శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 05, 2020 , 00:04:40

‘జై’స్వాల్‌

‘జై’స్వాల్‌

అండర్‌-19 ప్రపంచకప్‌లో యువ భారత ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ జైత్రయాత్ర ఇది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడుసార్లు నాటౌట్‌గా నిలిచిన అతడు 156.00 సగటుతో మొత్తం 312 పరుగులు చేసి టోర్నీ టాపర్‌గా కొనసాగుతున్నాడు. మెగాటోర్నీలో 300కు పైగా పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లో ఇప్పటి వరకు ఈ సగటే అత్యధికం.. సాధారణంగా మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే ఆటగాడు ఎక్కువసార్లు నాటౌట్‌గా నిలువడంతో అతడి సగటు బాగుంటుంది. కానీ ఓపెనర్‌గా వచ్చి ఇలాంటి యావరేజ్‌ నమోదు చేస్తున్నాడంటే అతడి కసి ఏపాటితో అర్థం చేసుకోవచ్చు.

  • 59, 29 నాటౌట్‌, 57 నాటౌట్‌, 62, 105 నాటౌట్‌..

నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: సెమీఫైనల్లో పాకిస్థాన్‌పై యశస్వి బ్యాటింగ్‌ చూసిన వారెవరైనా.. జరుగుతున్నది అండర్‌-19 మ్యాచ్‌.. ఆడుతున్నది ఓ పద్దెనిమిదేండ్ల కుర్రాడు అంటే కచ్చితంగా నమ్మ రు. పూర్తి పరిణతి సాధించిన ఓ బ్యాట్స్‌మెన్‌ క్రీజులో నిల్చొని ఉంటే ఇన్నింగ్స్‌ ఎలా సాగుతుందో.. మంగళవారం యంగ్‌ఇండియా ఆట అలాగే సాగింది. ఆరంభంలో కుదురుకునేందుకు సమయం తీసుకున్న జైస్వాల్‌.. ఒక్కసారి క్రీజులో పాతుకుపోయాక వెనుదిరిగి చూసుకోలేదు. తానెదుర్కున్న తొలి 35 బంతుల్లో కేవలం 15 పరుగులే చేసిన యశస్వి ఆ తర్వాత భారీ షాట్లతో విరుచుపడ్డాడు. 


సూపర్‌ షాట్లతో..

ఏజ్‌ గ్రూప్‌ క్రికెట్‌లో ఇప్పటికే లెక్కకు మిక్కిలి శతకాలు బాది అదుర్స్‌ అనిపించుకున్న జైస్వాల్‌.. ఈ టోర్నీ ఆరంభం నుంచి తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు. జట్టు బ్యాటింగ్‌ భారం తనపైనే ఉందని గుర్తించిన అతడు మంగళవారం ఇన్నింగ్స్‌ను చాలా పద్ధతిగా ముందుకు నడిపించాడు. చెత్త బంతులను మాత్రమే శిక్ష స్తూ.. మంచి బంతులను వదిలేశాడు. అందుకే అతడి ఇన్నింగ్స్‌లో 60కి పైగా డాట్‌బాల్స్‌ ఉన్నాయి. 


ద్రవిడ్‌ బాటలోనే..

యశస్వి వయసులో చిన్నోడే అయినా.. ఆటలో చాలా పెద్దొడినని నిరూపించుకున్నాడు. అడ్డదిడ్డమైన షాట్లకు పోకుండా.. బంతిని గాల్లోకి లేపకుండా.. అతడు కొట్టిన స్ట్రెయిట్‌ డ్రైవ్‌లు, కవర్‌ డ్రైవ్‌లు కట్టిపడేశాయనడంలో అతిశయోక్తి లేదు. అమీర్‌ బౌలింగ్‌లో కాళ్ల ముందు పడ్డ బంతిని అమాంతం అందుకున్న జైస్వా ల్‌.. తనదైన శైలిలో సిక్సర్‌ బాది మ్యా చ్‌ను ముగించడంతో పాటు సెంచరీ పూర్తి చేసుకొని విజయ గర్జన చేయడం మరిం త ఆకట్టుకుంది. సిక్సర్‌ బాదాక సింగిల్‌ తీయడం.. వరుస బౌండ్రీలు బాదినా.. బంతిని ఏమాత్రం గాల్లోకి లేపకుండా నియంత్రణ కొనసాగించడం చూస్తే.. జైస్వాల్‌లో దూకుడైన బ్యాట్స్‌మెన్‌తో పాటు రాహుల్‌ ద్రవిడ్‌ శిష్యుడు కనిపించక మానడు. ఈ పరిణతి ఇలాగే కొనసాగిస్తే.. త్వరలోనే యశస్విని భారత సీనియర్‌ జట్టులో చూడొచ్చు.


స్కోరు బోర్డు

పాకిస్థాన్‌: హైదర్‌ అలీ (సి) రవి (బి) యశస్వి 56, హురేరా (సి) దివ్యాన్ష్‌ (బి) మిశ్రా 4, మునీర్‌ (సి) అంకొలేకర్‌ (బి) రవి 0, నజీర్‌ (సి) తిలక్‌ వర్మ (బి) మిశ్రా 62, ఖాసిం (రనౌట్‌) 9, హరీస్‌ (సి) దివ్యాన్ష్‌ (బి) అంకొలేకర్‌ 21, ఇర్ఫాన్‌ ఖాన్‌ (బి) కార్తీక్‌ 3, అబ్బాస్‌ అఫ్రీది (ఎల్బీ) రవి 2, తాహిర్‌ (సి) జురేల్‌ (బి) కార్తీక్‌ 2, ఆమిర్‌ అలీ (సి) వీర్‌ (బి) మిశ్రా 1, అమీర్‌ ఖాన్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: 43.1 ఓవర్లలో 172ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-9, 2-34, 3-96, 4-118, 5-146, 6-156, 7-163, 8-169, 9-172, 10-172, బౌలింగ్‌: కార్తీక్‌ త్యాగి 8-0-32-2, సుశాంత్‌ మిశ్రా 8.1-0-28-3, రవి బిష్ణోయ్‌ 10-0-46-2, ఆకాశ్‌ సింగ్‌ 7-0-25-0, అథర్వ అంకొలేకర్‌ 7-0-29-1, యశస్వి జైస్వాల్‌ 3-0-11-1.

భారత్‌: యశస్వి (నాటౌట్‌) 105, దివ్యాన్ష్‌ (నాటౌట్‌) 59, ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: 35.2 ఓవర్లలో 176/0. బౌలింగ్‌: తాహిర్‌ 6-1-17-0, ఖాసిం 8-0-37-0, అమీర్‌ ఖాన్‌ 5-1-20-0, అబ్బాస్‌ అఫ్రీది 7-0-50-0, ఆమిర్‌ అలీ 5.2-0-38-0, మునీర్‌ 4-0-12-0.


logo