సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Sep 02, 2020 , 01:21:39

దాడి ఘటనపై రైనా వరుస ట్వీట్లు

దాడి ఘటనపై రైనా వరుస ట్వీట్లు

  న్యూఢిల్లీ: ఐపీఎల్‌ 13వ సీజన్‌ నుంచి అర్ధాంతరంగా వైదొలగడంపై చెన్నై సూపర్‌కింగ్స్‌(సీఎస్‌కే) వైస్‌ కెప్టెన్‌ సురేశ్‌ రైనా తొలిసారి స్పందించాడు. పంజాబ్‌లో తన కుటుంబ సభ్యులపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ మంగళవారం ట్విట్టర్‌లో రైనా రాసుకొచ్చాడు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన దాడిలో తన మామ, సోదరుడు చనిపోవడంతో పాటు బువా(అత్త) చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందంటూ రైనా ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించాడు. ‘పంజాబ్‌లో నా కుటుంబంపై దారుణంగా జరిగిన దాడికి గల కారణాలేంటో తెలియడం లేదు. తొలుత మా మామయ్య చనిపోగా, మృత్యువుతో పోరాడి  నా సోదరుడు తుదిశ్వాస విడిచాడు. మా అత్త పరిస్థితి చాలా విషమంగా ఉంది, ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు’ అని రాసుకొచ్చాడు. మరో సందేశంలో ‘దాడి ఘటనకు సంబంధించి అసలు కారణాలు ఏంటో ఇప్పటికీ తెలియడం లేదు. విచారణ జరిపి అసలు దోషులు ఎవరో పంజాబ్‌ పోలీసులు గుర్తించాలి. కనీస మానవత్వం లేకుండా ఇలాంటి దాడికి తెగపడ్డ వాళ్లు..మరిన్ని దారుణాలకు పాల్పడకుండా చూడాలి’ అని అంటూ పంజాబ్‌ సీఎం అమరిందర్‌సింగ్‌ను ట్యాగ్‌ చేస్తూ రైనా ట్వీట్‌ చేశాడు. అయితే దాడి ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం అమరిందర్‌సింగ్‌ ప్రకటించారు. నేరస్థులను త్వరలో పట్టుకొని శిక్షిస్తామని రైనాకు ఆయన హామి ఇచ్చారు. 


logo