గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 19, 2020 , 00:22:33

ఆ ఘట్టానికే పట్టం

ఆ ఘట్టానికే పట్టం
  • సచిన్‌ను భుజాన మోసిన క్షణాలకే లారెస్‌ అవార్డు
  • 20 ఏండ్లలో అత్యుత్తమ క్రీడా సన్నివేశంగా ఎన్నిక..
  • పురస్కారం అందుకున్న మాస్టర్‌ బ్లాస్టర్‌

బెర్లిన్‌: క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ను భారత ఆటగాళ్లు భుజాలపై మోసిన క్షణాలే గత రెండు దశాబ్దాల్లో అత్యుత్తమ క్రీడా సన్నివేశంగా ఎంపికైంది. 2011 ప్రపంచకప్‌ గెలిచాక టీమ్‌ఇండియా ప్లేయర్లు మాస్టర్‌ బ్లాస్టర్‌ను గౌరవించిన విధానానికే ప్రతిష్ఠాత్మక లారెస్‌ బెస్ట్‌ స్పోర్టింగ్‌ మూవ్‌మెంట్‌ అవార్డు దక్కింది. 20ఏండ్లలో ఉత్తమ క్రీడా క్షణాల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఓటింగ్‌ నిర్వహించగా.. క్రీడాభిమానులు సచిన్‌ టెండూల్కర్‌కే పట్టం కట్టారు. దీంతో మంగళవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ వా చేతుల మీదుగా లారెస్‌ బెస్ట్‌ స్పోర్టింగ్‌ మూవ్‌మెంట్‌ అవార్డును సచిన్‌ అందుకున్నాడు. ‘ఆ క్షణాలు అపూర్వమైనవి. ప్రపంచ కప్‌ గెలిచామన్న అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఓ ఉత్సవం జరగడం చాలా అరుదు. దేశమంతా ఐక్యమై సంబురం జరుపుకునే సందర్భాలు చాలా తక్కువగా వస్తాయి. అలాంటిదే ప్రపంచ కప్‌ గెలుపు. క్రీడలు ఎంత శక్తిమంతమైనవో ఇలాంటి సందర్భాలు గుర్తు చేస్తాయి. ఇప్పటికీ ఆ క్షణాలు నాతోనే ఉన్నాయి’ అని అవార్డు అందుకున్నాక మాస్టర్‌ బ్లాస్టర్‌ చెప్పాడు. 


అప్పుడే నా ప్రయాణం మొదలైంది

తన చిన్నతనంలో భారత్‌ తొలి ప్రపంచకప్‌ గెలిచిన క్షణాలను టెండూల్కర్‌ గుర్తు చేసుకున్నాడు. ‘నాకు పదేండ్లు ఉన్నప్పుడు 1983లో నా క్రికెట్‌ ప్రయాణం ప్రారంభమైంది. ఆ ఏడాదిలో భారత్‌ తొలిసారి ప్రపంచకప్‌ గెలిచింది. అది ఎంత గొప్పదో అప్పట్లో నాకు పూర్తిగా తెలియదు.. కానీ అందరూ సంబురాలు చేసుకుంటుంటే నేను భాగస్వామినయ్యా. ఎక్కడో దేశం గర్వించే ప్రత్యేకమైన విషయం జరిగిందని నాకు తెలుసు. ఏదో ఒకరోజు నేను ఆ అనుభవాన్ని  పొందాలని నిశ్చయించుకున్నా. ఇలా నా క్రికెట్‌ ప్రయాణం మొదలైంది.  22ఏండ్ల కెరీర్‌లో ప్రపంచకప్‌ను చేతబట్టుకున్న క్షణాలే నాకు అత్యంత గర్వకారణమైనవి. దేశప్రజల తరఫున నేను ఆ ట్రోఫీని అందుకున్నా’ అని సచిన్‌ అన్నాడు. లారెస్‌ అవార్డు అందుకున్న వంద శతకాల వీరుడు టెండూల్కర్‌కు  టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు. గొప్ప విజయం సాధించారని, దేశం గర్వించాల్సిన సందర్భం అంటూ ట్వీట్‌ చేశాడు. 


మెస్సి, హామిల్టన్‌కి స్టోర్ట్స్‌మెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 

బ్రిటన్‌ స్టార్‌ ఎఫ్‌1 రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌, ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాల్‌ ఆటగాడు లియోనెల్‌ మెస్సీకి లారెస్‌ ప్రపంచ స్పోర్ట్స్‌మెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌  అవార్డు దక్కింది. సమాన ఓట్లు రావడంతో ఇద్దరూ విజేతలుగా నిలిచారు. 20ఏండ్ల అవార్డుల చరిత్రలో జ్యూరీ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయలేకపోవడం ఇదే తొలిసారి. ఆరుసార్లు ఫిఫా ప్లేయర్‌ ఆఫ్‌ ఇయర్‌ మెస్సీ అవార్డుల ప్రదానోత్సవానికి వ్యక్తిగతంగా హాజరు కాలేకపోవడంతో వీడియో సందేశాన్ని పంపాడు. 


ఆ క్షణం.. చిరస్మరణీయం

2011 ఏప్రిల్‌ 2, ముంబైలోని వాంఖడే మైదానం. శ్రీలంకతో భారత్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌. విశ్వటోర్నీ దక్కించుకునేందుకు టీమ్‌ఇండియా 4పరుగుల దూరంలో ఉంది. లంక బౌలర్‌ కులశేఖర బౌలింగ్‌లో అప్పటి కెప్టెన్‌ మహీంద్ర సింగ్‌ ధోనీ మిడ్‌ఆన్‌ మీదుగా సిక్సర్‌ కొట్టి జట్టును గెలిపించాడు. ఆ క్షణం క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ రెండు చేతులు పైకిత్తి తన కల నెరవేరిందన్నట్టుగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో అంతులేని ఆనందంతో సంబురాలు చేసుకున్నాడు. భావోద్వేగానికి లోనయ్యాడు. 22 ఏండ్ల కెరీర్‌లో అప్పటికే క్రికెట్‌ చరిత్రలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నా.. ఎన్నాళ్లో నిరీక్షించిన విశ్వకప్‌ కోరిక సొంతగడ్డపై తీరడంతో యువకుడై గంతులేశాడు. ఆ తర్వాత భారత ఆటగాళ్లంతా సచిన్‌ టెండూల్కర్‌ను భుజాన ఎత్తుకొని మైదానమంతా కలియతిరిగారు. భారత క్రికెట్‌ను ఇన్నేళ్లు భుజానమోసిన సచిన్‌ను గౌరవిస్తున్నామంటూ ఉత్సాహంగా చెప్పారు. ఈ క్షణాలు భారత క్రికెట్‌ అభిమానుల కండ్ల ముందు ఇప్పటికీ మెదులుతూనే ఉంటాయి. క్రికెట్‌ ఉన్నంత వరకు చిరస్మరణీయంగానే నిలిచిపోతాయి. logo