పారిస్ : రష్యా టెన్నిస్ ప్లేయర్ యానా సిజికోవాను ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. అయితే గురువారం సాయంత్రం ఆమెను అదుపులో తీసుకుని కస్టడీలో ఉంచారు. గత ఏడాది డబుల్స్ మ్యాచ్‌లో ఆమె మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందని, కావాలనే ఓడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది తొలి రౌండ్లోనే డబుల్స్ స్పెషలిస్ట్ సిజికోవా ఓటమి పాలైంది. గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన జరిగిన మ్యాచ్‌లో సిజికోవా జంట కావాలనే ఓడినట్లు తెలుస్తోంది. వ్యవస్థీకృత మోసానికి పాల్పడినట్లు సిజికోవాపై ఫ్రెంచ్ పోలీసులు విచారణ చేపట్టారు. సిజికోవా-మాడిసన్ బ్రెంగ్లీ జంట గత ఏడాది తొలి రౌండ్లోనే రొమేనియా జంట చేతిలో ఓడిపోయారు. రెండవ సెట్ అయిదో పాయింట్ వద్ద రష్యా ప్లేయర్లు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం డబుల్స్‌లో సిజికోవా ర్యాంక్ 101. ఈ ఏడాది ఇప్పటికే ఏడు మంది డబుల్స్ పార్ట్‌నర్స్‌తో ఆమె ఆడింది.