శనివారం 31 అక్టోబర్ 2020
Sports - Sep 23, 2020 , 21:46:42

రోహిత్‌ 80..ముంబై భారీ స్కోరు

రోహిత్‌ 80..ముంబై భారీ స్కోరు

అబుదాబి: హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ(80: 54 బంతుల్లో 3ఫోర్లు, 6సిక్సర్లు) అద్భుత అర్ధశతకానికి తోడు సూర్య కుమార్‌ యాదవ్‌(47: 28 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో ముంబై భారీ స్కోరు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు చేసింది.  ఇన్నింగ్స్‌ ఆద్యంతం రోహిత్‌ తన మార్క్‌ షాట్లతో అలరించాడు. యువ బౌలర్‌ శివమ్‌ మావి తన పదునైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 

ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.  ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే  స్టార్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ వికెట్‌ కోల్పోయింది . అయినా  ముంబై  వేగంగానే ఆడింది.   రోహిత్‌ శర్మ, సూర్య కుమార్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో  చెలరేగారు.   ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు.   పవర్‌ప్లే ముగిసేసరికి 59 పరుగులు రాబట్టారు.   39 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్‌ ఆ తర్వాత వేగంగా ఆడాడు. యాదవ్‌(47) అర్ధశతకానికి చేరువలో రనౌటయ్యాడు. 

రోహిత్‌, యాదవ్‌ జోడీ 90కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.  కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసినా రోహిత్‌  వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.  ఒకానొక దశలో  ముంబై జోరు చూస్తే స్కోరు అలవోకగా 200 దాటేలా కనిపించినా కోల్‌కతా  బౌలర్లు బలంగా  పుంజుకున్నారు.  డెత్‌ ఓవర్లలో కోల్‌కతా గొప్పగా బౌలింగ్‌ చేసింది.  చివరి నాలుగు ఓవర్లలో 47 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టింది.  కోల్‌కతా బౌలర్లలో  శివమ్‌ మావి రెండు వికెట్లు తీశాడు.