మంగళవారం 31 మార్చి 2020
Sports - Jan 19, 2020 , 01:19:34

సలాం సానియా

సలాం సానియా
  • -రీఎంట్రీలో తొలి టైటిల్‌ నెగ్గిన భారత టెన్నిస్‌ స్టార్‌
  • -హోబర్ట్‌ డబుల్స్‌ ట్రోఫీ కైవసం

పట్టుదల ప్రదర్శించేందుకు మాతృత్వం ఏమాత్రం అడ్డంకాదని నిరూపిస్తూ.. ఆడాలనే తపన ఉంటే ఎన్ని అడ్డంకులైనా దాటొచ్చని చాటిచెబుతూ.. సానియా మీర్జా తన పునరాగమనాన్ని ఘనంగా చాటింది. బాబుకు జన్మనిచ్చాక పెరిగిన బరువును అదుపులోకి తెచ్చుకునేందుకు తీవ్రంగా శ్రమించిన ఈ హైదరాబాదీ.. రీఎంట్రీ తర్వాత అడుగుపెట్టిన తొలి టోర్నీలోనే టైటిల్‌ గెలిచింది. ఉక్రెయిన్‌ సహచరి కిచెనోక్‌తో కలిసి హోబర్ట్‌ డబుల్స్‌ బరిలో నిలిచిన మీర్జా.. ట్రోఫీ నెగ్గి తన చిన్నారి(ఇజాన్‌)కి కానుకగా ఇచ్చింది.

హోబర్ట్‌: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా పునరాగమనంలో అదరగొట్టింది. రెండేండ్ల విరామం అనంతరం బరిలోకి దిగిన తొలి టోర్నీలోనే టైటిల్‌ గెలిచి భళా అనిపించింది. హోబర్ట్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీ మహిళల డబుల్స్‌లో సానియా-నడియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌) జోడీ 6-4, 6-4తో రెండో సీడ్‌ షాయ్‌ పెంగ్‌-షాయ్‌ జాంగ్‌ (చైనా) జంటపై విజయం సాధించి ట్రోఫీ ఒడిసిపట్టింది. శనివారం ఇక్కడ జరిగిన తుదిపోరులో అన్‌సీడెడ్‌గా బరిలోదిగిన సానియా జంట.. గంటా 21 నిమిషాల్లో ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఇప్పటి వరకు ఆరు గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన సానియాకు ఇది 42వ డబ్ల్యూటీఏ టైటిల్‌ కావడం విశేషం. ఈ విజయంతో సానియా మీర్జా జోడీకి 13,580 డాలర్లు (రూ.9.65లక్షలు)తో పాటు ఒక్కొక్కరికి 280 ర్యాంకింగ్‌ పాయింట్లు దక్కాయి.

ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైనా..

తొలి సెట్‌లో ఇరు జోడీలు హోరాహోరీగా పోరాడటంతో ఒక దశలో స్కోరు 4-4తో సమమైంది. అయితే ఈ దశలో.. వరుసగా రెండు గేమ్‌ పాయింట్లు సాధించి సెట్‌ను సొంతం చేసుకున్న సానియా జోడీ.. రెండో సెట్‌ ఆరంభంలో కాస్త వెనుకబడ్డా ఆ తర్వాత విజృంభించి సెట్‌తో పాటు గేమ్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో సానియా జోడీ 9 బ్రేక్‌ పాయింట్లలో ఐదింటిని వినియోగించుకుంటే.. చైనా ద్వయం ఐదింట మూడు సొంతం చేసుకుంది. మొత్తం పోరులో భారత్‌-ఉక్రెయిన్‌ జంట ఒక్క డబుల్‌ ఫాల్ట్‌ కూడా చేయకపోగా.. ప్రత్యర్థి జోడీ రెండు అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.


logo
>>>>>>