ఆదివారం 05 జూలై 2020
Sports - May 29, 2020 , 18:01:54

రోహిత్‌ విజయ రహస్యమదే: లక్ష్మణ్‌

రోహిత్‌ విజయ రహస్యమదే: లక్ష్మణ్‌


న్యూఢిల్లీ: ఒత్తిడిని జయిస్తూ ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోగల నేర్పే రోహిత్‌ శర్మను ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో అత్యంత విజయవంతమైన సారథిగా నిలబెట్టిందని భారత మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్షణ్‌ అన్నాడు. ‘దక్కన్‌ చార్జర్స్‌కు ఆడుతున్నప్పుడే రోహిత్‌ నాయకుడిగా ఎదిగాడు. తొలి సీజన్‌లో మంచి ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత రోజురోజుకూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ కీలక బృందంలో సభ్యుడిగా మారాడు. ఆటలో ఒత్తిడిని తట్టుకోవడమే కీలకం. ఐపీఎల్లో హైటెన్షన్‌తో కూడిన ఎన్నో మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌ చేయడమే రోహిత్‌ను విజయవంతమైన సారథిగా నిలబెట్టింది’ అని లక్ష్మణ్‌ చెప్పాడు.

ఆరంభంలో దక్కన్‌ చార్జర్స్‌కు ఆడిన రోహిత్‌ శర్మ ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌కు మారాడు. ఆ జట్టు పగ్గాలు చేబట్టినప్పటి నుంచి ఎదురులేకుండా దూసుకెళ్తున్నాడు. హిట్‌మ్యాన్‌ సారథ్యంలో ముంబై జట్టు నాలుగుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గింది. లీగ్‌ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు ఉన్న మహేంద్రసింగ్‌ ధోనీ ఇప్పటి వరకు 3 సార్లు మాత్రమే టైటిల్‌ దక్కించుకోగా.. రోహిత్‌ అంతకంటే ముందున్నాడు. ఇక ఆటగాడిగా దక్కన్‌ చార్జర్స్‌ తరఫున కూడా టైటిల్‌ నెగ్గిన హిట్‌మ్యాన్‌.. బౌలింగ్‌ విన్యాసాలతో హ్యాట్రిక్‌ తన పేరిట రాసుకోవడం మరో విశేషం.  


logo