బుధవారం 25 నవంబర్ 2020
Sports - Nov 11, 2020 , 11:17:55

రోహిత్ శ‌ర్మ‌.. సూప‌ర్ కెప్టెన్‌

రోహిత్ శ‌ర్మ‌.. సూప‌ర్ కెప్టెన్‌

హైద‌రాబాద్‌:  ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌.. ప్రపంచంలోనే అత్యుత్త‌మ టోర్న‌మెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న‌ది.  ఐపీఎల్ ఆడుతున్న క్రికెట‌ర్లకు కూడా ఫ్రాంచైజీలు భారీ మొత్తంలో పేమెంట్ ఇస్తున్నాయి.  తీవ్ర పోటీ ఉన్న ఈ టోర్నీలో.. ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌.. అద్భుత రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ టైటిళ్ల‌ను అయిదు సార్లు గెలుచుకున్న కెప్టెన్‌గా రోహిత్ ఘ‌న‌త సాధించాడు.  2013, 2015, 2017, 2019, 2020 సంవ‌త్స‌రాల్లో ముంబై జట్టు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న‌ది. అయితే అయిదుసార్లూ రోహిత్ నేతృత్వంలోనే ఆ జ‌ట్టు టైటిల్‌ను కైవ‌సం చేసుకోవ‌డం విశేషం. టీమిండియా త‌ర‌పున ఓపెన‌ర్‌గా రాణిస్తూనే.. ఐపీఎల్ లాంటి టోర్నీల్లోనూ రోహిత్ త‌న టాలెంట్ ప్ర‌ద‌ర్శిస్తున్న తీరు ప్ర‌శంస‌నీయం.    

ముంబై జ‌ట్టులో ప్ర‌తి ప్లేయ‌ర్ ఓ హిట్ట‌రే.  భారీ షాట్లు కొట్ట‌గ‌ల బ్యాట్స్‌మెన్ ఆ జ‌ట్టులో ఉన్నారు.  లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో కూడా సిక్స‌ర్లు బాదే హిట్‌మ్యాన్‌లు ఆ టీమ్‌లో ఉన్నారు. ఇక బౌలింగ్‌లోనూ ప్ర‌త్యర్థుల‌ను వ‌ణికించే స్పీడ్‌స్ట‌ర్లు ఉన్నారు.  గ‌తంలో మ‌లింగ ముంబై జ‌ట్టులో మేటి బౌల‌ర్‌గా రాణించాడు. ఇప్పుడు బౌల్ట్‌తో పాటు బుమ్రా ఆ జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించాడు. గ‌ట్టి పోటీ ఉండే ఐపీఎల్ టోర్నీలో జ‌ట్టు ఆట‌గాళ్ల‌ను చాక‌చ‌క్యంగా వాడుకోవ‌డ‌మే అత్యంత కీల‌కం. టీ20 ఫార్మాట్‌లో ఎంతో అనుభ‌వం ఉన్న రోహిత్ ఆ వ్యూహాన్ని చ‌క్క‌గా వాడుకున్నారు.  స‌రైన స‌మ‌యంలో స‌రైన బౌల‌ర్‌ను.. బ్యాట్స్‌మెన్‌ను ఓ అస్త్రంలో వాడుకోవ‌డం రోహిత్‌కు బాగా తెలుసు.  

టీమిండియాకు ఎన్నో మ్యాచ్‌ల‌ను గెలిపించిన రోహిత్‌.. ముంబై కెప్టెన్‌గా అయిదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను కైవ‌సం చేసుకోవ‌డం అద్భుత రికార్డు.  ముంబై జ‌ట్టు అయిదుసార్లు టైటిల్ గెలిచింది. ఆ అయిదుసార్లు కెప్టెన్‌గా రోహిత్ ఉండ‌డం విశేషం.  ఈసారి ఐపీఎల్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌.. 332 ర‌న్స్ చేశాడు. ఓ  మ్యాచ్‌లో అత్య‌ధికంగా 80 ర‌న్స్ చేశాడు. 2019లో 14 మ్యాచ్‌లు ఆడిన అత‌ను 405 ర‌న్స్ చేశాడు. 2013లో 19 మ్యాచ్‌లు ఆడి 538 ర‌న్స్‌, 2015లో 16 మ్యాచ్‌లు ఆడి 482 ర‌న్స్‌, 2017లో 17 మ్యాచ్‌లు ఆడి 333 ర‌న్స్ చేశాడ‌త‌ను.  ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 200 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌..  ఇప్ప‌టి వ‌ర‌కు 5230 ర‌న్స్ స్కోర్ చేశాడు. రోహిత్ ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 458 ఫోర్లు, 213 సిక్స‌ర్లు కొట్టాడు.