శనివారం 04 జూలై 2020
Sports - May 31, 2020 , 00:26:36

ఏం చేయలేక.. జోక్స్‌ వేసుకున్నాం

ఏం చేయలేక.. జోక్స్‌ వేసుకున్నాం

సెహ్వాగ్‌-ద్రవిడ్‌ 410 పరుగుల భాగస్వామ్యం

2006 లాహోర్‌ టెస్టుపై అఫ్రిది వ్యాఖ్య ప్రత్యర్థి జట్టులో నలుగురు ప్లేయర్లు సెంచరీలు బాదితే.. మన ఓపెనర్లిద్దరే నాలుగొందల పైచిలుకు పరుగులు చేశారు. ముల్తాన్‌కా సుల్తాన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ బ్యాట్‌ నుంచి చినుకులా మొదలైన బౌండ్రీల జడివాన చూస్తుండగానే వరదలా మారి గడాఫీ స్టేడియాన్ని ముంచెత్తిన క్షణాన.. ఈ తుఫాను ఆగేవరకు ఏం చేయాలో తోచని పాకిస్థాన్‌ బౌలర్లు.. జోక్‌లు వేసుకుంటూ కాలక్షేపం చేశారట! మరి ఆ విశేషాలెంటో ఓసారి చూద్దామా.. 

న్యూఢిల్లీ: కార్గిల్‌ యుద్ధం అనంతరం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో క్రికెట్‌ ఆడేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చని భారత్‌.. 2004 పర్యటనలో దాయాదిని చిత్తుచేసి టెస్టు సిరీస్‌ గెలుచుకుంది. అదే ఊపులో రెండేండ్ల తర్వాత (2006) రాహుల్‌ ద్రవిడ్‌ నాయకత్వంలోని భారత జట్టు మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు పాక్‌లో అడుగుపెట్టింది. లాహోర్‌ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో టాస్‌ గెలిచిన పాక్‌ కెప్టెన్‌ ఇంజమాముల్‌ హక్‌ మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. యూనిస్‌ఖాన్‌ (199), యూసుఫ్‌ (173), అఫ్రిది (103), కమ్రాన్‌ అక్మల్‌ (102 నాటౌట్‌) శతకాలతో కదం తొక్కడంతో పాకిస్థాన్‌ 679/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

వీరేంద్రుడి విశ్వరూపం

అప్పటి భారత సారథి ద్రవిడ్‌ (233 బంతుల్లో 128 నాటౌట్‌; 19 ఫోర్లు).. సెహ్వాగ్‌ (247 బంతుల్లో 254; 47 ఫోర్లు, సిక్సర్‌)తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించేందుకు క్రీజులో అడుగుపెట్టాడు. ‘ది వాల్‌' నెమ్మదిగా ఇన్నింగ్స్‌ నిర్మిస్తుంటే.. మరో ఎండ్‌లో చిచ్చరపిడుగు సెహ్వాగ్‌ మాత్రం రెచ్చిపోయాడు. అసలే ఫ్లాట్‌ వికెట్‌, ఆపై ఫుల్‌ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు.. ఇంకేముంది పాక్‌ బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఒక్క వికెట్‌ దక్కలేదు. అదే సమయంలో వరుణుడు మ్యాచ్‌ను అడ్డుకోవడంతో వరుసగా నాలుగు రోజుల పాటు సెహ్వాగ్‌-ద్రవిడ్‌ జోడీ బ్యాటింగ్‌ చేయడం విశేషం. తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 410 పరుగులు జోడించాక సెహ్వాగ్‌ ఔట్‌ కావడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. ఇందులో సెహ్వాగ్‌ ఫోర్ల ద్వారానే 188 పరుగులు రాబట్టడం గమనార్హం. అయితే వర్షం దెబ్బతో ఆ మ్యాచ్‌ చివరకు డ్రా గా ముగిసింది.

వాళ్లను ఔట్‌ చేయలేక..


అయితే ఈ మ్యాచ్‌లో ఎంత ప్రయత్నించినా వికెట్లు తీయలేకపోవడంతో తాము జోక్‌లు వేసుకుంటూ కాస్త స్థిమితపడ్డామని పాక్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది తాజాగా వెల్లడించాడు. ఆనాటి మ్యాచ్‌కు సంబంధించిన ఓ ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు దీన్ని గుర్తు పట్టారా అని ప్రశ్నించగా.. ‘అద్భుతమైన జ్ఞాపకాలు. 2006 భారత పర్యటనలో లాహోర్‌ మ్యాచ్‌ చిత్రమిది. అక్తర్‌ ఎప్పుడైనా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు చెమటలు పట్టిస్తాడు.. కానీ, అది ఫ్లాట్‌ వికెట్‌ కావడంతో మా బాధను మర్చిపోయేందుకు జోక్స్‌తో సరిపెట్టుకున్నాం’ అని అఫ్రిది బదులిచ్చాడు.


logo