హైదరాబాద్: ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా ఓ పోస్టు చేసింది. ఓ అథ్లెట్ జీవితం ఎంత కఠినంగా ఉంటుందో ఆ పోస్టులో ఆమె భావోద్వేగాన్ని పంచుకున్నది. అథ్లెట్లలో కలిగే ఒత్తిడి, వారిపై ఉన్న అంచనాలు, వాళ్ల విజయానందం, వాళ్ల ఓటమి, బాధలు ఎలా ఉంటాయన్న విషయాన్ని సానియా తన ఇన్‌స్టా పోస్టులో వెల్లడించింది. శుక్రవారం యూఎస్ ఓపెన్‌లో ఓటమి చెందిన తర్వాత సానియా ఈ పోస్టు చేసింది. ఈ ఏడాది యూఎస్ ఓపెన్‌లో రాజీవ్ రామ్‌తో కలిసి మిక్స్డ్ డబుల్స్ ఆడిన సానియా ఓపెనింగ్ రౌండ్లోనే ఓటమిపాలైంది. అథ్లెట్ల జీవితం ప్రతి రోజు, ప్రతి వారం.. గెలుపు, ఓటములతో నిండి ఉంటుందని, కన్నీళ్లు.. సంతోషం ఉంటాయని, కష్టపడడం.. బాధపడడం కామన్ అని, గాయాల నుంచి కోలుకోవడం అథ్లెట్లకు తప్పదని సానియా తన పోస్టులో రాశారు. ఆట పట్ల తనకు ఉన్న ప్రేమ, ప్రదర్శన ఇవ్వాలన్న తపన తగ్గలేదన్నారు. అభిమానులు, కుటుంబం, స్నేహితులు ఇచ్చే మద్దతు కీలకమని, వారందరికీ రుణపడి ఉంటానన్నట్లు సానియా తన పోస్టులో తెలిపింది.