ఆదివారం 07 మార్చి 2021
Sports - Feb 09, 2021 , 01:33:48

తొలి రౌండ్‌లో సెరెనా అలవోక గెలుపు

తొలి రౌండ్‌లో సెరెనా అలవోక గెలుపు

  • హలెప్‌, ఒసాక ముందడుగు.. కెర్బెర్‌కు నిరాశ
  • వరుస సెట్లలో జొకోవిచ్‌, థీమ్‌ విజయం 

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌ దూకుడుగా ఆరంభించింది. తొలి రౌండ్‌లో ప్రత్యర్థిని చిత్తుచేసి ముందడుగేసింది. సెరెనా సోదరి వీనస్‌, స్టార్‌ ప్లేయర్లు హలెప్‌, నవోమీ ఒసాక ముందడుగేశారు. తనకు అచ్చొచ్చిన కోర్టులో పురుషుల ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ ఆరంభ పోరులో సత్తాచాటగా.. యువ కెరటాలు థీమ్‌, జ్వెరెవ్‌ దూకుడు కనబరిచారు.  

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేటను అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ అలవోక విజయంతో మొదలుపెట్టింది. సోమవారం టోర్నీ ప్రారంభం కాగా.. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సెరెనా 6-1, 6-1తో లారా సెగేమండ్‌ (జర్మనీ)ను చిత్తుచేసింది. 24వ గ్రాండ్‌స్లామ్‌ కోసం కలర్‌ఫుల్‌ క్యాట్‌సూట్‌లో సమరాన్ని ఆరంభించిన సెరెనా ఓ దశలో వరుసగా 10 గేమ్‌లు గెలిచి ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వలేదు. రెండో రౌండ్‌లో స్టోజనోవిక్‌తో సెరెనా తలపడనుంది. మరో మ్యాచ్‌లో సెరెనా సోదరి వీనస్‌ విలియమ్స్‌ 7-5, 6-2తో క్రిస్టెన్‌ ఫ్లిప్‌కెన్స్‌పై గెలిచింది. 2019 తర్వాత వీనస్‌కు గ్రాండ్‌స్లామ్‌లో ఇదే తొలి విజయం. ఇక రెండో సీడ్‌ సిమోనా హలెప్‌ 6-2, 6-1తో ఎల్‌ కాబ్రెరాపై వరుస సెట్లలో గెలిచింది. యూఎస్‌ ఓపెన్‌ చాంప్‌ నవోమి ఒసాక (జపాన్‌) 6-1, 6-2తో పావ్‌లించెన్‌కోవా (రష్యాపై) నెగ్గి రెండో రౌండ్లో అడుగుపెట్టింది. 23వ సీడ్‌ అంజెలిక్‌ కెర్బెర్‌ 0-6, 4-6తో 63వ ర్యాంకర్‌ బెర్నార్డ్‌ పెరా (అమెరికా) చేతిలో ఓడింది. గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ ఇగా స్వియాటెక్‌, సబలెంక, పెట్రా క్విటోవా తొలి పోరులో విజయాలు సాధించారు. 

జొకోవిచ్‌ గంటన్నరలోనే.. 

ఎనిమిది సార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో అలవోక విజయం సాధించాడు. టాప్‌ ర్యాంకర్‌ జొకో 6-3, 6-1, 6-2తో జెరెమీ చార్డీ (ఫ్రాన్స్‌)పై 91నిమిషాల్లోనే నెగ్గాడు. మూడో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ 7-6 (7/2), 6-2, 6-3తో కుకుష్కిన్‌ (ఖజకిస్థాన్‌)పై వరుస సెట్లలో గెలిచాడు. తొలి సెట్‌ను టై బ్రేకర్‌లో కోల్పోయాక అసహనంతో రాకెట్‌ను నేలకేసి కొట్టిన ఆరో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ 6-7 (8/10), 7-6 (7/5), 6-3, 6-2తో మార్కోస్‌ గిరోనాపై విజయం సాధించి రెండో రౌండ్‌ చేరాడు. ఎనిమిదో సీడ్‌ డిగో స్వార్జ్‌మన్‌, ఫాబ్లో కరెనో బుస్టా, మిలోస్‌ రోనిక్‌, స్టాన్‌ వావ్రింకా వారి ప్రత్యర్థులపై తొలి రౌండ్‌లో గెలిచారు. ఎనిమిదేండ్ల విరామం తర్వాత... 

మానసిక ఆందోళన, తీవ్రమైన కాలి గాయం వల్ల ఐదేండ్ల పాటు ఆటకు దూరమైన కెనడా ప్లేయర్‌ రెబెకా మరినో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో శుభారంభం చేసింది. క్వాలిఫయర్స్‌ ద్వారా ఎనిమిదేండ్ల విరామం తర్వాత గ్రాండ్‌స్లామ్‌ పోటీలోకి దిగిన మరినో మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో 6-0, 7-6 (11/9)తో కింబ్లే బిరెల్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచింది. గాయం కారణంగా 15 నెలలు ఆటకు పూర్తిగా దూరమై.. ఆస్ట్రేలియా పోరుతో పునరాగమనం చేసిన మరో కెనడా స్టార్‌, 8వ సీడ్‌ బియాంకా ఆండ్రెస్క్యూ  6-2, 4-6, 6-3 తేడాతో మిహేలా బుజారెన్‌స్కూ (రొమేనియా)పై గెలిచింది. విజయం సాధించాక భావోద్వేగంతో బియాంకా కన్నీరు పెట్టుకుంది.

VIDEOS

logo