శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 02, 2020 , 00:16:35

పేస్‌కు దాసోహం

పేస్‌కు దాసోహం

ఓపెనర్లు అదరగొట్టడంతో రెండో టెస్టులో న్యూజిలాండ్‌ ఒక దశలో 66/0తో నిలిచింది. ఇంకేముంది ఈ టెస్టు కూడా చేజారినట్లే అని భావిస్తున్న సమయంలో.. భారత బౌలర్లు సమిష్ఠిగా సత్తాచాటారు. దీంతో కివీస్‌ టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ క్రీజులో నిలువలేకపోయారు. షమీ, బుమ్రా విజృంభించడంతో న్యూజిలాండ్‌ 177 రన్స్‌కే 8 వికెట్లు కోల్పోయింది.

  • మరోసారి భారత బ్యాట్స్‌మెన్‌ విఫలం
  • న్యూజిలాండ్‌తో రెండో టెస్టు
  • రెండో ఇన్నింగ్స్‌లో 90 పరుగులకే 6 వికెట్లు
  • షమీ, బుమ్రా శ్రమ వృథా

ఇంకేముంది మరో పది పరుగుల్లోపు మిగిలిన రెండు వికెట్లు పడగొడితే.. టీమ్‌ఇండియాకు మంచి ఆధిక్యం దక్కడం ఖాయమే అనుకుంటున్న తరుణంలో.. ఆరున్నర అడుగుల పేసర్‌ జెమీసన్‌ బ్యాట్‌తో కోహ్లీ సేనను దెబ్బకొట్టాడు. వాగ్నర్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 51 పరుగులు జోడించి టీమ్‌ఇండియా ఆధిక్యాన్ని ఏడు పరుగులకు పరిమితం చేశాడు.


కివీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసేసరికి ఇరు జట్ల పరిస్థితి దాదాపు సమానంగానే ఉంది. సిరీస్‌ మొత్తంలో ఇప్పటి వరకు పెద్దగా రాణించలేకపోయిన భారత బ్యాట్స్‌మెన్‌ కనీసం ఈ చివరి ఇన్నింగ్స్‌లోనైనా ఆకట్టుకొని ప్రత్యర్థికి టఫ్‌ టార్గెట్‌ ఇస్తారనుకుంటే.. మనవాళ్లు పాతపాటే అందుకున్నారు. కనీస పోరాటం కనబర్చకుండా.. ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫలితంగా 90 పరుగులకే భారత్‌ ఆరు వికెట్లు కోల్పోయింది.


ప్రస్తుతం టీమ్‌ఇండియా ఆధిక్యం 97 పరుగులు. హనుమ విహారి, రిషబ్‌ పంత్‌ క్రీజులో ఉన్నారు. ఇంకా జడేజా బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. మరి మూడో రోజు తొలి సెషన్‌లో మనవాళ్లు ఎలా ఆడతారో చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అద్భుతాలు జరుగుతాయని ఆశించడం కల్లే అయినా.. పోరాడే లక్ష్యాన్ని కివీస్‌ ముందుంచితే.. బుమ్రా బ్యాచ్‌ ఏమైనా మ్యాజిక్‌ చేస్తుందేమోనని ఆశ..!


క్రైస్ట్‌చర్చ్‌: మ్యాచ్‌పై పట్టుబిగించేందుకు బౌలర్లు సృష్టించిన అద్భుత అవకాశాన్ని బ్యాట్స్‌మెన్‌ చేజార్చడంతో టీమ్‌ఇండియా మళ్లీ కష్టాల్లో పడింది. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులోనూ పరాజయానికి చేరువై వైట్‌వాష్‌ ప్రమాదం ముంగిట నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఫర్వాలేదనిపించిన కోహ్లీసేన.. ఆదివారం పూర్తిగా తడబడింది. ఏడు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమ్‌ఇండియా కివీస్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ (3/12) రెచ్చిపోవడంతో 90 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అంతకు ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 63/0తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌.. 235 పరుగులకు ఆలౌటైంది.   షమీ (4/81), బుమ్రా (3/62) నిప్పులు చెరిగారు. ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ (52), జెమీసన్‌ (49) రాణించారు. ప్రస్తుతం నాలుగు వికెట్లు చేతిలో ఉన్న భారత్‌ ఓవరాల్‌గా 97 పరుగుల ఆధిక్యంలో ఉంది. హనుమ విహారి (5), రిషబ్‌ పంత్‌ (1) క్రీజులో ఉన్నారు. వీరిద్దరితో పాటు బ్యాటింగ్‌కు రావాల్సి ఉన్న జడేజాపైనే టీమ్‌ఇండియా ఆశలు పెట్టుకుంది. మొత్తానికి మ్యాచ్‌ మూడో రోజే.. కథ ైక్లెమాక్స్‌కు చేరింది.

 

షమీ, బుమ్రా వహ్వా.. 

టీమ్‌ఇండియా పేసర్లు మహమ్మద్‌ షమీ, జస్ప్రీత్‌ బుమ్రా రెండో రోజు ఆరంభం నుంచి పేస్‌, స్వింగ్‌తో అదరగొట్టారు. తొలి రోజు 23 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసినా.. ఒక్క వికెట్‌ కోల్పోని కివీస్‌ను వరుస వికెట్లతో ఉక్కిరిబిక్కిరి చేశారు. తొలుత బ్లండెల్‌ (30)ను ఔట్‌ చేసి ఉమేశ్‌ యాదవ్‌ (1/46) కివీస్‌ పతనానికి తెరతీయగా.. ఆ తర్వాత షమీ, బుమ్రా ద్వయం రెచ్చిపోయింది. అద్భుతమైన సీమ్‌ బంతితో కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (3)ను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. రాస్‌ టేల ర్‌ (15)ను జడేజా ఔట్‌ చేస్తే.. షమీ వేసిన ఔట్‌ స్వింగర్‌కు నికోల్స్‌ (14) వెనుదిరిగాడు. లంచ్‌ విరామం తర్వాత వాట్లింగ్‌ (0), సౌథీ (0)లను ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు పంపిన బుమ్రా భారత శిబిరంలో ఆనందం నింపాడు.


జెమీసన్‌ విజృంభణ

153/7 వద్ద క్రీజులోకి వచ్చిన పేసర్‌ జెమీసన్‌ టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ను తలపించాడు. స్టార్‌ ప్లేయర్లు తడబడిన చోట స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ ముందుకు సాగాడు. అంతవరకు వికెట్ల పండగ చేసుకున్న భారత బౌలర్లు తోకను తెంచలేక ఇబ్బంది పడ్డారు. గ్రాండ్‌హోమ్‌ (26) ఔటైనా.. వాగ్నర్‌ (21) జతగా జెమీసన్‌ రెచ్చిపోయాడు. వరుసగా బౌండరీలు బాదుతూ తొమ్మిదో వికెట్‌కు వాగ్నర్‌తో కలిసి 51 పరుగులు జతచేశాడు. దీంతో ఓ దశలో 177కే ఎనిమిది వికెట్లు కోల్పోయిన కివీస్‌ చివరికి 235 పరుగులు చేసి భారత్‌కు 7 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని మిగిల్చింది. ఈ క్రమంలో షమీ బౌలింగ్‌లో జడేజ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు వాగ్నర్‌ ఔట్‌కాగా.. జెమీసన్‌ చివరి వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు.


టపటపా.. 

7పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత బ్యాట్స్‌మెన్‌ ఏ దశలోనూ కివీస్‌ బౌలర్లను ప్రతిఘటించలేకపోయారు. న్యూజిలాండ్‌ పేసర్లు బౌల్ట్‌, సౌథీ స్వింగ్‌కు మరోసారి దాసోహమయ్యారు. మయాంక్‌  (3)ను బౌల్ట్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. పృథ్వీ షాను సౌథీ ఔట్‌ చేశాడు. కెప్టెన్‌ కోహ్లీ (14) తొలి ఇన్నింగ్స్‌ తరహాలోనే మరోసారి వికెట్ల ముందు దొరకడంతో భారత్‌ 51 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత రహానే సైతం వాగ్నర్‌ బౌలింగ్‌లో ఔట్‌కాగా..  రెండున్నర గంటల పాటు క్రీజులో నిలిచి పోరాడిన పుజార (88 బంతుల్లో 24) తక్కువ స్కోరుకే బౌల్ట్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. 


క్యా హువా.. కోహ్లీ..! 

నమస్తే తెలంగాణ క్రీడావిభాగం:ఆరేండ్ల క్రితం ఆస్ట్రేలియా వేదికగా టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న విరాట్‌ కోహ్లీ.. తన దూకుడైన ఆటతీరుతో జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. ఈ క్రమంలో తొలి సిరీస్‌ విజయం సాధించిన అనంతరం విరాట్‌ మాట్లాడుతూ.. ‘విదేశీ గడ్డపై వికెట్ల పతనాన్ని అడ్డుకునేందుకు నైట్‌వాచ్‌మెన్‌ను బ్యాటింగ్‌కు పంపడం హాస్యాస్పద నిర్ణయం. మేటి ఆటగాడు తడబడుతున్న చోట టెయిలెండర్లు ఎలా నిలబడగలరు’ అని ప్రశ్నించాడు. పరిస్థితి ఎలా ఉన్నా.. సత్తాచాటాల్సింది బ్యాట్స్‌మెనే అని బల్లగుద్ది చెప్పాడు. ఇన్నాళ్లు అదే మాటమీద నిలబడ్డ భారత కెప్టెన్‌.. న్యూజిలాండ్‌తో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వరుసబెట్టి వికెట్లు పడుతుంటే.. ఏం చేయాలో తోచక బ్యాట్స్‌మెన్‌ బాకీ ఉన్నా.. నైట్‌వాచ్‌మన్‌గా ఉమేశ్‌ యాదవ్‌ను క్రీజులోకి పంపాడు. ఈ రెండు ఉదాహరణలు కోహ్లీ వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు గెలుపు తప్ప ‘డ్రా’ కూడా సమ్మతం కాదనేలా దూసుకెళ్లిన విరాట్‌.. ప్రస్తుతం ఆత్మరక్షణలో పడ్డట్లు కనిపిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసేందుకు క్రీజులోకి వస్తున్న సమయంలోనే కాస్త అసహనంగా కనిపించిన కోహ్లీ.. న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ సందర్భంగా మరింత చికాకు కనబర్చాడు. 


అప్పుడెప్పుడో కెరీర్‌ ఆరంభంలో అభిమానులకు అసభ్యకర సంజ్ఞలు చేసి అవమానాల పాలైన కోహ్లీ.. ఇన్నేండ్ల తర్వాత ఆదివారం ఆటలో అసభ్య పదజాలం వాడి మరోసారి విమర్శకులకు పనికల్పించాడు. ఈ సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 9.50 సగటుతో 38 పరుగులు మాత్రమే చేశాడు. ఇరు జట్లలో చివరి వరుస ఆటగాళ్లు బౌల్ట్‌, షమీ కూడా ఇంతకన్నా ఎక్కువ పరుగుల చేయడం గమనార్హం. టీమ్‌ఇండియా విజయాల్లో మూల విరాట్‌గా నిలిచే.. విరాట్‌ వైఫల్యం జట్టుపై చాలా ప్రభావం చూపుతున్నది. ముందుండి నడిపించాల్సిన నాయకుడే నడిసంద్రంలో నావను వదిలేస్తుండటం భారత జట్టును కలవరపెడుతున్నది.


జడ్డూ  జాదూ.. 

భారత అత్యుత్తమ ఫీల్డర్‌ రవీంద్ర జడేజ మరోసారి అద్భుతమైన క్యాచ్‌తో ఆశ్చర్యపరిచాడు. షమీ వేసిన బౌన్సర్‌ను కివీస్‌ టెయిలెండర్‌ వాగ్నర్‌ పుల్‌ షాట్‌ ఆడగా.. స్కైర్‌లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న జడేజ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు. దాదాపు ఒక మీటర్‌ ఎత్తు నుంచి వెళ్తున్న బాల్‌ను జడ్డూ సూపర్‌ మ్యాన్‌లా అందుకోవడాన్ని చూసిన వాగ్నర్‌ నోరెళ్లబెడుతూ పెవిలియన్‌ బాట పట్టాడు. వండర్‌ క్యాచ్‌ పట్టిన జడేజాపై క్రికెట్‌ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపించింది. క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ క్యాచ్‌ల్లో ఇది ఒకటంటూ మాజీ క్రికెటర్లు, అభిమానులు ట్విట్టర్‌లో కామెంట్లు చేశారు.

స్కోరు బోర్డు

స్కోరు బోర్డు


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 242, న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లాథమ్‌ (బి) షమీ 52, బ్లండెల్‌ (ఎల్బీ) ఉమేశ్‌ 30, విలియమ్సన్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 3, టేలర్‌ (సి) ఉమేశ్‌ (బి) జడేజా 15, నికోల్స్‌ (సి) కోహ్లీ (బి) షమీ 14, వాట్లింగ్‌ (సి) జడేజా (బి) బుమ్రా 0, గ్రాండ్‌హోమ్‌ (బి) జడేజా 26, సౌథీ (సి) పంత్‌ (బి) బుమ్రా 0, జెమీసన్‌ (సి) పంత్‌ (బి) షమీ 49, వాగ్నర్‌ (సి) జడేజా (బి) షమీ 21, బౌల్ట్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 24, మొత్తం: 235 ఆటౌట్‌. వికెట్ల పతనం: 1-66, 2-69, 3-109, 4-130, 5-133, 6-153, 7-153, 8-177, 9-228, 10-235, బౌలింగ్‌: బుమ్రా 22-5-62-3, ఉమేశ్‌ 18-2-46-1, షమీ 23.1-3-81-4, జడేజా 10-2-22-2. 

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) లాథమ్‌ (బి) సౌథీ 14, మయాంక్‌ (ఎల్బీ) బౌల్ట్‌ 3, పుజారా (బి) బౌల్ట్‌ 24, కోహ్లీ (ఎల్బీ) గ్రాండ్‌హోమ్‌ 14, రహానే (బి) వాగ్నర్‌ 1, ఉమేశ్‌ (బి) బౌల్ట్‌ 1, విహారి (నాటౌట్‌) 5, పంత్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 19, మొత్తం: 90/6. వికెట్ల పతనం: 1-8, 2-26, 3-51, 4-72, 5-84, 6-89, బౌలింగ్‌: సౌథీ 6-2-20-1, బౌల్ట్‌ 9-3-12-3, జెమీసన్‌ 8-4-18-0, గ్రాండ్‌హోమ్‌ 5-3-3-1, వాగ్నర్‌ 8-1-18-1.logo