రూట్ భారీ శతకం

గాలె: సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా.. కెప్టెన్ జో రూట్ (309 బంతుల్లో 186; 18 ఫోర్లు) భారీ సెంచరీతో కదం తొక్కాడు. ఫలితంగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 9 వికెట్లకు 339 పరుగులు చేసింది. అంతకుముందు లంక తొలి ఇన్నింగ్స్‌లో 381 పరుగులు చేసిన విషయం తెలిసిందే. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎంబుల్దెనియా (7/132) ధాటికి ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు వరుస కట్టినా.. రూట్ ఒంటరి పోరాటం కొనసాగించాడు. జోస్ బట్లర్ (55) ఆతడికి కాసేపు సహకరించాడు. మరో వికెట్ మాత్రమే ఉన్న ఇంగ్లండ్ జట్టు.. లంక తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 42 పరుగులు వెనుకబడి ఉంది. తొలి టెస్టులో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న రూట్.. మరోసారి ఆ మార్క్‌ను అందుకునేలా కనిపించినా ఆదివారం ఆట చివర్లో రనౌట్‌గా పెవిలియన్ చేరాడు.