పారిస్: 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత సెరెనా విలియమ్స్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైనా చివరి సెట్లో గర్జించి విజయం దక్కించుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో అమెరికా దిగ్గజం సెరెనా 6-3, 5-7, 6-1 తేడాతో మిహాలే జుజారెన్స్కూ (రొమేనియా)పై చెమటోడ్చి గెలిచింది. మూడు సెట్ల పాటు జరిగిన మ్యాచ్‌లో సెరెనా ఐదు ఏస్‌లు, 26 విన్నర్లు సాధించగా.. మిహాలే 25 విన్నర్లు చేసింది. పదో సీడ్ స్విస్ ప్లేయర్ బెలిండా బెన్‌కిక్ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. అన్‌సీడెడ్ దారియా కసట్కినా (రష్యా) చేతిలో 2-6, 2-6 తేడాతో బెన్‌కిక్ ఓడిపోయింది. మార్క్రెటా వంద్రుసోవా 6-1, 6-3తో హర్మొని టాన్‌పై గెలిచింది. అజరెంక, మాడిసన్ కీస్, కాలిన్స్ రెండో రౌండ్లో గెలిచారు.
పురుషుల సింగిల్స్‌లో గ్రీక్ స్టార్ ప్లేయర్ స్పెఫనోస్ సిట్సిపాస్ మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఐదో సీడ్ సిట్సిపాస్ 6-3, 6-4, 6-3 తేడాతో పెడ్రో మార్టిన్జ్పై వరుస సెట్లలో అలవోకగా గెలిచాడు. ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 7-6 (7/4), 6-3, 7-6(7/1) తేడాతో క్వాలిఫయర్ రోమన్ సైఫుల్ (రష్యా)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో 11వ సీడ్ రాబెర్టో బటిస్టా ఆగట్ 3-6, 6-2, 3-6, 2-6తో హెన్రీ లాకోసొనెన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. కాగా తొలి రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ 6-2, 6-4, 6-2తో టెనిస్ సాండ్‌గ్రెన్ (అమెరికా)పై విజయం సాధించాడు.