బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Jan 22, 2020 , 04:23:00

ధవన్‌ ఔట్‌

ధవన్‌ ఔట్‌
  • గాయంతో కివీస్‌ పర్యటనకు శిఖర్‌ దూరం
  • టీ20ల్లో శాంసన్‌, వన్డేల్లో పృథీ షాకు చోటు..
  • టెస్టుల నుంచి ఇషాంత్‌ ఔట్‌

న్యూఢిల్లీ : కీలకమైన న్యూజిలాండ్‌ పర్యటనకు ముందు టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయం కారణంగా ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ టూర్‌ మొత్తానికి దూరమయ్యాడు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఐదు టీ20ల సిరీస్‌లో అతడి స్థానంలో యువ వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ జట్టులోకి వచ్చాడు. సుదీర్ఘ కాలంగా ఎంపికవుతున్నా.. తుదిజట్టులో చోటు కోసం వేచి చూసిన సంజూకు ఈ నెల లంకతో జరిగిన మూడో టీ20లో అవకాశం వచ్చింది. 


ఆ తర్వాత కివీస్‌ పర్యటనకు అతడిని విస్మరించడంతో.. ఓ మ్యాచ్‌ ఆడించి ఎలా తీసేస్తారంటూ సెలెక్షన్‌ కమిటీపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ధవన్‌కు గాయమవడంతో ఆ స్థానంలో శాంసన్‌ మళ్లీ జట్టులోకి వచ్చాడు. మరి కివీస్‌లోనైనా అతడికి తుదిజట్టులో చోటు దక్కుతుందేమో చూడాలి. కాగా.. మూడు వన్డేల సిరీస్‌ కోసం మంగళవారం ప్రకటించిన భారత జట్టులో యువ సంచలనం పృథ్వీ షా చోటు దక్కించుకున్నాడు. ఇప్పటికే రెండు టెస్టులు ఆడిన పృథ్వీ.. 50 ఓవర్ల ఫార్మాట్‌కు ఎంపికవడం ఇదే తొలిసారి.  


మరోవైపు రంజీ ట్రోఫీలో చీలమండ గాయానికి గురైన సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ న్యూజిలాండ్‌తో వచ్చే నెల 21 నుంచి జరుగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు అందుబాటులో లేకుండాపోయాడు. ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో అర్ధశతకాలతో అదరగొట్టిన ధవన్‌.. మూడో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ఎడమ భుజం గాయానికి గురయ్యాడు. బ్యాటింగ్‌కు సైతం దిగలేకపోగా... చేతికి కట్టుతో కనిపించాడు. ధవన్‌ భుజానికి ఎంఆర్‌ఐ స్కానింగ్‌ నిర్వహించామని, గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడికి విశ్రాంతి అవసరమని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. చికిత్స కోసం ఫిబ్రవరి మొదటి వారంలో శిఖర్‌... జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ)కి వెళతాడని వెల్లడించింది. ఇటీవల ఫిట్‌నెస్‌ పరీక్షలో విఫలమైన హార్దిక్‌ పాండ్యను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. మళ్లీ జాతీయ జట్టులోకి రావాలంటే బరోడా తరఫున దేశవాళీలో ఆడి అతడు ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంది. 


ఇషాంత్‌ గాయం తీవ్రం

రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతున్న ఇషాంత్‌ శర్మ.. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో సోమవారం చీలమండ గాయం పాలయ్యాడు. బౌలింగ్‌ చేస్తున్న సమయంలో పాదం మడతపడి విలవిల్లాడిన ఇషాంత్‌ వెంటనే మైదానాన్ని వీడాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడు ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని డీడీసీఏ చెప్పింది. కాగా, ఇషాంత్‌ స్థానంలో టెస్టు సిరీస్‌ కోసం నవ్‌దీప్‌ సైనీ ఎంపికయ్యే అవకాశం ఉంది.   


వన్డే జట్టులో పృథ్వీ 

న్యూజిలాండ్‌తో వచ్చే నెల ఐదో తేదీ నుంచి జరిగే మూడో వన్డేల సిరీస్‌ కోసం సెలెక్షన్‌ కమిటీ మంగళవారం జట్టును ప్రకటించింది. గాయం కారణంగా ధవన్‌ దూరమవడంతో దేశవాళీల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న పృథ్వీ షా జట్టులో చోటు దక్కించుకున్నాడు. డోపింగ్‌ పరీక్షల్లో విఫలమై ఎనిమిది నెలల నిషేధం ఎదుర్కొన్నాక జాతీయ జట్టుకు పృథ్వీ తొలిసారి ఎంపికయ్యాడు. 


వన్డే జట్టు : విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), పృథ్వీ షా, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), శివమ్‌ దూబే, కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చాహల్‌, రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, నవ్‌దీప్‌ సైనీ, శార్దూల్‌ ఠాకూర్‌, కేదార్‌ జాదవ్‌ 


logo