ఆదివారం 06 డిసెంబర్ 2020
Sports - Sep 21, 2020 , 23:32:04

చెలరేగిన చాహల్‌.. బెంగళూరు బోణీ

  చెలరేగిన చాహల్‌.. బెంగళూరు బోణీ

దుబాయ్‌: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బోణీ కొట్టింది. సోమవారం దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 10  పరుగుల తేడాతో గెలుపొందింది.  164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో వికెట్లకు పరుగులు చేసింది. ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో(61)   అర్ధశతకంతో  మెరిశాడు.    బెంగళూరు బౌలర్లలో చాహల్‌(3/18) సంచలన ప్రదర్శన చేసి ఆర్‌సీబీ విజయంలో   కీలక పాత్ర పోషించాడు.  అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు జట్టులో యువ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌(56), డివిలియర్స్‌(51) రాణించడంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది.  

లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్‌  డేవిడ్‌ వార్నర్‌(6) అనూహ్యంగా రనౌట్‌ కావడంతో  బెయిర్‌స్టో బాధ్యతాయుత ఇన్నింగ్స్‌  ఆడాడు. మనీశ్‌ పాండే(34)తో కలిసి బెయిర్‌స్టో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. మనీశ్‌ పాండేను ఔట్‌ చేసిన చాహల్‌ 71 పరుగుల భాగస్వామ్యాన్ని తెరదించాడు. బెయిర్‌ స్టో ఔటైన తర్వాత సన్‌రైజర్స్‌పై ఒత్తిడి పెరిగింది. 16వ ఓవర్‌  రెండో  బంతికి బెయిర్‌ స్టోను బౌల్డ్‌ చేసిన చాహల్‌..ఆ తర్వాతి బంతికే విజయ్‌ శంకర్‌ను బౌల్డ్‌ చేసి బెంగళూరు శిబిరంలో ఉత్సాహం నింపాడు.  టెయిలెండర్లు వరుసగా పెవిలియన్‌ బాట పట్టడంతో ఆర్‌సీబీ గెలుపు ఖాయమైంది. 

 బెంగళూరు ఇన్నింగ్స్‌లో  దేవదత్‌ పడిక్కల్‌ (56)  స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశాడు.    రైజర్స్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొని  ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే అర్ధశతకంతో అలరించాడు.  చూడచక్కని షాట్లతో ఆద్యంతం ఆకట్టుకున్నాడు.  ఇన్నింగ్స్‌ ఆఖర్లో డివిలియర్స్‌ మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. ధనాధన్‌ ఆటతో హాఫ్‌సెంచరీ సాధించడంతో పాటు  జట్టు స్కోరును 160 దాటించాడు.  రైజర్స్‌ బౌలర్లలో నటరాజన్‌, శంకర్‌, అభిషేక్‌ శర్మ తలో వికెట్‌ తీశారు.