శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 26, 2020 , 20:50:53

టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన షరపోవా..

టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన షరపోవా..

ఐదు సార్లు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ విన్నర్‌.. ప్రముఖ రాష్యా టెన్నిస్‌ క్రీడాకారిణి మరియా షరపోవా.. టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపారు. బుధవారం వోగ్యూ మేగజైన్‌ ఇంటర్వ్యూలో మాట్లాడిన షరపోవా.. తక్షణమే టెన్నిస్‌కు గుడ్‌బై చెబుతున్నానని తెలిపారు. నిత్యం గాయాల కారణంగా మైదానంలో తన ఆటను పూర్తి స్థాయిలో ప్రదర్శించలేకపోతున్నానని ఆమె అన్నారు. 32 ఏళ్ల షరపోవా.. భుజం నొప్పితో బాధ పడుతోంది. ఇటీవల జరిగిన గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్లలో ఆమె ఘోరంగా విఫలమవుతున్నారు. దానికి కారణం భుజం నొప్పి తిరగబెట్టడమేనని తెలుస్తోంది. మాజీ వరల్డ్‌ నెంబర్‌వన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి అయిన మరియా.. ప్రస్తుతం 373వ ర్యాంకులో ఉంది.

షరపోవా టెన్నిస్‌ కేరీర్‌ను 2003లో ఆరంభించారు. తానాడిన మొదటి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో అంతగా రాణించలేదు. 2004లో 17 ఏళ్ల షరపోవా, ఎలాంటి అంచనాలు లేకుండా వింబుల్డన్‌లో అడుగుపెట్టింది. ప్రతి మ్యాచ్‌లో ప్రత్యర్థులపై విరుచుకుపడిన షరపోవా.. ఫైనల్‌ పోరులో టాప్‌స్టార్‌ సెరినా విలియమ్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో డిపెండింగ్‌ ఛాంపియన్‌ సెరీనా గెలుస్తుందని అందరూ భావించారు. కానీ, అందరి అంచనాలు తలకిందులు చేసిన షరపోవా, సెరీనాను 6-1, 6-1 తో వరుస సెట్లలో చిత్తుచేసి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. 

వింబుల్డన్‌ గెలిచిన ఏడాదికే షరపోవా వరల్డ్‌ నెంబర్‌వన్‌ ర్యాంకు సాధించారు. టెన్నిస్ లో నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన మొదటి రష్యా క్రీడాకారిణి షరపోవా కావడం విశేషం. 2004లో వింబుల్డన్‌ టైటిల్‌ సాధించిన షరపోవా.. 2006లో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌, 2012, 2014 సీజన్స్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించారు. మొత్తం 10 సార్లు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఫైనల్‌కు చేరిన షరపోవా, 5 సార్లు విజేతగా నిలిచారు. తాను సాధించిన విజయాలు, అపజయాల పట్ల వెనిదిరిగి చూసుకోననీ.. భవిష్యత్‌ గురించి అతిగా ఆలోచించనని మరియా తెలిపారు. ఇదే తన విజయ రహస్యమని ఈ మాజీ నెంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ తెలిపారు. తన ఆటతీరు, అందం-అభినయంతో షరపోవా కోట్లాది మంది అభిమానులను సంపాదించారు. మోడల్ గానూ షరపోవా విజయవంతమయ్యారు.


logo