ఆదివారం 01 నవంబర్ 2020
Sports - Sep 29, 2020 , 02:36:32

ఉత్కంఠ పోరులో బెంగళూరు విజయం

ఉత్కంఠ పోరులో బెంగళూరు విజయం

ఐపీఎల్‌ 13వ సీజన్‌ అభిమానులకు మస్తు మజానిస్తున్నది. రికార్డు స్థాయి ఛేజ్‌ను మరువకముందే.. అంతకుమించి సూపర్‌ థ్రిల్లర్‌తో దుబాయ్‌ దద్దరిల్లింది. పడిక్కల్‌, ఫించ్‌, ఏబీ వీరవిహారంతో బెంగళూరు గెలుపు ఖాయమనుకుంటే.. ఇషాన్‌ కిషన్‌, పొలార్డ్‌ విధ్వంసంతో మ్యాచ్‌ మరోస్థాయికి చేరింది. సూపర్‌ ఓవర్‌లో బుమ్రా పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. బెంగళూరు భళా అనిపించింది.

దుబాయ్‌: బౌండ్రీల హోరు.. సిక్సర్ల జోరుతో అభిమానులను ఉర్రూతలూగించిన పోరులో చివరకు బెంగళూరును విజయం వరించింది. ఇరుజట్ల బ్యాట్స్‌మెన్‌ వీరబాదుడుతో మొత్తం 402 పరుగులు నమోదైన మ్యాచ్‌ చివరకు టై అయింది. బెంగళూరు తరఫున సూపర్‌ ఓవర్‌ వేసిన నవదీప్‌ సైనీ ముంబై హార్డ్‌ హిట్టర్లను అడ్డుకొని 7 పరుగులు ఇచ్చుకోగా.. కోహ్లీ, డివిలియర్స్‌ ధాటిగా ఆడటంతో బెంగళూరు 11 పరుగులు చేసి విజయం సాధించింది. అంతకుముందు సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన కోహ్లీ సేన నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఓపెనర్లు దేవదత్‌ పడిక్కల్‌ (40 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అరోన్‌ ఫించ్‌ (35 బంతుల్లో 52; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకాలు బాదగా.. డివిలియర్స్‌ (24 బంతుల్లో 55 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్‌ దూబే (10 బంతుల్లో 27 నాటౌట్‌; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. కోహ్లీ (3) మరోసారి విఫలమయ్యాడు. ముంబై బౌలర్లలో బౌల్ట్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సరిగ్గా 201 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (58 బంతుల్లో 99; 2 ఫోర్లు, 9 సిక్సర్లు), పొలార్డ్‌ (24 బంతుల్లో 60 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) వీర విజృంభణతో ముంబై అదరగొట్టింది. 

టాప్‌ విఫలం..

భారీ టార్గెట్‌ ఛేజింగ్‌ తొలి ఓవర్‌లో 14 పరుగులు రాబట్టిన ముంబైకి ఆ ఆనందం ఎక్కువసేపు నిలువలేకపోయింది. రెండో ఓవర్‌లోనే కెప్టెన్‌ రోహిత్‌ (8).. వాషింగ్టన్‌ సుందర్‌కు చిక్కాడు. ఆ మరుసటి ఓవర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (0) ఔట్‌ కాగా.. కాసేపటికి డికాక్‌ (14) కూడా వెనుదిరిగాడు. దీంతో ఆ జట్టు 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. హార్దిక్‌ పాండ్యా (15) ఎక్కువసేపు నిలువలేకపోగా.. ఆఖర్లో కిషన్‌, పొలార్డ్‌ భారీ షాట్లతో విరుచుకుపడి బెంగళూరు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు.

బాదుడే బాదుడు..

16 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 122/4. విజయానికి 24 బంతుల్లో 80 పరుగులు అవసరమైన దశలో పొలార్డ్‌ రెచ్చిపోయాడు. జంపా ఓవర్‌లో 4,6,6,2,6,3తో మొత్తం 27 పరుగులు పిండుకున్నాడు. మరుసటి ఓవర్‌లో పొలార్డ్‌ రెండు, ఇషాన్‌ ఓ సిక్స్‌ బాదడంతో 22 పరుగులు వచ్చాయి. దీంతో సమీకరణం 12 బంతుల్లో 31కి చేరింది. 19 ఓవర్‌లో 12 పరుగులు రాగా.. ఆఖరి ఓవర్‌లో 2 భారీ సిక్సర్లు బాదిన కిషన్‌ సెంచరీకి ఒక్క పరుగు తేడాలో ఔట్‌కాగా.. చివరి బంతికి బౌండ్రీ బాదిన పొలార్డ్‌ మ్యాచ్‌ను టై చేశాడు. 

మూడు ఫిఫ్టీలు

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేనకు శుభారంభం దక్కింది. ఒక ఎండ్‌లో పడిక్కల్‌ నెమ్మదిగా ఆడుతుంటే.. మరో వైపు నుంచి ఫించ్‌ దంచికొట్టాడు. ప్యాటిన్‌సన్‌ ఓవర్‌లో ఫోర్‌తో మొదలెట్టిన ఫించ్‌.. ఆ వెంటనే బౌల్ట్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ అందుకున్నాడు. రాహుల్‌ చాహర్‌కు హ్యాట్రిక్‌ ఫోర్లతో స్వాగతం పలికిన ఫించ్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాక తొలి వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు. ఫలితంగా బెంగళూరు 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 85/1తో నిలిచింది. గత రెండు మ్యాచ్‌ల్లో ఆకట్టుకోలేకపోయిన కెప్టెన్‌ కోహ్లీ.. ఈసారి కూడా నిరాశపరిచాడు. క్రీజులో ఇబ్బందిగా కనిపించిన విరాట్‌ 11 బంతులెదుర్కొని కేవలం 3 పరుగులే చేసి పెవిలియన్‌ బాటపట్టాడు. ఆ తర్వాత బాదే బాధ్యత డివిలియర్స్‌ తీసుకోగా.. దూబే అతడికి చక్కటి సహకారం అందించాడు. ఫలితంగా బెంగళూరు భారీ స్కోరు చేసింది. కోహ్లీ సేన చివరి 4 ఓవర్లలో 65 పరుగులు పిండుకోవడం విశేషం. 

స్కోరు బోర్డు

బెంగళూరు: పడిక్కల్‌ (సి) పొలార్డ్‌ (బి) బౌల్ట్‌ 54, ఫించ్‌ (సి) పొలార్డ్‌ (బి) బౌల్ట్‌ 52, కోహ్లీ (సి) రోహిత్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 3, డివిలియర్స్‌ (నాటౌట్‌) 55, దూబే (నాటౌట్‌) 27, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 20 ఓవర్లలో 201/3. వికెట్ల పతనం: 1-81, 2-92, 3-154, బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-34-2, ప్యాటిన్‌సన్‌ 4-0-51-0, రాహుల్‌ చాహర్‌ 4-0-31-1, బుమ్రా 4-0-42-0, కృనాల్‌ 3-0-23-0, పొలార్డ్‌ 1-0-13-0.

ముంబై: రోహిత్‌ (సి) (సబ్‌) పవన్‌ (బి) సుందర్‌ 8, డికాక్‌ (సి) (సబ్‌) పవన్‌ (బి) చాహల్‌ 14, సూర్యకుమార్‌ (సి) డివిలియర్స్‌ (బి) ఉడాన 0, ఇషాన్‌ (సి) పడిక్కల్‌ (బి) ఉడాన 99, హార్దిక్‌ (సి) (సబ్‌) పవన్‌ (బి) జంపా 15, పొలార్డ్‌ (నాటౌట్‌) 60, కృనాల్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 201/5. వికెట్ల పతనం: 1-14, 2-16, 3-39, 4-78, 5-197, బౌలింగ్‌: ఉడాన 4-0-45-2, సుందర్‌ 4-0-12-1, సైనీ 4-0-43-0, చాహల్‌ 4-0-48-1, జంపా 4-0-53-1.