గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Sep 13, 2020 , 15:35:10

టీమిండియా పేసర్ శ్రీశాంత్‌పై ముగిసిన నిషేధం

టీమిండియా పేసర్  శ్రీశాంత్‌పై ముగిసిన నిషేధం

న్యూఢిల్లీ: టీమిండియా పేసర్‌ ఎస్‌. శ్రీశాంత్‌పై విధించిన నిషేధం ఆదివారంతో ముగిసింది.  ఐపీఎల్‌-13లో స్పాట్‌ ఫిక్సింగ్‌కి  పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న  కేరళ ఆటగాడు శ్రీశాంత్‌పై తొలుత బీసీసీఐ  జీవితకాల నిషేధం  విధించింది.  గతేడాది మార్చిలో  సుప్రీంకోర్టు పేసర్‌పై జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసింది.

అలాగే తనపై విధించిన శిక్షను కూడా తగ్గించాలని బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ను ఆదేశించింది. అతడి శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ అప్పటి  బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన 2013 నుంచి అమల్లోకి వచ్చింది. ఆదివారంతో అతడి ఏడేళ్ల శిక్ష ముగిసింది. తనపై నిషేధంపై శ్రీశాంత్‌ చాలా ఏండ్ల పాటు  న్యాయ పోరాటం చేశాడు. 

37ఏండ్ల ఫాస్ట్‌బౌలర్‌ సోషల్‌ మీడియాలో స్పందించాడు.  'ఇప్పుడు  నాపై ఎలాంటి అభియోగాలు లేవు. పూర్తి స్వేచ్ఛ లభించింది.  నేను అమితంగా ప్రేమించే క్రికెట్‌ ఆడతాను. నా బౌలింగ్‌లో ప్రతీ బంతిని  అత్యుత్తమంగా విసురుతాను. గరిష్టంగా మరో ఐదు లేదా ఏడేండ్ల పాటు  ఆటలో కొనసాగుతాను. నేను  ఏ జట్టుకు ఆడినా అద్భుత ప్రదర్శన చేస్తానని' శ్రీశాంత్‌ ట్వీట్‌ చేశాడు.  శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడటంతో పాటు ఐపీఎల్‌లోనూ 44 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.


logo