ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sports - Aug 14, 2020 , 01:53:22

చరిత్రకు తొలి అడుగు

చరిత్రకు తొలి అడుగు

  • సచిన్‌ టెండూల్కర్‌ మొదటి శతకానికి నేటితో 30ఏండ్లు

మూడు దశాబ్దాల క్రితం సరిగ్గా ఇదే రోజు అద్భుత చరిత్రకు తొలి అడుగుపడింది. ఎవరూ ఊహించేందుకు కూడా సాహసం చేయని రికార్డుకు బీజం పడింది. అదే క్రికెట్‌ దేవుడు, వంద శతకాల వీరుడు సచిన్‌ టెండూల్కర్‌.. తొలి సెంచరీ నమోదు చేసిన రోజు. 1990లో స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక్క రోజు ముందు బ్రిటీష్‌ గడ్డపై సచిన్‌ తన కెరీర్‌లో మొదటి శతకంతో గర్జించాడు. టెస్టు మ్యాచ్‌ ఐదో రోజు కఠినతరమైన పిచ్‌పై శతకం బాది, ఇంగ్లండ్‌పై ఓడిపోయే స్థితిలో ఉన్న భారత జట్టును నిలబెట్టాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో పోరాడేందుకు టీమ్‌ఇండియాకు 17ఏండ్ల వయసులోనే సచిన్‌ ధైర్యం నూరిపోశాడు. 

నమస్తే తెలంగాణ, క్రీడావిభాగం : 1990, ఆగస్టు 14.. క్రికెట్‌ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ వంద శతకాలకు నాందిపడింది. మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆ రోజు భారత్‌ కష్టాల్లో ఉంది. చివరి రోజు 408 పరుగుల లక్ష్యం కండ్ల ముందుంది. పిచ్‌ ఎంతో కఠినంగా ఉంది. మ్యాచ్‌ను భారత్‌ డ్రా చేసుకోవడం కష్టమే అనుకున్నారంతా. ఆ సమయంలో 17ఏండ్ల సచిన్‌ టెండూల్కర్‌ క్రీజులో అడుగుపెట్టి.. ఇంగ్లండ్‌కు అడ్డుగా నిలిచాడు. దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తూనే ముందుకుసాగాడు. విజయంవంతంగా తొలి శతకం నమోదు చేసి ఇంగ్లండ్‌ గడ్డపై గర్జించాడు. మొత్తంగా 189 బంతుల్లోనే 119 పరుగులతో సచిన్‌ సత్తాచాటాడు. దీంతో 127 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశ నుంచి.. భారత్‌ ఆరు వికెట్లకు 343 పరుగులతో రోజును ముగించి.. మ్యాచ్‌ను నిలబెట్టుకుంది.   

మూడు టెస్టు ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌  ఓడినా.. సిరీస్‌ను సజీవంగా నిలబెట్టుకోగలిగింది. అప్పటి ను ంచి అద్భుత ప్రదర్శనలతో  ముందుకు సాగిన సచిన్‌  టెండూల్కర్‌ 24ఏండ్ల క్రికె ట్‌ కెరీర్‌లో అత్యధిక పరుగులు, శతకాలు, మ్యాచ్‌లు ఇలా ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. మరెన్నో మ్యాచ్‌ల్లో భారత్‌ ను గెలిపించాడు. 2011లో ప్రపంచకప్‌  ఆశను నెరవేర్చుకున్నాడు. 2012 లో వందో శతకం నమోదు చేసి..  భవిష్యత్తులో   అందుకునేందుకు దాదాపు అసాధ్యమైన చరిత్రను మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ సృష్టించాడు. 

నిన్నే జరిగినట్టుంది: సచిన్‌ 

స్వాతంత్య్ర దినోత్సవానికి ముందురోజే నేను శతకం చేశా. అందుకే అది మరింత ప్రత్యేకం. టెస్టు మ్యాచ్‌ను కాపాడడం చాలా గొప్పగా అనిపించింది. సంతృప్తినిచ్చింది. ఆ ప్రత్యేక సందర్భం నిన్నే జరిగినట్టు అనిపిస్తున్నది. అంతకు ముందే(1989) పాకిస్థాన్‌తో సియాలకోట్‌ వేదికగా జరిగిన టెస్టులో 57పరుగులు చేసి మ్యాచ్‌ను నిలబెట్టడం కూడా నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది’ - సచిన్‌ టెండూల్కర్‌


logo