శనివారం 06 మార్చి 2021
Sports - Feb 22, 2021 , 00:49:58

నౌవాక్‌ జొకోవిచ్‌

నౌవాక్‌ జొకోవిచ్‌

తొమ్మిదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గిన సెర్బియా స్టార్‌

ఫైనల్‌లో మెద్వెదెవ్‌పై అలవోక విజయం  

గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో ఫెదరర్‌, నాదల్‌కు మరింత చేరువ 

ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో  తన లవ్‌స్టోరీని కొనసాగించాడు. అచ్చొచ్చిన టోర్నీ ఫైనల్‌లో ఓటమెరుగని రికార్డును నిలబెట్టుకుంటూ 9వ సారి టైటిల్‌ను ముద్దాడాడు. పదునైన సర్వ్‌లు, దూకుడైన ఆటతో తుదిపోరులో డానిల్‌ మద్వెదెవ్‌ను చిత్తుచేశాడు. తొలిసారి మేజర్‌ టోర్నీ విజేతగా నిలువాలనుకున్న యువ ప్రత్యర్థిని మట్టికరిపించాడు. ఆస్ట్రేలియన్‌ టోర్నీ కింగ్‌ తానేనని జొకోవిచ్‌ మరోసారి చాటిచెప్పాడు. 

మెల్‌బోర్న్‌: సెర్బియా వీరుడు నొవాక్‌ జొకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. తనకు అలవాటైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వరుసగా మూడోసారి.. ఓవరాల్‌గా తొమ్మిదోసారి టైటిల్‌ ముద్దాడాడు. ఆదివారం ఇక్కడి మెల్‌బోర్న్‌ పార్క్‌లో జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ జొకో 7-5, 6-2, 6-2 తేడాతో రష్యా యువ ఆటగాడు డానిల్‌ మెద్వెదెవ్‌పై సునాయాస విజయం సాధించి, కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ముద్దాడాడు. అత్యధిక మేజర్‌ టైటిళ్ల (20) రికార్డుతో కొనసాగుతున్న స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌, స్పెయిన్‌ స్టార్‌ రఫేల్‌ నాదల్‌కు జొకోవిచ్‌ మరింత చేరువయ్యాడు. తనకు కలిసొచ్చిన కోర్టుపై ఫైనల్‌లో దూకుడుగా ఆడి.. తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న మెద్వెదెవ్‌కు నిరీక్షణే మిగిల్చాడు.

తొలిసెట్‌ నువ్వా-నేనా 

మ్యాచ్‌ ఆరంభంలో జొకోవిచ్‌ దూకుడు కనబరిచినా మెద్వెదెవ్‌ దూసుకురావడంతో తొలిసెట్‌ రంజుగా సాగింది. 16 పాయింట్లలో 13 దక్కించుకొని 3-0తో నొవాక్‌ దూకుసుపోతున్నాడన్న సమయంలో రష్యా చిన్నోడు అదరగొట్టాడు. జొకో సర్వీస్‌ను బ్రేక్‌ చేయడం సహా గేమ్‌లను 3-3తో సమం చేసి సవాల్‌ విసిరాడు. అయితే 6-5తో ముందున్న సమయంలో అద్భుతమైన సర్వ్‌లతో డానిల్‌ను దెబ్బకొట్టిన జొకోవిచ్‌ సెట్‌ను కైవసం చేసుకున్నాడు. 

జొకోవిచ్‌ దూకుడు 

రెండో సెట్‌ ప్రారంభంలో సర్వీస్‌ కోల్పోయినా జొకో ఆ తర్వాత పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. మెద్వెదెవ్‌ను కోలుకోనీయకుండా పాయింట్లు సాధించాడు. జొకో దూకుడుతో రష్యా ప్లేయర్‌ తప్పుల మీద తప్పులు చేశాడు. మొత్తంగా ఒకేసెట్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసిన జొకో 2-0 సెట్ల ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇక మూడో సెట్‌లోనూ ఇదే తంతు నడిచింది. 3-0తో దూసుకెళ్లిన జొకోవిచ్‌ చివరికి సునాయాస విజయం సాధించాడు. మ్యాచ్‌ పాయింట్‌ సాధించగానే కోర్టుపై పడుకొని సంబురాలు చేసుకున్నాడు. గంటా 53 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో.. మెద్వెదెవ్‌ సర్వ్‌లను నొవాక్‌ ఏడుసార్లు బ్రేక్‌ చేయడంతో పాటు 73 శాతం పాయింట్లను దక్కించుకొని సత్తాచాటాడు. మహిళల సింగిల్స్‌లో జపాన్‌ ప్లేయర్‌ నవోమి ఒసాక టైటిల్‌ నెగ్గగా.. పురుషుల డబుల్స్‌లో డాడిగ్‌ -పొలాసెక్‌ జంట విజేతగా నిలిచింది. 

ప్రైజ్‌మనీ  

విజేత: రూ.15.70 కోట్లు 

రన్నరప్‌: రూ.8.56 కోట్లు 

 ఒకే గ్రాండ్‌స్లామ్‌ టోర్నీని తొమ్మిదిసార్లు గెలుచుకున్న రెండో ఆటగాడిగా జొకోవిచ్‌ నిలిచాడు. 13 ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లతో రఫేల్‌ నాదల్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. 

 జొకోవిచ్‌కు ఇది 18వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. ఇప్పటి వరకు అతడు 9సార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఐదుసార్లు వింబుల్డన్‌, మూడుసార్లు యూఎస్‌ ఓపెన్‌, ఓసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్స్‌ నెగ్గాడు. నాదల్‌, ఫెదరర్‌ అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల (20) రికార్డుకు రెండడుగుల సమీపానికి వచ్చాడు. 

 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీఫైనల్‌ చేరిన 9 సార్లూ జొకో ఫైనల్‌ చేరాడు. అన్నిసార్లు తుదిపోరులో ప్రత్యర్థులను చిత్తుచేసి టైటిళ్లు కైవసం చేసుకున్నాడు.

చివరి 10 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో జొకో ఆరు టైటిళ్లు కైవసం చేసుకున్నాడు. దీంతో ఈ ఏడాది మార్చి 8 వరకు అతడు ప్రపంచ నంబర్‌వన్‌గా ఉండడం ఖాయంగా మారింది. దీంతో జొకో టాప్‌ ర్యాంకులో ఉండి 311 వారాలు పూర్తి కానుండడంతో.. ఫెదరర్‌ (310 వారాలు) ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు కానుంది.

గాయాన్ని జయించి.. 

టోర్నీలో గాయం వేధించినా చివరికి జొకో విజయం సాధించాడు. టేలర్‌ ఫ్రిట్జ్‌తో జరిగిన మూడో రౌండ్‌లో జొకో వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అయితే ఎట్టకేలకు ఐదు సెట్లలో గెలిచి పరాభవాన్ని తప్పించుకున్నాడు. టోర్నీ నుంచి నిష్క్రమిస్తానేమోనని భయపడ్డట్లు చెప్పిన నొవాక్‌.. ఆ తర్వాత ప్రిక్వార్టర్స్‌లోనూ కష్టపడే గెలిచాడు. అయితే క్వార్టర్స్‌ నుంచి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. మళ్లీ లయ అందిపుచ్చుకొని విజయాల బాట పట్టాడు.

 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను జొకో వరుసగా మూడో ఏడాది కైవసం చేసుకోగా.. మొత్తంగా ఇది తొమ్మిదోసారి. 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021 సంవత్సరాల్లో ఆస్ట్రేలియా టైటిళ్లను నొవాక్‌ ముద్దాడాడు. 

కల నెరవేరేదెన్నడో.. 

వరుసగా 20 మ్యాచ్‌ల్లో గెలిచి సూపర్‌ ఫామ్‌లో ఉన్న రష్యా ప్లేయర్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ తుదిమెట్టుపై మరోసారి తడబడ్డాడు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఏటీపీ టూర్‌ ఫైనల్స్‌లో జొకోవిచ్‌ను ఓడించడం సహా ఫైనల్‌లో యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ థీమ్‌ను మట్టికరిపించి మెద్వెదెవ్‌ ట్రోఫీ కైవసం చేసుకున్నాడు. అయితే గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాలన్న అతడి కల మాత్రం తీరడం లేదు. 2019 యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో భంగపడిన అతడు గతేడాది సెమీఫైనల్‌లోనే వెనుదిరిగాడు. ఈసారి సూపర్‌ ఫామ్‌తో మెల్‌బోర్న్‌లో అడుగుపెట్టిన మెద్వెదెవ్‌ అదే ఊపులో వరుస విజయాలతో ఫైనల్‌ చేరాడు. కానీ తుదిమెట్టుపై ఆ జోరు కొనసాగించలేక తన కల నెరవేర్చుకోలేకపోయాడు.

VIDEOS

logo