శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Jan 20, 2020 , 02:52:03

మరో టైటిల్‌పై జొకో కన్ను

మరో టైటిల్‌పై జొకో కన్ను
  • నేటి నుంచి ఆస్ట్రేలియా ఓపెన్‌

మెల్‌బోర్న్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌,  సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించాలనే పట్టుదలతో ఉన్నాడు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న సీజన్‌ ఆరంభ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ సత్తాచాటి, ఎనిమిదోసారి ఈ టైటిల్‌ను ముద్దాడాలని కసితో కనిపిస్తున్నాడు. 17వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో ఫెదరర్‌ (20), నాదల్‌ (19)ను సమీపించాలని తహతహలాడుతున్నాడు. ప్రపంచ నంబర్‌వన్‌, స్పెయిన్‌ బుల్‌ రఫేల్‌ నాదల్‌ సైతం ఫెడ్‌ రికార్డుపై కన్నేశాడు. ఆస్ట్రేలియా పోరు కోసం ఏటీపీ కప్‌నకు దూరంగా ఉన్న స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ సైతం మరో హార్డ్‌కోర్ట్‌ టైటిల్‌ కైవసం చేసుకొని తన సత్తాతగ్గలేదని చాటిచెప్పాలని పట్టుదలగా ఉన్నాడు. డేనియల్‌ మద్వెదెవ్‌ (రష్యా), డొమెనిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా), స్టెఫానో సిట్సిపాస్‌ (గ్రీస్‌) బిగ్‌ త్రీకి షాకివ్వాలని కసరత్తులు చేస్తున్నారు. భారత అగ్రశ్రేణి ఆటగాడు ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ తొలి రౌండ్‌లో జపాన్‌ ప్లేయర్‌ టసుమా ఇటోతో తలపడనున్నాడు. ఆసీస్‌లో కార్చిచ్చు చెలరేగడంతో టోర్నీ ఏర్పాట్లపై సందేహాలు నెలకొన్నా.. అడ్డంకులను అధిగమించిన నిర్వాహకులు పోటీలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

డబుల్స్‌ బరిలో సానియా

మహిళల సింగిల్స్‌లో సెరెనా విలియమ్స్‌ (అమెరికా) ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నది. ఆసీస్‌ గడ్డపై ఎనిమిదోసారి విజేతగా నిలిచి మార్గరెట్‌ కోర్ట్‌ (24) పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డును సమం చేయాలని పట్టుదలగా ఉంది. ప్రపంచ నంబర్‌వన్‌ ఆష్లే బార్టీ సొంతగడ్డపై సత్తాచాటాలని చూస్తుంటే.. డిఫెండింగ్‌ చాంపియన్‌ నవోమి ఒసాక (జపాన్‌), ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌), హలెప్‌ (రొమేనియా) కూడా టైటిల్‌పై కన్నేశారు. మహిళల డబుల్స్‌లో భారత స్టార్‌ సానియా మీర్జా బరిలో నిలిచింది. తన సహచరి కిచెనోక్‌ (ఉక్రెయిన్‌)తో కలిసి ఆమె తొలి రౌండ్‌లో హాన్‌ జియూన్‌-జూ లిన్‌ (చైనా) ద్వయంతో తలపడనుంది.


logo