శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Aug 04, 2020 , 00:30:37

ఐపీఎల్‌ను బహిష్కరించండి: మహాజన్‌

 ఐపీఎల్‌ను బహిష్కరించండి: మహాజన్‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో చైనా కంపెనీలకు మద్దతుగా నిలిచి.. బీసీసీఐ దేశం పట్ల అవమానకర రీతిలో ప్రవర్తించిందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ (ఎస్‌జేఎమ్‌) ఆరోపించింది. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా బోర్డు వ్యవహరించిన తీరు గర్హనీయమని ఆ సంస్థ కో కన్వినర్‌ అశ్వినీ మహాజన్‌ సోమవారం అన్నారు. యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19న మొదలయ్యే ఐపీఎల్‌-13వ సీజన్‌కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న వివో కంపెనీ సహా పలు చైనా కంపెనీలను కొనసాగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 

ఇటీవల భారత సైనికుల మరణానికి కారణమైన చైనాపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. చైనా కంపెనీలను నిషేధించాలని డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో మహాజన్‌ మాట్లాడుతూ.. ‘మార్కెట్‌లో చైనా కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే పలు కంపెనీలపై నిషేధం విధించింది. ఈ క్రమంలో దేశ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా చైనా సంస్థలతో కొనసాగేందుకు బీసీసీఐ ప్రయత్నించడం సరైంది కాదు. ఈ కారణంగానే ఐపీఎల్‌ను బహిష్కరించాలని మేము డిమాండ్‌ చేస్తున్నాం’అని అన్నారు. 


logo