బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Aug 30, 2020 , 21:11:48

ప్ర‌పంచ‌ చెస్ ఛాంపియ‌న్లుగా భార‌త్‌, ర‌ష్యా

ప్ర‌పంచ‌ చెస్ ఛాంపియ‌న్లుగా భార‌త్‌, ర‌ష్యా

హైద‌రాబాద్ : ఫిడే ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్ సంయుక్త చాంపియ‌న్లుగా భార‌త్‌, ర‌ష్యా నిలిచాయి. ఇంట‌ర్నెట్ అంత‌రాయం కార‌ణంగా ఆట ఆగిపోయిన నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ చెస్ ఫెడ‌రేష‌న్‌(ఫిడే) ఈ నిర్ణ‌యం వెలువ‌రించింది. ఫిడే అధ్య‌క్షుడు ఆర్కాడీ డ్వోర్కోవిచ్ ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. గ్లోబ‌ల్ ఇంట‌ర్నెట్ అంత‌రాయం కార‌ణంగా ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్ ప్ర‌భావానికి గురైంద‌న్నారు. ఇది భార‌త్‌తో స‌హా ప‌లు దేశాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేసింద‌న్నారు. భార‌త్‌కు చెందిన ఇద్ద‌రు ఆట‌గాళ్లు మ్యాచ్ ఫ‌లితం వ‌చ్చేలోపే ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్‌ను కోల్పోయిన‌ట్లు తెలిపారు. దీంతో మ్యాచ్ అస్ప‌ష్టంగా ఉంద‌న్నారు. 

చెస్.కామ్ అందించిన అన్ని ఆధారాలను అలాగే ఇంటర్నెట్ అంతరాయం గురించి ఇతర వనరుల నుండి సేకరించిన సమాచారాన్ని అప్పీల్స్ కమిటీ పరిశీలించింద‌న్నారు. వాటిన్నింటిని పరిగణనలోకి తీసుకున్న తరువాత ఫిడే అధ్య‌క్షుడిగా తాను రెండు జట్లను సంయుక్త విజేత‌లుగా ప్ర‌క‌టిస్తూ బంగారు పతకాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆన్‌లైన్ ఒలింపియాడ్‌లో ఆడిన భారత చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ.. రష్యా జట్టును అభినందించారు. తాము ఛాంపియన్స్ అన్నారు. ర‌ష్యాకు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. 

చెస్ ఒలింపియాడ్ ఫైనల్ మ్యాచ్ రెండవ రౌండ్‌లో భారత ఆటగాళ్ళు నిహాల్ సరీన్, దివ్య దేశ్‌ముఖ్ ఇంట‌ర్నెట్ అంత‌రాయం కార‌ణంగా తమ ఆటలతో సంబంధం కోల్పోయారు. ఆగస్టు 29న యుఎస్‌ఎను ఓడించి రష్యా జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించింది. మొదటి రౌండ్‌ను మినిమ‌ల్ మార్జిన్‌తో గెల‌వ‌గా రెండవ మ్యాచ్‌ను డ్రా చేసి ఫైనల్‌లో తమ బెర్త్‌ను ఖ‌రారు చేసుకున్నారు. మరోవైపు ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో పోలాండ్‌ను ఓడించి తొలి ఫైనలిస్ట్‌గా భారత్ నిలిచింది. ర‌ష్యా, భార‌త్‌ల మ‌ధ్య ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ ఇంట‌ర్నెట్ అంత‌రాయం కార‌ణంగా ఫిడే ఇరుజ‌ట్ల‌ను సంయుక్త విజేత‌లుగా తెలుపుతూ ప్ర‌పంచ ఛాంపియ‌న్లుగా ప్ర‌క‌టించింది. 


logo