e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home స్పోర్ట్స్ స్వర్ణ కల నెరవేరేనా..!

స్వర్ణ కల నెరవేరేనా..!

స్వర్ణ కల నెరవేరేనా..!
  • టోక్యో బరిలో ఏడుగురు భారత రెజ్లర్లు
  • బజరంగ్‌, వినేశ్‌పై భారీ అంచనాలు

సుదీర్ఘ ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌కు రెజ్లింగ్‌లో ఇప్పటి వరకు ఐదు పతకాలు వచ్చినా.. స్వర్ణం మాత్రం అందలేదు. అప్పుడెప్పుడో 1952 ఒలింపిక్స్‌లో ఖాషాబా జాదవ్‌ కాంస్యం నెగ్గాక.. 56 ఏండ్ల తర్వాత 2008, 2012 గేమ్స్‌లో సుశీల్‌ కుమార్‌ వరుసగా కాంస్య, రజతాలు దక్కించుకున్నాడు. ఆ తర్వాతి రెండు విశ్వక్రీడల్లో భారత్‌కు ఒక్కో పతకం వచ్చినా పసిడి ఆకాంక్ష అలానే ఉండిపోయింది. ఈసారి టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ పటిష్ఠంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా బజరంగ్‌ పూనియా, వినేశ్‌ ఫోగట్‌పై ఆకాశమంత అంచనాలు ఉన్నాయి.

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికల్లో సత్తాచాటిన మన రెజ్లర్లు.. ఒలింపిక్స్‌లో భారత స్వర్ణ ఆకాంక్షను నెరవేర్చాలని పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా బాహుబలుడు బజరంగ్‌ పూనియా, టెక్నిక్‌ క్వీన్‌ వినేశ్‌ పోగట్‌పై టోక్యో విశ్వక్రీడల్లో ఆశలు అధికంగా ఉన్నాయి. ఈ ఇద్దరు స్టార్లు పతకం కొట్టడం పక్కా అన్న బలమైన అంచనాలు ఉన్నా.. స్వర్ణం సాధిస్తారా అన్నది నిరీక్షణగా ఉంది. మరోవైపు అంచనాల భారం లేని రెజ్లర్లు అద్భుతం చేయాలని ఆకాంక్షిస్తున్నారు. మొత్తంగా ఈ నెల 23న ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున ముగ్గురు పురుష, నలుగురు మహిళా రెజ్లర్లు ప్రత్యర్థుల పట్టుపట్టేందుకు సిద్ధమయ్యారు.

ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలతో పతకాలు

- Advertisement -

టోక్యో ఒలింపిక్స్‌లో విజేతలు అందుకోనున్న పతకాలను నిర్వాహకులు వినూత్నంగా తయారు చేయించారు. మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు వివిధ ఎలక్ట్రానిక్‌ వస్తువుల వ్యర్థాల నుంచి సేకరించిన బంగారు, వెండి, ఇనుము ఖనిజాలతో పతకాలకు రూపకల్పన చేశారు. జపాన్‌ ప్రజలు వ్యర్థంగా పడేసిన దాదాపు 79వేల మొబైల్‌ ఫోన్లు, చిన్న ఎలక్ట్రానిక్‌ వస్తువుల నుంచి వీటిని సేకరించారు. ప్రాచీన ఒలింపిక్స్‌లో ఆలివ్‌ చెట్ల ఆకులతో చేసిన కిరీటాలను విజేతలకు ప్రదానం చేయగా.. ఆధునిక ఒలింపిక్స్‌(1896) నుంచి పతకాల సంప్రదాయం వచ్చింది. మరోవైపు కరోనా నేపథ్యంలో ఈసారి విజేతలు తమకు దక్కిన పతకాలను ఎవరి మెడలో వారు వేసుకోవాలని ఐవోసీ చీఫ్‌ బాచ్‌ పేర్కొన్నారు.

టోక్యోలో కరోనా విజృంభణ

ఒలింపిక్స్‌ మరో ఎనిమిది రోజుల్లో ప్రారం భం కానుండగా.. టోక్యోలో నానాటికీ పెరుగుతున్న కరోనా కేసులు భయపెడుతున్నాయి. నగరంలో బుధవారం 1,149 కేసులు నమోదు కాగా ఇది ఆరు నెలల గరిష్ఠమని టోక్యో మెట్రోపాలిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ తరుణంలో సమావేశమైన జపాన్‌ ప్రధాని యొషిహిండే సుగా, ఐవోసీ చీఫ్‌ బాచ్‌.. ఒలింపిక్స్‌ను సురక్షితంగా నిర్వహిస్తామని ప్రకటించారు.

సెనియాతో సింధు తొలిపోరు

టోక్యో విశ్వక్రీడల్లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు..ఇజ్రాయిల్‌కు చెందిన పొలికర్పోవా సెనియాతో తొలిపోరులో తలపడనుంది. గ్రూపు-జేలో ఉన్న ఆరోసీడ్‌ సింధు ఈనెల 25న బరిలోకి దిగనుంది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్‌..మిషా జిల్బర్‌మన్‌(ఇజ్రాయిల్‌)తో తొలి మ్యాచ్‌ ఆడనున్నాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌, చిరాగ్‌శెట్టి ద్వయం.. చైనీస్‌ తైపీ జోడీతో తమ పోరును ప్రారంభించనుంది.

వినేశ్‌పై కొండంత ఆశ

మహిళల విభాగంలో 2021 ఆసియా చాంపియన్‌, 2019 ప్రపంచ కాంస్య పతక విజేత వినేశ్‌ ఫోగట్‌పై భారత్‌ భారీ ఆశలు పెట్టుకుంది. ఒలింపిక్స్‌ కోసం తీవ్రంగా శ్రమించిన వినేశ్‌.. స్వర్ణమే తన లక్ష్యమంటున్నది. శక్తితో పాటు మంచి ప్రణాళికతో ప్రత్యర్థి పట్టుపట్టే ఫోగట్‌.. ఫామ్‌ను కొనసాగిస్తే విశ్వక్రీడల చాంపియన్‌గా నిలువడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే వినేశ్‌కు జపాన్‌ రెజ్లర్‌ మయు ముకైదా రూపంలో గట్టిపోటీ ఉంది. ఎదురుదాడి చేసే సమయంలో పాయింట్లు కోల్పోవడం వినేశ్‌ బలహీనతగా ఉండగా.. దీన్ని అధిగమిస్తే అద్భుతం జరగొచ్చు. యువ రెజ్లర్లు సీమా బిస్లా, అన్షు మాలిక్‌, సోనమ్‌ మాలిక్‌లపై పెద్దగా అంచనాలు లేకపోయినా.. ఆ విషయమే వారికి అదనపు సానుకూలత కూడా. ఒత్తిడి లేకుండా బరిలోకి దిగుతున్నందున వీరు అద్భుతాలు చేసే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా వీరి టెక్నిక్‌పై ప్రత్యర్థి రెజ్లర్లకు ఎక్కువగా అవగాహన లేకపోవడం కూడా ఈ ముగ్గురికి సానుకూలాంశం. 2016 ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌ను దేశవాళీ మ్యాచ్‌ల్లో వరుసగా ఓడించి విశ్వక్రీడల అవకాశాన్ని దక్కించుకున్న సోనమ్‌ సత్తాచాటుతుందేమో చూడాలి.

బజరంగ్‌ దూకుడు కొనసాగిస్తే..

కుస్తీ పోటీకి దిగాక.. దూకుడు సూత్రాన్నే పాటించే భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా.. ఇటీవలి టోర్నీల్లో చేసిన ప్రదర్శనను టోక్యోలో కొనసాగిస్తే స్వర్ణం పట్టే అవకాశం ఉంది. చివరి 10 అంతర్జాతీయ టోర్నీల్లో ఆరు స్వర్ణాలు, మూడు రజతాలు, ఓ కాంస్యంతో బజరంగ్‌ తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. అయితే రింగ్‌లో ఎంతో దూకుడుగా ఉండే బజరంగ్‌ డిఫెన్స్‌ విషయంలో కాస్త వెనుకంజలో ఉన్నాడు. ఆరంభంలోనే ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకోవడం అతడి బలహీనత. మరోవైపు అలుపెరుగకుండా ప్రత్యర్థిపై దాడి చేసే రవి కుమార్‌ దహియా… నిలకడ ప్రదర్శిస్తే పతకం సాధించగలడు. టెక్నిక్‌, కండబలం రవి సొంతం. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన దహియా.. టోక్యోలో మ్యాజిక్‌ చేస్తాడేమో చూడాలి. 2019 ప్రపంచ టోర్నీ రజత పతక విజేత దీపక్‌ పూనియాకు కండబలం సానుకూలాంశంగా ఉండగా.. డిఫెన్స్‌లో లోపాలు అతడికి బలహీనతగా మారాయి.

టోక్యో ఒలింపిక్స్‌లో మన రెజ్లర్లు

  • పురుషుల విభాగం: బజరంగ్‌ పూనియా (65 కేజీలు), రవి దహియా (57 కేజీలు), దీపక్‌ పునియా (86 కేజీలు)
  • మహిళల విభాగం: వినేశ్‌ ఫోగట్‌ (53 కేజీలు), సీమా బిస్లా (50 కేజీలు), అన్షు మాలిక్‌ (62 కేజీలు), సోనమ్‌ మాలిక్‌ (62 కేజీలు)

ఒలింపిక్స్‌లో భారత పతకాలు

  • సుశీల్‌ కుమార్‌ (కాంస్యం) 2008 బీజింగ్‌, రజతం – 2012 లండన్‌
  • యోగేశ్వర్‌ దత్‌ (కాంస్యం) 2012 లండన్‌
  • సాక్షి మాలిక్‌ (కాంస్యం) 2016 రియో)
  • ఖాషాబా జాదవ్‌ (కాంస్యం) 1952 హెల్సింకి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స్వర్ణ కల నెరవేరేనా..!
స్వర్ణ కల నెరవేరేనా..!
స్వర్ణ కల నెరవేరేనా..!

ట్రెండింగ్‌

Advertisement