ఆదివారం 01 నవంబర్ 2020
Sports - Sep 22, 2020 , 03:13:52

రైజర్స్‌ చేజేతులా..

రైజర్స్‌ చేజేతులా..

ప్రపంచ అత్యుత్తమ ఓపెనర్లు.. అంతకుమించిన బౌలర్లు ఉన్నా.. మిడిలార్డర్‌లో సరైన ఆటగాళ్లు లేక సన్‌రైజర్స్‌ ఓటమితో ఐపీఎల్‌ 13వ సీజన్‌ను ప్రారంభించింది. పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ పెద్దగా ప్రభావం చూపకపోయినా.. యువ ఆటగాడు దేవదత్‌ పడిక్కల్‌, మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌ దంచికొట్టడంతో మంచి స్కోరు చేసిన బెంగళూరు బౌలింగ్‌లోనూ దుమ్మురేపింది. బెయిర్‌స్టో బాదుడుతో సన్‌రైజర్స్‌ గెలుపు ఖాయం అనుకుంటున్న దశలో రెచ్చిపోయిన రాయల్‌ చాలెంజర్స్‌ బౌలర్లు   32 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. 

దుబాయ్‌: పుష్కర కాలంగా ఐపీఎల్‌ టైటిల్‌ కోసం వేచిచూస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) యూఏఈ వేదికగా జరుగుతున్న 13వ సీజన్‌లో బోణీ కొట్టింది. సోమవారం దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌)తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కోహ్లీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ (42 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధశతకం చేయ గా..డివిలియర్స్‌ (30 బంతుల్లో 51; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్ని ంగ్స్‌ ఆడాడు. హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్‌, విజయ్‌ శంకర్‌, అభిషేక్‌ శర్మ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్‌ 19.4 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ వార్నర్‌ (6) అనుహ్యంగా ఔట్‌ కాగా.. బెయిర్‌స్టో (43 బంతుల్లో 61; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మనీశ్‌ పాండే (34) రాణించినా.. మిడిలార్డర్‌ వైఫల్యంతో మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఒక దశలో 121/2తో పటిష్టంగా కనిపించిన హైదరాబాద్‌ 32 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. బెంగళూరు బౌలర్లలో చాహల్‌ 3, సైనీ, దూబే చెరో రెండు వికెట్లు పడగొట్టారు. చాహల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. 

ఆరంభం అదిరినా..

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కింది. పడిక్కల్‌, ఫించ్‌ (29) నిలకడగా ఆడటంతో చాలెంజర్స్‌ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగింది. పవర్‌ప్లే ము గిసేసరికి కోహ్లీ సేన వికెట్‌ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. ఫించ్‌ కాస్త నెమ్మదిగా ఆడినా.. మరో ఎండ్‌లో పడిక్కల్‌ వరుస బౌండ్రీలతో విరుచుకుపడ్డాడు. తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించాక వీరిద్దరూ వరుస బంతుల్లో ఔటయ్యారు. దీంతో విరాట్‌ కోహ్లీ (14), డివిలియర్స్‌ క్రీజులో అడుగుపెట్టారు. ఈ దశలో ఐదు ఓవర్ల పాటు ఒక్క బౌండ్రీ కూడా రాకపోవడంతో భారీ షాట్‌కు యత్నించిన కోహ్లీ క్యాచ్‌ ఔట్‌ అయ్యాడు. ఇక అక్కడి నుంచి బాదే బాధ్యత భుజానెత్తుకున్న డివిలియర్స్‌ చక్కటి షాట్లతో మంచి స్కోరు అందించాడు. 

 సిమ్రన్‌జీత్‌ సింగ్‌ పేరుతో..కోహ్లీ  

ప్రమాదకర కరోనా వైరస్‌తో పోరాడిన వారికి గౌరవ సూచకంగా నిలిచేందుకు ఆర్‌సీబీ ఆటగాళ్లు ముందుకొచ్చారు. మహమ్మారి ప్రబలిన సమయంలో మొక్కవోని దీక్షతో తమకు తోచిన రీతిలో ఆదుకున్న వారిని స్ఫూర్తిగా తీసుకొంటూ ‘మై కొవిడ్‌ హీరోస్‌' అని పేరున్న జెర్సీలను హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ధరించారు. చండీగఢ్‌కు చెందిన సిమ్రన్‌జీత్‌ సింగ్‌  పేరుతో ఉన్న జెర్సీ ఫొటోను  కోహ్లీ తన ట్విట్టర్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌గా పెట్టుకున్నాడు.

మార్ష్‌కు గాయం

సన్‌రైజర్స్‌ ఏరికోరి తుది జట్టులో చోటిచ్చిన ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మిషెల్‌ మార్ష్‌ గాయపడ్డాడు. తొలి ఓవర్‌ వేస్తున్న సమయంలో అతడి కాలి మడమ బెణికింది. దీంతో మార్ష్‌ బౌలింగ్‌ నుంచి తప్పుకోగా.. అతడి ఓవర్‌ను విజయ్‌ శంకర్‌ పూర్తి చేశాడు. అనంతరం ఇన్నింగ్స్‌ చివర్లో బ్యాటింగ్‌కు వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 

స్కోరు బోర్డు

బెంగళూరు: పడిక్కల్‌ (బి) శంకర్‌ 56, ఫించ్‌ (ఎల్బీ) అభిషేక్‌ 29, కోహ్లీ (సి) రషీద్‌ (బి) నటరాజన్‌ 14, డివిలియర్స్‌ (రనౌట్‌) 51, దూబే (రనౌట్‌) 7, ఫిలిప్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 163/5. వికెట్ల పతనం: 1-90, 2-90, 3-123, 4-162, 5-163, బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-25-0, సందీప్‌ 4-0-36-0, నటరాజన్‌ 4-0-34-1, మార్ష్‌ 0.4-0-6-0, శంకర్‌ 1.2-0-14-1, రషీద్‌ 4-0-31-0, అభిషేక్‌ 2-0-16-1.

హైదరాబాద్‌: వార్నర్‌ (రనౌట్‌) 6, బెయిర్‌స్టో (బి) చాహల్‌ 61, పాండే (సి) సైనీ (బి) చాహల్‌ 34, గార్గ్‌ (బి) దూబే 12, శంకర్‌ (బి) చాహల్‌ 0, అభిషేక్‌ (రనౌట్‌) 7, రషీద్‌ (బి) సైనీ 6, భువనేశ్వర్‌ (బి) సైనీ 0, సందీప్‌ (సి) కోహ్లీ (బి) స్టెయిన్‌ 9, మార్ష్‌ (సి) కోహ్లీ (బి) దూబే 0, నటరాజన్‌ (నాటౌట్‌) 3, ఎక్స్‌ట్రాలు: 15, మొత్తం: 19.4 ఓవర్లలో 153. వికెట్ల పతనం: 1-18, 2-89, 3-121, 4-121, 5-129, 6-135, 7-141, 8-142, 9-143, 10-153, బౌలింగ్‌: స్టెయిన్‌ 3.4- 0-33-1, ఉమేశ్‌ 4-0-48-0, సైనీ 4-0-25-2, సుందర్‌ 1-0-7-0, చాహల్‌ 4-0-18-3, దూబే 3-0-15-2.