అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు ఆశాభంగం ఎదురైంది. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డును అందుకోవాలని చూసిన సెరెనా..వింబుల్డన్ నుంచి అనుకోని రీతిలో నిష్క్రమించింది. తొలి రౌండ్లోనే గాయం కారణంగా తప్పుకుంది. ఏడుసార్లు వింబుల్డన్ టైటిల్‌ను ముద్దాడిన సెరెనా..సెంటర్ కోర్టులో కాలుజారి గాయపడటంతో ప్రత్యర్థికి వాకోవర్కు ఇస్తూ కన్నీటితో కోర్టును వీడింది.
లండన్: 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత సెరెనా విలియమ్స్ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీ తొలి రౌండ్లోనే దురదృష్టకర రీతిలో వైదొలిగింది. తడిగా ఉన్న సెంట్రల్ కోర్టుపై రెండుసార్లు కాలు అదుపు తప్పడంతో గాయపడింది. ఆట కొనసాగించడం కష్టమవడంతో కోర్టులోనే భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది. 100వ ర్యాంకర్ అలియాసంద్ర సన్సోవిచ్తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ ఆరంభ సెట్లోనే సెరెనాను దురదృష్టం వెంటాడింది. ఐదో గేమ్‌లో ఫోర్‌హ్యాండ్ షాట్ కొట్టే క్రమంలో సెరెనా కాలు మడత పడింది. 3-3తో ఉన్న సమయంలో మెడికల్ టైమౌట్ తీసుకున్న విలియమ్స్ ఆ తర్వాత గేమ్‌లో సరిగా నిలబడలేకపోయింది. గాయం తీవ్రతతో మ్యాచ్ కొనసాగించలేక.. ముఖానికి చేతులు అడ్డుపెట్టుకొని కన్నీరు పెట్టుకుంది. రాకెట్‌తో అభిమానులకు అభివాదం చేస్తూ భావోద్వేగంగా కోర్టును వీడింది. సుదీర్ఘ కెరీర్లో గ్రాండ్‌స్లామ్ టోర్నీ మ్యాచ్ మధ్యలో నిష్క్రమించడం సెరెనాకు కేవలం ఇది రెండోసారే. మార్గరేట్ కోర్ ్ట(24) పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డును సమం చేయాలని నాలుగేండ్లుగా ప్రయత్నిస్తున్న సెరెనా (23) వింబుల్డన్‌లో సాధ్యమవుతుందని భావించింది. 2018, 2019లో ఫైనల్ చేరినా టైటిల్ దక్కకపోవడంతో ఈసారైనా విజయం సాధించి చరిత్ర సృష్టించాలనుకుంది. అదే అచ్చొచ్చిన కోర్టులో చరిత్ర సృష్టించాలనుకున్న సెరెనాను దురదృష్టం దెబ్బతీసింది.
ఆండ్రెస్కూ ఔట్
మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్ బియాంక ఆండ్రెస్కూ(కెనడా)కు ఆదిలోనే షాక్ ఎదురైంది. తొలి రౌండ్లో బియాంక 2-6, 1-6 తేడాతో అన్‌సీడెడ్ అసీడ్ కర్నెట్ చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలైంది. రెండోసీడ్ అర్యానా సబలెంక (బెలారస్) చెమటోడ్చి మూడో రౌండ్ చేరింది. రెండో రౌండ్లో సబలెంక 4-6, 6-3, 6-3 తేడాతో క్యాటీ బౌల్టర్ (బ్రిటన్)పై మూడు సెట్లపాటు పోరాడి గెలిచింది. మూడో సీడ్ ఎలీనా స్వితోలినా, విక్టోరియా అజరెంకా రెండో రౌండ్లో అడుగుపెట్టగా.. తొమ్మిదో సీడ్ బెనికిక్కు ఆదిలోనే షాక్ ఎదురైంది.
సెంటర్ కోర్టు ఎందుకిలా..
తొలి మ్యాచ్‌లోనే జొకోవిచ్ రెండుసార్లు కాలుజారి కిందపడడం.. ఫెదరర్‌తో తలపడి రెండు సెట్లు గెలిచిన అడ్రియన్ మనారినో అదే విధంగా గాయపడి టోర్నీ నుంచి వైదొలగడం.. తాజాగా సెరెనా విలియమ్స్ విషయంలోనూ అదే జరగడంతో వింబుల్డన్‌లోనే ప్రముఖమైన సెంటర్ కోర్టు నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెంటర్ కోర్టు జారే విధంగా ఉందని బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే కూడా ట్వీట్ చేశాడు. అయితే వర్షం కారణంగా రూఫ్ మూసి ఉంచి పోటీలు నిర్వహిస్తుండడంతోనే పచ్చిక ఎక్కువ తడిగా ఉందని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ చెప్పింది. స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కూడా ఇది సాధారణమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు.
జొకో అలవోకగా
ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో అలవోకగా గెలిచాడు. 6-3, 6-3, 6-3 తేడాతో వరుస సెట్లలో కెవిన్ ఆండర్సన్ (దక్షిణాఫ్రికా)ను చిత్తు చేసిన జొకో.. మ్యాచ్ మొత్తంలో కేవలం ఆరు తప్పిదాలే చేసి, ప్రత్యర్థికి బ్రేక్ పాయింట్ అవకాశమే ఇవ్వలేదు.