బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Jan 23, 2020 , 00:45:03

మళ్లీ నిరాశే..

మళ్లీ నిరాశే..
  • మొదటి రౌండ్లోనే భారత షట్లర్ల నిష్క్రమణ
  • థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

బ్యాంకాక్‌: భారత షట్లర్లు మరోసారి తీవ్రం గా నిరాశపరిచారు. బుధవారం ఇక్కడ ప్రారంభమైన థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ టోర్నీ మెయిన్‌ డ్రా తొలి రోజే స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ సహా అందరూ ఇంటిబాట పట్టారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన సైనా నెహ్వాల్‌ 13-21, 21-17, 15-21తో అన్‌సీడెడ్‌ డెన్మార్క్‌ క్రీడాకారిణి లైన్‌ హోజ్‌మార్క్‌ జార్‌ఫెల్ట్‌ చేతిలో పరాజయం పాలైంది. ఇది వరకు లైన్‌పై ఆడిన నాలుగుసార్లు గెలిచిన సైనా.. ఈసారి మాత్రం నిలువలేకపోయింది. 47 నిమిషాల పాటు మ్యాచ్‌ జరుగగా తొలి గేమ్‌లో సైనా ఆసాంతం వెనుకబడిపోయింది. రెండో గేమ్‌ గెలిచినా.. నిర్ణయాత్మక గేమ్‌లో చేతులెత్తేసింది. గత వారం జరిగిన ఇండోనేషియా మాస్టర్స్‌లోనూ సైనా తొలి రౌండ్లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లోనే కిడాంబి శ్రీకాంత్‌, సమీర్‌ వర్మ, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ కూడా ఓటమి పాలయ్యారు. ఐదో సీడ్‌ శ్రీకాంత్‌ 21-12, 14-21, 11-21తేడాతో షేషర్‌ హిరన్‌(ఇండోనేషియా)పై, సమీర్‌ 16-21, 15-21తో లీ జీజియా(మలేషియా) చేతిలో ఓడిపోయారు. హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 17-21, 22-20, 19-21తేడాతో లీ డారెన్‌(మలేషియా)పై 68నిమిషాల పాటు  పోరాడి ఓడాడు. ప్రస్తుతం పీబీఎల్‌ టోర్నీలో ఆడుతున్న ప్రపంచ చాంపియన్‌ సింధు థాయ్‌లాండ్‌ టోర్నీకి దూరమైంది. 


logo
>>>>>>