శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 19, 2020 , 02:34:08

ఖేల్ రత్న అవార్డుకు ఐదుగురు

ఖేల్ రత్న అవార్డుకు ఐదుగురు

న్యూఢిల్లీ: క్రీడా అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు ఐదుగురు ప్లేయర్లను నామినేట్‌ చేశారు. ఇందులో టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మతోపాటు స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌, టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) సంచలనం మనికా బాత్రా, రియో (2016) పారా ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత మరియప్పన్‌ తంగవేలు, మహిళల హాకీ కెప్టెన్‌ రాణి రాంపాల్‌ పేర్లు ఉన్నాయి.  మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, హాకీ మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌లతో కూడిన 12 మంది సభ్యుల కమిటీ.. ఈ అవార్డు కోసం మొత్తం ఐదుగురు పేర్లను కేంద్ర క్రీడాశాఖకు పంపింది. అత్యున్నత క్రీడా పురస్కారానికి ఐదుగురు నామినేట్‌ కావడం అవార్డు చరిత్రలో ఇది తొలిసారి కావడం విశేషం. చివరిసారి 2016లో నలుగురికి (పీవీ సింధు, దీపా కర్మాకర్‌, జీతూ రాయ్‌, సాక్షి మాలిక్‌) ఈ అవార్డు దక్కింది. 

   గత సీజన్‌లో రోహిత్‌ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 2019లో 7 శతకాలతో ఇరగదీసిన హిట్‌మ్యాన్‌ మొత్తం 1490 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనే 5 సెంచరీలు బాదడం విశేషం. ఈ ప్రదర్శన ఆధారంగానే రోహిత్‌ను ఖేల్ రత్న అవార్డుకు  సిఫార్సు చేసినట్లు కమిటీలో సభ్యుడైన సెహ్వాగ్‌ తెలిపాడు. 2018 ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణాలతో పాటు 2019 ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించడంతో వినేశ్‌ పేరును నామినేట్‌ చేశారు. రియో పారా ఒలింపిక్స్‌లో టి42 విభాగం హైజంప్‌ కేటగిరీలో స్వర్ణం సాధించిన మరియప్పన్‌ తంగవేలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. టీటీలో అదరగొడుతున్న మనికా బాత్రా గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో పసిడి, జకార్తా ఆసియా క్రీడల్లో క్యాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. టోక్యోకు భారత్‌ అర్హత సాధించడంలో కీలకంగా వ్యవహరించిన కెప్టెన్‌ రాణి రాంపాల్‌ను ఆఖరి నిమిషంలో ఎంపిక చేశారు. క్రికెట్‌లో రోహిత్‌ శర్మ కంటే ముందు కేవలం ముగ్గురికే ఖేల్త్న్ర అవార్డు వరించింది. వారిలో సచిన్‌ టెండూల్కర్‌ (1998), ధోనీ (2007), కోహ్లీ (2018) ఉన్నారు. సెలెక్షన్‌ కమిటీ సిఫార్సు చేసిన ప్లేయర్ల పేర్లకు క్రీడాశాఖ తుది ఆమోదం దక్కాల్సి ఉంది. logo