాటౌట్‌; 14 ఫోర్లు, ఒక సిక్సర్‌) అజేయ శతకంతో కదంతొక్కడంతో.. ఢిల్లీ తన జైత్రయాత్ర కొనసాగించింది. లీగ్‌లో ఏడో విజయంతో దాదాపు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ పట్టేసింది. శనివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ) 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ (47 బంతుల్లో 58; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకం సాధించగా.. అంబటి రాయుడు (25 బంతుల్లో 45 నాటౌట్‌; ఒక ఫోర్‌, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (13 బంతుల్లో 33 నాటౌట్‌; 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. ఢిల్లీ బౌలర్లలో నోర్జేకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 19.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ధావన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'అవార్డు దక్కింది. 

ధావన్‌ ధనాధన్‌..

లక్ష్యఛేదనలో ఢిల్లీకి కూడా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దీపక్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో బంతికి పృథ్వీ షా (0) బౌలర్‌కే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగగా.. రహానే (8) మరోసారి నిరాశ పరిచాడు. 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్‌ అయ్యర్‌ (23)తో కలిసి ధావన్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా బౌండ్రీలతో రెచ్చిపోయిన శిఖర్‌ 29 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయ్యర్‌తో మూడో వికెట్‌కు 68, స్టొయినిస్‌ (24)తో నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో శిఖర్‌ 57 బంతుల్లో ఐపీఎల్‌లో తొలి శతకంచేశాడు. 19వ ఓవర్‌ వేసిన సామ్‌ కరన్‌ కేవలం నాలుగే పరుగులే ఇచ్చి క్యారీ (4)ని ఔట్‌ చేయడంతో కాస్త ఉత్కంఠ రేగినా.. 6 బంతుల్లో 17 పరుగులు చేయాల్సిన దశలో అక్షర్‌ పటేల్‌ (5 బంతుల్లో 21 నాటౌట్‌; 3 సిక్సర్లు) మూడు సిక్సర్లతో జట్టును  గెలిపించాడు.

రాయుడు రాక్స్‌.. 


టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నైకి శుభారంభం దక్కలేదు. దేశ్‌పాండే వేసిన ఇన్నింగ్స్‌ మూడో బంతికి సామ్‌ కరన్‌ (0) ఔటయ్యాడు. డుప్లెసిస్‌, వాట్సన్‌ (36; 6 ఫోర్లు) కాస్త నెమ్మదిగా ఆడటంతో 9 ఓవర్లు ముగిసే సరికి ధోనీ సేన 56/1తో నిలిచింది. రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించాక వాట్సన్‌ ఔట్‌ కాగా.. అర్ధసెంచరీ అనంతరం డుప్లెసిస్‌ వెనుదిరిగాడు. క్రీజులో ఇబ్బందిగా కనిపించిన ధోనీ (3)ని నోర్జే పెవిలియన్‌ పంపాడు. అప్పటికే రెండు సిక్సర్లతో మంచి జోష్‌లో ఉన్న రాయుడుకు జడేజా జతకలవడంతో అగ్నికి వాయువు తోడైనైట్లెంది. రబాడ వేసిన 19వ ఓవర్‌లో జడేజా, రాయుడు చెరో సిక్సర్‌ కొడితే.. చివరి ఓవర్‌లో జడ్డూ మరో రెండు సిక్సర్లు అరుసుకున్నాడు. ఈ జంట అభేద్యమైన ఐదో వికెట్‌కు 21 బంతుల్లోనే 50 పరుగులు జోడించింది.

13 ఏండ్ల ఐపీఎల్‌ కెరీర్‌లో ఢిల్లీ ఓపెనర్‌ ధావన్‌ తొలి సెంచరీ నమోదు చేశాడు. 2007లో టీ20ల్లో అరంగేట్రం చేసిన ధావన్‌ మొదటి సెంచరీ చేయడానికి 268 మ్యాచ్‌లు అవసరమయ్యాయి. గతం(2019)లో కోల్‌కతాపై 97* పరుగులే ఇది వరకు శిఖర్‌ అత్యుత్తమ స్కోరు. 

1 ఐపీఎల్‌లో అతి తక్కువ మ్యాచ్‌(27)ల్లో 50 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌ రబాడ నిలిచాడు. ఇంతకుముందు సునీల్‌ నరైన్‌(32 మ్యాచ్‌లు) రికార్డును రబాడ అధిగమించాడు.

స్కోరు బోర్డు

చెన్నై: సామ్‌ కరన్‌ (సి) నోర్జే 0, డుప్లెసిస్‌ (సి) ధావన్‌ (బి) రబాడ 58, వాట్సన్‌ (బి) నోర్జే 36, రాయుడు (నాటౌట్‌) 45, ధోనీ (సి) కారీ (బి) నోర్జే 3, జడేజా (నాటౌట్‌) 33, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 20 ఓవర్లలో 179/4. వికెట్ల పతనం: 1-0, 2-87, 3-109, 4-129, బౌలింగ్‌: దేశ్‌పాండే 4-0-39-1, రబాడ 4-1-33-1, అక్షర్‌ 4-0-23-0, నోర్జే 4-0-44-2, అశ్విన్‌ 3-0-30-0, స్టొయినిస్‌ 1-0-10-0.

ఢిల్లీ: పృథ్వీ షా (సి అండ్‌ బి) దీపక్‌ 0, ధావన్‌ (నాటౌట్‌) 101, రహానే (సి) సామ్‌ కరన్‌ (బి) దీపక్‌ 8, అయ్యర్‌ (సి) డుప్లెసిస్‌ (బి) బ్రావో 23, స్టొయినిస్‌ (సి) రాయుడు (బి) శార్దుల్‌ 24, కారీ (సి) డుప్లెసిస్‌ (బి) సామ్‌ కరన్‌ 4, అక్షర్‌ (నాటౌట్‌) 21, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 19.5 ఓవర్లలో 185/5. వికెట్ల పతనం: 1-0, 2-26, 3-94, 4-137, 5-159, బౌలింగ్‌: దీపక్‌ 4-1-18-2, సామ్‌ కరన్‌ 4-0-35-1, శార్దుల్‌ 4-0-39-1, జడేజా 1.5-0-35-0, కరణ్‌ శర్మ 3-0-34-0, బ్రావో 3-0-23-1.


logo