సోమవారం 30 నవంబర్ 2020
Sports - Oct 15, 2020 , 19:09:03

RCBvKXIP ధనాధన్‌ ఢీ: క్రిస్‌గేల్‌ వచ్చేశాడు!

 RCBvKXIP ధనాధన్‌ ఢీ:  క్రిస్‌గేల్‌ వచ్చేశాడు!

షార్జా:  ఐపీఎల్‌-13లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కింగ్స్‌ ఎలెవన్‌  పంజాబ్‌  జట్లు షార్జా వేదికగా తలపడుతున్నాయి. రెండు జట్లలోనూ హిట్టర్లు ఉండటంతో ఈ పోరులో పరుగుల వరద  ఖాయంగా కనిపిస్తోంది.  చిన్న మైదానం, ఫ్లాట్‌ వికెట్‌ కావడంతో షార్జాలో భారీ స్కోరు నమోదవుతున్నాయి.  టాస్‌ గెలిచిన బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. 

సీజన్‌ ఆరంభం నుంచి ప్రతీ మ్యాచ్‌లో విఫలమైన ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌పై పంజాబ్ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మకముంచింది.  టీ20 విధ్వంసక హిట్టర్‌ క్రిస్‌గేల్‌ తుది జట్టులోకి వచ్చినట్లు  పంజాబ్‌ సారథి కేఎల్‌ రాహుల్‌ తెలిపాడు.  మన్‌దీప్‌ సింగ్‌కు గాయమైందని చెప్పాడు. దీపక్‌ హుడా, మురుగన్‌ అశ్విన్‌లను జట్టులోకి తీసుకున్నట్లు రాహుల్‌    వెల్లడించాడు. 

సీజన్‌లో ఇప్పటి వరకు పంజాబ్  ఏడు మ్యాచ్‌లు  ఆడగా ఆరు ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది.   సెప్టెంబర్‌ 24న జరిగిన  తమ తొలి పోరులో బెంగళూరుపై పంజాబ్‌  ఘన విజయం సాధించింది. అదే ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్‌లో గెలిచి గాడిన పడాలని రాహుల్‌సేన భావిస్తోంది.  పాయింట్ల పట్టికలో బెంగళూరు(5గెలుపు, 2ఓటమి) మూడో స్థానంలో కొనసాగుతోంది.