బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 05, 2020 , 01:39:11

సూపర్‌ ఓపెనర్స్‌

సూపర్‌ ఓపెనర్స్‌

అదరగొట్టిన వాట్సన్‌, డుప్లెసిస్‌.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం ఊపు మీదున్న ఓపెనర్లు బంతికో పరుగు చొప్పున కొట్టడంతో పంజాబ్‌ ఓ మోస్తరు స్కోరు చేస్తే.. వెటరన్‌ ఓపెనర్లు దంచికొట్టడంతో చెన్నై చిందేసింది. హ్యాట్రిక్‌ పరాజయాలతో రేసులో వెనుకబడ్డ ధోనీసేన ఈ విజయంతో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది. శనివారం డబుల్‌ హెడర్‌లో హోరాహోరీని ఆస్వాదించిన అభిమానులకు.. ఆదివారం వాట్సన్‌, డుప్లెసిస్‌ వన్‌సైడ్‌ వార్‌ ఎలా ఉంటుందో రుచి చూపించారు.

దుబాయ్‌: గత మూడు మ్యాచ్‌ల్లో పరాజయాలతో డీలా పడ్డ చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఎట్టకేలకు ఉపయుక్తమైన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆదివారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ సేన 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (52 బంతుల్లో 63; 7 ఫోర్లు, ఒక సిక్స్‌) అర్ధశతకంతో మెరువగా.. ఆఖర్లో నికోలస్‌ పూరన్‌ (17 బంతుల్లో 33; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. చెన్నై బౌలర్లలో శార్దుల్‌ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఓపెనర్లు వాట్సన్‌ (53 బంతుల్లో 83 నాటౌట్‌; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), డుప్లెసిస్‌ (53 బంతుల్లో 87 నాటౌట్‌; 11 ఫోర్లు, ఒక సిక్సర్‌) అదరగొట్టడంతో ధోనీ సేన 17.4 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 181 పరుగులు చేసింది. వాట్సన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. 

ఇద్దరూ ఇద్దరే..

టార్గెట్‌ ఛేజింగ్‌లో సూపర్‌ కింగ్స్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. డుప్లెసిస్‌, వాట్సన్‌ పోటీపడి పరుగులు చేయడంతో ధోనీ సేన అలవోకగా లక్ష్యం దిశగా సాగింది. కాట్రెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో వాట్సన్‌ 2 ఫోర్లు బాదితే.. జోర్డన్‌ ఓవర్‌లో డుప్లెసిస్‌ 4 ఫోర్లు కొట్టాడు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసేసరికి ధోనీ సేన 60/0తో నిలిచింది. ఈ జోడీని విడదీసేందుకు పంజాబ్‌ కెప్టెన్‌ రాహుల్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో వాట్సన్‌ 31 బంతుల్లో.. డుప్లెసిస్‌ 33 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. బౌలర్లకు సలహాలు ఇచ్చేందుకు వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు పూరన్‌కు అప్పగించి ఫీల్డింగ్‌ చేసిన రాహుల్‌కు తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. బౌలర్‌ ఎవరనేదానితో సంబంధం లేకుండా వాట్సన్‌, డుప్లెసిస్‌ చెలరేగుతుంటే రాహుల్‌ చూస్తూ నిలబడిపోయాడు. తొలి వికెట్‌కు 181 పరుగులు చేసిన వీరిద్దరూ వికెట్‌ నష్టపోకుండా జట్టును గెలిపించారు. 

రాహుల్‌ నిలిచినా..

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌కు చక్కటి ఆరంభం లభించింది. అత్యధిక పరుగుల జాబితా టాప్‌లో ఉన్న రాహుల్‌, మయాంక్‌ మంచి ప్రదర్శన కనబర్చడంతో.. పంజాబ్‌ పవర్‌ ప్లే ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. అయితే చెన్నై బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో పరుగుల రాక కష్టమైంది. 9వ ఓవర్లో మయాంక్‌ ఔట్‌ కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన మన్‌దీప్‌ (27) ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. రాహుల్‌ క్రీజులో నిలదొక్కుకున్నా ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. పూరన్‌ రాకతో స్కోరు బోర్డులో కదలిక వచ్చింది. అయితే 18వ ఓవర్‌లో పూరన్‌, రాహుల్‌ వరుస బంతుల్లో ఔట్‌ కావడంతో పంజాబ్‌ భారీ స్కోరు చేయలేకపోయింది. ఆఖర్లో సర్ఫరాజ్‌ (14 నాటౌట్‌), మ్యాక్స్‌వెల్‌ (11) కొన్ని విలువైన పరుగులు జతచేశారు. 

  • ఐపీఎల్‌ చరిత్రలో పది వికెట్ల తేడాతో విజయం సాధించడం చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఇది రెండో సారి. 
  • ఐపీఎల్‌లో 100 క్యాచ్‌లు పట్టిన రెండో వికెట్‌కీపర్‌గా ధోనీ నిలిచాడు. 
  • పంజాబ్‌తో మ్యాచ్‌లో రాహుల్‌ క్యాచ్‌ పట్టడం ద్వారా అతడు ఈ రికార్డు అందుకున్నాడు. మహీ కంటే ముందు దినేశ్‌ కార్తీక్‌ ఈ ఫీట్‌ సాధించాడు.

స్కోరు బోర్డు

పంజాబ్‌: రాహుల్‌(సి) ధోనీ (బి) ఠాకూర్‌ 63, అగర్వాల్‌(సి) కరన్‌ (బి)చావ్లా 26, మన్‌దీప్‌సింగ్‌ (సి)రాయుడు (బి) జడేజా 27, పూరన్‌ (సి) జడేజా(బి) ఠాకూర్‌ 33, మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 11 , సర్ఫరాజ్‌ ఖాన్‌ (నాటౌట్‌)14; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 178/4; వికెట్ల పతనం: 1-61, 2-94, 3-152, 4-152; బౌలింగ్‌: చాహర్‌ 3-0-17-0, కరన్‌ 3-0-31-0, ఠాకూర్‌ 4-0-39-2, బ్రావో 4-0-38-0, జడేజా 4-0-30-1, చావ్లా 2-0-22-1. 

చెన్నై: వాట్సన్‌ (నాటౌట్‌) 83 , డుప్లెసిస్‌ (నాటౌట్‌) 87 ; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 17.4 ఓవర్లలో 181/0; బౌలింగ్‌: కాట్రెల్‌ 3-0-30-0, షమీ 3.4-0-35-0, బ్రార్‌ 4-0-41-0, జోర్డాన్‌ 3-0-42-0, బిష్ణోయ్‌ 4-0-33-0.