మంగళవారం 31 మార్చి 2020
Sports - Jan 23, 2020 , 00:21:53

గాఫ్‌ జోరు

గాఫ్‌ జోరు

అమెరికా యువ సంచలనం కోరి గాఫ్‌ మరోసారి మెరిసింది. తొలి రౌండ్లో వీనస్‌ విలియమ్స్‌ను ఓడించిన ఈ 15 ఏండ్ల అమ్మాయి రెండో రౌండ్లోనూ గెలిచి.. డిఫెండింగ్‌ చాంపియన్‌ నవోమీ ఒసాకాతో పోరుకు సిద్ధమైంది. పురుషుల సింగిల్స్‌లో జొకోవిచ్‌, ఫెదరర్‌ సునాయాస విజయాలతో మూడో రౌండ్‌కు దూసుకెళ్లగా.. ఎనిమిదో సీడ్‌ బెరెటినికి వందో ర్యాంకు ఆటగాడు సాండ్‌గ్రెన్‌ షాకిచ్చాడు. పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు దివిజ్‌ శరణ్‌ ముందంజ వేయగా.. రోహన్‌ బోపన్న జోడీ ఓటమిపాలైంది. మహిళల డబుల్స్‌లో టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా నేడు బరిలోకి దిగనుంది.

  • రెండో రౌండ్‌లో ఉత్కంఠ గెలుపు
  • జొకోవిచ్‌, ఫెదరర్‌ ముందంజ
  • పురుషుల డబుల్స్‌లో శరణ్‌ జోడీ విజయం
  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

మెల్‌బోర్న్‌: ఏడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత వీనస్‌ విలియమ్స్‌ను తొలి రౌండ్‌లో ఓడించిన 15ఏండ్ల అమెరికా యువ సంచలనం కోరి గాఫ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో జోరు కొనసాగిస్తున్నది. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లోనూ విజయం సాధించి.. డిఫెండింగ్‌ చాంపియన్‌ నవోమీ ఒసాకాతో పోరుకు సిద్ధమైంది. మరోవైపు సెరెనా విలియమ్స్‌, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌, స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ సునాయాసంగా మూ డో రౌండ్‌లో ప్రవేశించారు. బుధవారమిక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో గాఫ్‌ 4-6, 6-3, 7-5తేడాతో సొరన సిర్టీ(రొమేనియా)పై విజయం సాధించింది. రెండు గంటల ఆరు నిమిషాల పా టు మ్యాచ్‌ జరుగగా.. తొలిసెట్‌లో ఇద్దరు ప్లేయర్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. 3-3తో గేమ్స్‌ సమంగా ఉన్న సమయంలో గాఫ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన సిర్టీ ముందడుగు వేసింది. దీంతో వెనుకబడ్డట్టు కనిపించిన గాఫ్‌ తొలి సెట్‌ ను కోల్పోయింది. 


ఆ తర్వాత షాట్లకు పదునుపెట్టిన అమెరికా టీనేజర్‌ విరుచుకుపడింది. రెండో సెట్‌ ప్రారంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించి ఓ దశలో 3-0కు చేరింది. ఆ తర్వాత ప్రత్య ర్థి కాస్త కోలుకున్నా... ఏ మాత్రం అవకాశం ఇవ్వని గాఫ్‌ 6-3తో సెట్‌ను కైవసం చేసుకుం ది. అనంతరం నిర్ణయాత్మక సెట్‌లో తొలి గేమ్‌ సర్వీస్‌ బ్రేక్‌కు గురై  వెనుకబడినా... ఆత్మైస్థెర్యం కోల్పోకుండా గాఫ్‌ అద్భుతంగా పుంజుకుంది. ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేయడం సహా దూకుడైన ఆటతో 5-5తో సమం చేసింది. చివరి వరకు అదే జోరు కొనసాగించి 7-5తో సెట్‌ను కైవసం చేసుకున్న గాఫ్‌ మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. టెన్నిస్‌ గ్రేటెస్ట్‌ కావడమే తన లక్ష్యమని ప్రకటించిన కోరీ గాఫ్‌ తదుపరి రౌండ్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఒసాకపై ఎలా ఆడుతుందో చూడాలి. మరో మ్యాచ్‌లో మూడో సీడ్‌ ఒసాక(జపాన్‌) 6-2, 6-4తేడాతో సైసై జెంగ్‌(చైనా)పై అలవోకగా గెలిచింది. అయితే, రెండో సెట్‌లో సర్వీస్‌ బ్రేక్‌కు గురైనప్పుడు రాకెట్‌ను నేలకేసి కొట్టింది. 


సెరెనా ముందడుగు 

23గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత సెరెనా విలియమ్స్‌(అమెరికా) ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మరో అలవోక విజయంతో దూకుడు కొనసాగించింది. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో సెరెనా 6-2, 6-3తేడాతో తమర జిడాన్‌సెక్‌(స్లోవెనియా)పై గంటా 18నిమిషాల్లోనే గెలిచింది. మూడో రౌండ్లో వాంగ్‌ క్వింగ్‌(చైనా)తో విలియమ్స్‌ తలపడనుంది. మరో మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ(ఆస్ట్రేలియా) 6-1, 6-4తేడాతో పొలోన హెర్కోగ్‌(స్లోవేనియా)పై 66నిమిషాల్లోనే విజయం సాధించింది. ఏడో సీడ్‌ క్విటోవా(చెక్‌ రిపబ్లిక్‌) 7-5, 7-5తేడాతో పౌలా బదోసా(స్పెయిన్‌)పై గెలిచింది. 


బెరెటినికి షాక్‌ 

పురుషుల సింగిల్స్‌ రౌండో రౌండ్‌లో ఎనిమిదో సీడ్‌ మటియో బెరెటెనికి ఓటమి ఎదురైంది. వందో ర్యాంకు ఆటగాడు సాండ్‌గ్రెన్‌(అమెరికా) చేతిలో 6-7(7/9), 4-6, 6-4, 6-2, 5-7 తేడాతో బెరెటెని ఓడిపోయాడు. మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ 6-1, 6-4, 6-2తేడాతో ఇటో(జపాన్‌)పై వరుస సెట్లలో గెలిచాడు.  ఫెదరర్‌ 6-1, 6-4, 6-1తేడాతో క్రాజినోవిక్‌(సెర్బియా)పై గెలిచి ముందడుగు వేశాడు. ప్రత్యర్థి గాయం కారణంగా వైదొలగడంతో ఆరో సీడ్‌ స్పెఫినోస్‌ సిట్సిపాస్‌కు నేరుగా మూడో రౌండ్‌లో ప్రవేశించాడు. 


శరణ్‌ గెలుపు, బోపన్న ఔట్‌ 


పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అర్టెమ్‌ సిటాక్‌(న్యూజిలాండ్‌)తో కలిసి ఆడిన భారత ప్లేయర్‌ దివిజ్‌ శరణ్‌ విజయం సాధించగా... జపాన్‌ సహచరుడు యసుకుటా ఉచియామాతో బరిలోకి దిగిన రోహన్‌ బోపన్న ఓటమిని చవిచూశాడు. బుధవారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్లో శరణ్‌ జోడీ 6-4, 7-5తేడాతో పాబ్లో కారెనో(పోర్చుగీస్‌), సౌసా(స్పెయిన్‌) ద్వయంపై గెలిచింది. బోపన్న - ఉచియామా జోడీ 1-6, 6-3, 3-6తేడాతో అమెరికా బ్య్రాన్‌ సోదరులు బోబ్‌, మైక్‌ చేతిలో ఓడారు. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణి సానియా మీర్జా.. తన భాగస్వామి నాడియా కిచనోక్‌(ఉక్రెయిన్‌)తో కలిసి గురువారం బరిలోకి దిగనుంది. చైనా ద్వయం హన్‌ - జు లిన్‌తో సానియా జోడీ తలపడనుంది. కాగా, మిక్స్‌డబుల్స్‌ పోటీ నుంచి సానియా వైదొలిగింది. 


logo
>>>>>>