మంగళవారం 07 ఏప్రిల్ 2020
Sports - Feb 21, 2020 , 23:54:46

సాక్షి మాలిక్‌కు రజతం

సాక్షి మాలిక్‌కు రజతం
  • కాంస్యంతో సరిపెట్టుకున్న వినేశ్‌.. ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌

న్యూఢిల్లీ: ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌(53కేజీలు) ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి రాగా, మరో రెజ్లర్‌ సాక్షి మాలిక్‌(65కేజీలు) రజతాన్ని కైవసం చేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన  మహిళల రెండో రోజు పోటీల్లో మాలిక్‌ రజతం సాధిస్తే.. వినేశ్‌, అన్షు మాలిక్‌(57కేజీలు), గుర్‌శరణ్‌ ప్రీత్‌ కౌర్‌(72కేజీలు) కాంస్య పతకాలు దక్కించుకున్నారు. దీంతో మహిళల విభాగంలో ఈసారి భారత్‌కు ఎనిమిది పతకాలు రాగా, టోర్నీ చరిత్రలో ఇదే అత్యత్తుమ ప్రదర్శనగా నిలిచింది. ఈ ఏడాది టోర్నీ ముందు వరకు సీనియర్‌ ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో ఒకే స్వర్ణం ఉండగా.. గురువారం దివ్య, పింకీ, సరిత పసిడి పట్టి రికార్డు సృష్టించగా, నిర్మల రజతం దక్కించుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం 65కేజీల విభాగం ఫైనల్‌కు అలవోకగానే చేరుకున్న సాక్షిమాలిక్‌ తుదిపోరులో 0-2తేడాతో నవోమీ రూకే చేతిలో పరాజయం పాలై రజతం దక్కించుకుంది. కాగా, క్వార్టర్‌ ఫైనల్లో వినేశ్‌ ఫోగట్‌ 6-2తేడాతో మయు ముకైదా చేతిలో ఓడి నిరాశపరిచింది. అయితే కాంస్యపోరులో మాత్రం తివై కూ(వియత్నాం)పై 10-0తో తిరుగులేని విజయం సాధించింది. 


logo