మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Nov 08, 2020 , 19:19:55

అప్పర్‌కట్‌ వెనుక కథ ఇదే: సచిన్‌

అప్పర్‌కట్‌ వెనుక కథ ఇదే:  సచిన్‌

క్రికెట్‌లో చిరస్థాయిగా ఉండే రికార్డులను ఎన్నో సృష్టించిన భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ట్రేడ్‌మార్క్‌ షాట్లను కూడా కనుగొన్నాడు. అందులో ఒకటే అప్పర్‌కట్‌. 2003 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ వేసిన వేగవంతమైన బౌన్సర్లను అప్పర్‌ కట్‌తో సునాయాసంగా సచిన్‌ బౌండరీలు దాటించాడు. క్రికెట్‌లో కొత్త షాట్‌ను ఫేమస్‌ చేశాడు. అయితే ఆ అప్పర్‌కట్‌ను ఎప్పుడు, ఎలా కనుగొన్నాడో, దాని వెనుకకథ ఏంటనే విషయాన్ని మాస్టర్‌ బ్లాస్టర్‌ తాజాగా తన యూట్యూబ్‌ వీడియో 100 ఏంబీలో వెల్లడించాడు. అనురాజ్‌ అండే అనే అభిమాని అడిగిన ప్రశ్నకు సచిన్‌ సమాధానమిచ్చాడు. 2002 దక్షిణాఫ్రికా పర్యటనలో ఈ ఐకానిక్‌ షాట్‌ను కనుగొన్నానని తెలిపాడు. 

''2002 దక్షిణాఫ్రికా పర్యటనలో బ్లూఫౌంటైన్‌ మైదానంలో టెస్టు ఆడే సమయంలో ఇది జరిగింది. సఫారీ పేసర్‌ మఖాయా ఎన్తిని అరౌండ్‌ ద వికెట్‌ షాట్‌ బంతులు ఎక్కువగా వేసేవాడు. లెగ్త్‌ బంతులు చాలా తక్కువగా విసిరేవాడు. దక్షిణాఫ్రికా పిచ్‌లపై బౌన్స్‌ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ బౌన్సర్లను నేలమీదకు ఆడాలంటే బాల్‌ టాప్‌లో షాట్‌ కొట్టాలి. సాధారణంగా నా ఎత్తు ఉండేవారికి అది ఇబ్బందే. అందుకే ఢిపెన్స్‌ కాకుండా బౌన్సర్లను ఎందుకు బాదకూడదని అనుకున్నా. దూకుడుగా ఆడాలని ఆలోచించా. బంతిని నేలమీదుగా ఆడే బదులు థర్డ్‌మ్యాన్‌ బౌండరీ వైపునకు వెళ్లేలా.. పేస్‌ను ఉపయోగించుకొని గాల్లోకే ఆడాలని నిర్ణయించుకున్నా. ఇలా అప్పర్‌కట్‌ షాట్‌ పుట్టింది. డాట్‌ బౌల్‌ కోసం బౌన్సర్లు వేస్తే నేను బౌండరీలుగా మార్చా. ప్రణాళిక ప్రకారం నేను ఇది చేయలేదు. కొన్నిసార్లు క్రీజులోకి వెళ్లాక పరిస్థితులను బట్టి కొత్త షాట్లు ఆడాల్సి ఉంటుంది. నేను అదే చేశా'' అని సచిన్‌ టెండూల్కర్‌ తెలిపాడు.