ఆ ఐదు రోజులూ ఒకే పాట విన్నా.. డబుల్ సెంచరీ చేశా!

ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కెరీర్లో ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ ఉన్నాయి. అందులో ఒకటి 2004లో ఆస్ట్రేలియాపై సిడ్నీ టెస్ట్‌లో చేసిన డబుల్ సెంచరీ. ఆ మ్యాచ్‌లో 241 పరుగులు చేసిన మాస్టర్.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 1-1తో డ్రా అవడంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు సచిన్ ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. బ్రిస్బేన్, అడిలైడ్, మెల్బోర్న్లలో జరిగిన టెస్టులలో వరుసగా 0, 1, 37, 0, 44 పరుగులు చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ సిడ్నీ టెస్ట్‌లో రాణించాలని నిర్ణయించుకున్న మాస్టర్.. ఏకంగా డబుల్ సెంచరీతో మ్యాచ్‌ను గెలిపించాడు. అయితే ఆ చారిత్రక ఇన్నింగ్స్ ఆడే ముందు తాను ఓ పాటను పదే పదే విన్నట్లు ఈ మధ్య ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో సచిన్ వెల్లడించాడు.
సిడ్నీ టెస్ట్ ఐదో రోజులూ అదే పాటను లూప్‌లో పెట్టుకొని మరీ విన్నట్లు చెప్పాడు. ఆ పాట బ్రయాన్ ఆడమ్స్కు చెందిన సమ్మర్ ఆఫ్ 69. ఆ పాటను నేను లూప్‌లో పెట్టాను. గ్రౌండ్‌కు వెళ్లే సమయంలో, డ్రెస్సింగ్ రూమ్‌లో, బ్యాటింగ్ చేయడానికి వెళ్లే ముందు, లంచ్ టైమ్, టీ టైమ్, మ్యాచ్ తర్వాత, హోటల్‌కు వెళ్లేటప్పుడు.. ఇలా ఐదు రోజులూ ఆ పాటనే విన్నాను అని సచిన్ చెప్పాడు. ఇలాంటివి తన కెరీర్లో చాలా అరుదుగా జరిగాయంటూ.. అంతకుముందు కూడా 2003 వరల్డ్‌కప్‌లో జరిగిన ఘటనను వివరించాడు. ఆ టోర్నీలో 673 పరుగులతో మాస్టర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ వరల్డ్‌కప్‌లో తాను లక్కీ అలీకి చెందిన సుర్ ఆల్బమ్‌ను విన్నట్లు సచిన్ తెలిపాడు. అది చాలా బాగా అనిపించి.. పదే పదే విన్నట్లు చెప్పాడు.