శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Aug 21, 2020 , 17:55:22

ఐదుగురికి రాజీవ్‌ ఖేల్‌రత్న..అవార్డుల జాబితా ఇదే..!

ఐదుగురికి రాజీవ్‌ ఖేల్‌రత్న..అవార్డుల జాబితా ఇదే..!

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐదుగురు క్రీడాకారులు అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డును సొంతం చేసుకోనున్నారు. మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, హాకీ మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌లతో కూడిన 12 మంది సభ్యుల కమిటీ ఖేల్‌రత్న(5), అర్జున(27), ద్రోణాచార్య(8+5), ధ్యాన్‌చంద్‌(15) తదితర అవార్డులకు క్రీడాకారుల పేర్లను క్రీడలశాఖకు సిఫారసు చేసింది.

తాజాగా కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ ఆమోదం తెలుపడంతో ఆగస్టు 29న(జాతీయ క్రీడల దినోత్సవం) జరిగే కార్యక్రమం(వర్చువల్‌)లో అవార్డులను అందజేస్తారు. టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మతో పాటు స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌, టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) సంచలనం మనికా బాత్రా, రియో (2016) పారా ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత మరియప్పన్‌ తంగవేలు, మహిళల హాకీ కెప్టెన్‌ రాణి రాంపాల్‌ ఖేల్‌రత్న అందుకోనున్నారు. అత్యున్నత క్రీడా పురస్కారానికి ఐదుగురు నామినేట్‌ కావడం అవార్డు చరిత్రలో ఇది తొలిసారి కావడం విశేషం. చివరిసారి 2016లో నలుగురికి (పీవీ సింధు, దీపా కర్మాకర్‌, జీతూ రాయ్‌, సాక్షి మాలిక్‌) ఈ అవార్డు దక్కింది.
logo