సోమవారం 06 జూలై 2020
Sports - Jun 18, 2020 , 00:47:30

జవాన్లకు క్రీడాకారుల సలాం

జవాన్లకు క్రీడాకారుల సలాం

న్యూఢిల్లీ: ఈశాన్య లఢక్‌ వద్ద చైనా బలగాలతో పోరాడి అమరులైన 20మంది భారత జవాన్లకు క్రీడాలోకం ఘనంగా నివాళులు అర్పించింది. భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, మాజీలు గౌతమ్‌ గంభీర్‌, యువరాజ్‌ సింగ్‌, బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు, భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ బైచుంగ్‌ భూటియాతో పాటు అనేక మంది క్రీడాకారులు సోషల్‌ మీడియా వేదికగా జవాన్ల త్యాగాన్ని కీర్తించారు. ‘దేశాన్ని కాపాడేందుకు గాల్వాన్‌ లోయ వద్ద ప్రాణాలను త్యాగం చేసిన సైనికులకు సెల్యూట్‌ చేస్తున్నా. జవాన్ల కన్నా ధైర్యవంతులు, నిస్వార్థపరులు ఎవరూ ఉండరు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా’ అని కోహ్లీ ట్వీట్‌ చేశాడు. ప్రణాళిక ప్రకారమే చైనా ఈ దురాగతానికి తెగబడిందని, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని బైచుంగ్‌ భూటియా ట్వీట్‌ చేశాడు. చైనాకు భారత ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాలని కోరాడు. కాగా వీర జవాన్ల త్యాగాలను, కేంద్ర ప్రభుత్వ తీరును కించపరుస్తూ ట్వీట్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) వైద్యుడు మధును ఆ జట్టు యాజమాన్యం తొలగించింది.



logo