సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Sep 09, 2020 , 03:19:35

సెరెనా సెంచరీ

సెరెనా సెంచరీ

  • ఆర్థర్‌ ఆష్‌ స్టేడియంలో వందో విజయం 
  • మారియాపై గెలుపుతో యూఎస్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లోకి 

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. టెన్నిస్‌ దిగ్గజం మార్గరెట్‌ కోర్ట్‌(24) రికార్డును సమం చేయాలన్న పట్టుదలతో కనిపిస్తున్న ఈ నల్లకలువ...టైటిల్‌ దక్కించుకునేందుకు మూడు అడుగుల దూరంలో ఉన్నది. సోమవారం ఆర్థర్‌ ఆష్‌ స్టేడియంలో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్‌ సెరెనా 6-3, 6-7 (6/8), 6-3తో గ్రీస్‌కు చెందిన మారియా సాకరిపై విజయం సాధించింది.  క్వార్టర్స్‌లో.. పిరోన్‌కొవా (బల్గేరియా)తో తలపడనుంది. 

  విలియమ్స్‌ @ 100 

  అమెరికాలో టెన్నిస్‌ ప్రధాన కేంద్రంగా భావించే ఆర్థర్‌ ఆష్‌ స్టేడియంలో సెరెనా అరుదైన రికార్డును అందుకుంది. ప్రపంచంలో ప్రముఖ స్టేడియాల్లో ఒకటిగా పేరొందిన ఈ స్టేడియంలో సెరెనా సెంచరీ కొట్టింది. ప్రిక్వార్టర్స్‌లో మరియాపై విజయంతో ఈ నల్లకలువ ఆర్థర్‌ ఆష్‌ స్టేడియంలో వందో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.  ఈ రికార్డు నెలకొల్పిన తొలి ప్లేయర్‌గా సెరెనా నిలిచింది. ఇక ఇతర మ్యాచ్‌ల్లో జెన్నిఫర్‌ బ్రాడి (అమెరికా), యూలియా పుతిన్‌సెవా (కజకిస్థాన్‌), నవోమి ఒసాక (జపాన్‌), షెల్బి రోజర్స్‌ (అమెరికా), పిరోన్‌కొవా, విక్టోరియా అజరెంకా (బెలారస్‌), ఎలిసే మెర్టెన్స్‌ (బెల్జియం) విజయాలు సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. రెండో సీడ్‌ సోఫియా కెనిన్‌ ప్రిక్వార్టర్స్‌లో అనూహ్యంగా ఓడింది. 

 బోపన్న ఓటమి:     

యూఎస్‌ ఓపెన్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో భారత ఆటగాడు రోహన్‌ బోపన్న-డేనిస్‌ షపోవలోవ్‌ (కెనడా) ద్వయం క్వార్టర్స్‌లో 5-7, 5-7తో వరుస సెట్లలో జీన్‌ జులియన్‌ రోజర్‌ (పోర్చుగల్‌)-హోరియా టికావు (రొమేనియా)జంట చేతిలో ఓటమి పాలైంది.

యువ ఆటగాళ్ల జోరు: 

  యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ చేజిక్కించుకునేందుకు యువ ఆటగాళ్లు పోటీ పడుతున్నారు.   పురుషుల సింగిల్స్‌  రెండో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా), మూడో సీడ్‌ డేనియల్‌ మెద్వెదేవ్‌ (రష్యా), ఐదో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరేవ్‌ (జర్మనీ) ప్రిక్వార్టర్స్‌లో గెలిచి క్వార్టర్‌  ఫైనల్స్‌కు చేరారు. 


logo