శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Oct 04, 2020 , 21:18:00

KXIP vs CSK: రాణించిన రాహుల్‌..

KXIP vs CSK: రాణించిన  రాహుల్‌..

దుబాయ్: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ తన అద్భుత బ్యాటింగ్‌తో  ఆద్యంతం అలరించాడు.  పదునైన చెన్నై బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొంటూ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో  మరో అర్ధశతకాన్ని నమోదు చేశాడు. రాహుల్‌(63: 52 బంతుల్లో  7ఫోర్లు, సిక్స్‌), నికోలస్‌ పూరన్‌(33: 17 బంతుల్లో ఫోర్‌, 3సిక్సర్లు)  రాణించడంతో పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు  చేసింది.మయాంక్‌ అగర్వాల్‌(26), మన్‌దీప్‌ సింగ్‌(27) ఫర్వాలేదనిపించారు.  చెన్నై బౌలర్లలో  శార్దుల్‌ ఠాకూర్‌ రెండు వికెట్లు పడగొట్టగా జడేజా, చావ్లా చెరో వికెట్‌ తీశారు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను   రాహుల్‌ ఒంటిచేత్తో  నడిపించాడు. ఏ దశలోనూ ఇబ్బంది పడని అతడు  కళాత్మక  బ్యాటింగ్‌తో  బౌలర్లకు చుక్కలు చూపించాడు. రాహుల్‌, మయాంక్‌(26) జోడీ శుభారంభాన్నందించారు.  పవర్‌ప్లేలో వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.   మయాంక్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మన్‌దీప్‌ సింగ్‌ క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.  చావ్లా వేసిన 11వ ఓవర్లో 2 సిక్సర్లు బాది 17 రన్స్‌ రాబట్టాడు.  జడేజా  వేసిన  తర్వాతి  ఓవర్లో  మన్‌దీప్‌ వెనుదిరిగాడు.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.  జడ్డూ వేసిన 14వ ఓవర్లో పూరన్‌ ఫోర్‌,సిక్సర్‌ బాది 13 పరుగులు సాధించగా...శార్దుల్‌ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 6,4,4 కొట్టి 16 రన్స్‌ రాబట్టడంతో పంజాబ్‌ 15 ఓవర్లలోనే 130 మార్క్‌ చేరుకుంది.  ఆఖరి ఓవర్లలో విజృంభించాలని భావించిన పంజాబ్‌కు శార్దుల్‌ షాకిచ్చాడు. 18వ ఓవర్లో వరుస బంతుల్లో  క్రీజులో కుదురుకున్న పూరన్‌, రాహుల్‌ను ఔట్‌ చేసి  స్కోరు వేగానికి బ్రేక్‌ వేశాడు. చివర్లో మాక్స్‌వెల్‌(11 నాటౌట్‌), సర్ఫరాజ్‌ ఖాన్‌(14 నాటౌట్‌)  స్కోరును 170 దాటించారు.