ఆదివారం 29 మార్చి 2020
Sports - Jan 29, 2020 , 17:21:11

ఉత్కం‘టై’..సూప‌ర్ ఓవ‌ర్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం

ఉత్కం‘టై’..సూప‌ర్ ఓవ‌ర్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం

న్యూజిలాండ్‌ గడ్డపై తొలి టీ20 సిరీస్‌ గెలుపుతో టీమ్‌ఇండియా చరిత్ర సృష్టించింది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే భారత్‌ 3-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

  • 3-0తో సిరీస్ కైవ‌సం చేసుకున్న కోహ్లీసేన‌

 హామిల్టన్‌:  న్యూజిలాండ్‌ గడ్డపై తొలి టీ20 సిరీస్‌ గెలుపుతో టీమ్‌ఇండియా చరిత్ర సృష్టించింది.  5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే  భారత్‌ 3-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది.  భారత్‌ నిర్దేశించిన 180 లక్ష్యాన్ని కివీస్‌(179/6 (20.0) సమం చేయడంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది.  ఉత్కంఠభరితంగా సాగిన సూపర్‌ ఓవర్‌  మ్యాచ్‌లో భారత్‌ అద్వితీయ విజయంతో మెరిసింది.  మ్యాచ్‌ టైగా ముగియడంతో సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌(1,1,6,4,0b,4: 1717 పరుగులు చేసింది. అనంతరం  ఛేదనలో రోహిత్‌ ఆఖ‌రి రెండు బంతుల్ని  భారీ సిక్సర్లుగా మ‌లిచి టీమ్‌ఇండియా(2,1,4,1,6,6: 20)కు చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాన్ని అందించాడు. 


కేన్ పోరాటం అద్భుతం..

ఆతిథ్య సారథి కేన్‌ విలియమ్సన్‌ కెప్టెన్‌(95: 48 బంతుల్లో 8ఫోర్లు, 6సిక్సర్లు) ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. పరాభవం తప్పదనే  దశలో విలియమ్సన్‌ ఒంటరి పోరుతో న్యూజిలాండ్‌ను రేసులోకి తీసుకొచ్చాడు. ఇక అచ్చొచ్చిన మైదానంలో కేన్‌ ఆఖరి వరకు పోరాడాడు.   ఈ మ్యాచ్‌లో విలియమ్సన్‌ స్ఫూర్తిదాయ‌క ప్ర‌ద‌ర్శ‌నే హైలెట్‌. ఛేదనలో శతక సమాన ఇన్నింగ్స్‌తో విజృంభించడంతో పాటు సూపర్‌ ఓవర్‌లోనూ ఫోర్‌, సిక్సర్‌తో మెరిశాడు. 

ఆఖరి ఓవర్‌ హోరాహోరీగా..

ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో కివీస్‌ విజయానికి 6బంతుల్లో 9 పరుగులు అవసరం కాగా, సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ బౌలింగ్‌ చేశాడు. తొలి బంతికే టేలర్‌ సిక్సర్‌ బాదడంతో కివీస్‌ గెలుపుఖాయం అనుకున్నారు. తర్వాతి బంతికి టేలర్‌ సింగిల్‌ తీసి..కేన్‌ విలియమ్సన్‌కు స్ట్రైకింగ్‌ ఇచ్చాడు. మూడో బంతికి కేన్‌..కీపర్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతో మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సీఫర్ట్‌ పరుగులేమీ చేయలేదు.  ఐదో బంతిని సీఫర్ట్‌ కనీసం బ్యాట్‌కు కూడా తాకించలేదు..అయినప్పటికీ సింగిల్‌ తీశారు. దీంతో మ్యాచ్‌ టై అయింది. కివీస్‌ విజయానికి ఒక పరుగు కావడంతో స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న టేలర్‌ బంతిని వికెట్ల మీదకు ఆడుకోవడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. కివీస్‌ ఇన్నింగ్స్‌లో మార్టిన్‌ గప్తిల్‌(31), మున్రో(14), రాస్‌ టేలర్‌(17) మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడు. భారత బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌, షమీ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. చాహల్‌, జడేజా చెరో వికెట్‌ పడగొట్టారు. గతేడాది ఇదే మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ 212 పరుగులు చేసి.. కేవలం 4 పరుగుల తేడాతోనే భారత్‌ను ఓడించింది. 

హిట్‌మ్యాన్ ధ‌నాధ‌న్‌..

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది.టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(65: 40బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు)  తనదైన శైలిలో విజృంభించాడు. తన మార్క్‌షాట్లతో మైదానం నలువైపులా బౌండరీలు బాది జట్టుకు మంచి స్కోరు అందించాడు. రోహిత్‌ అర్ధశతకంతో మెరవడంతో 20 ఓవర్లలో భారత్‌ 5 వికెట్లకు 179 పరుగులు చేసింది.   ఈ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌(27: 19 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్‌) కాస్త నిదానంగా ఆడుతూ రోహిత్‌కు సహకారం అందించగా.. విరాట్‌ కోహ్లీ(38: 27 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్‌) కీలక సమయంలో ధాటిగా ఆడాడు.  

23  బంతుల్లోనే..

టీ20 కెరీర్‌లో 20 హాఫ్‌సెంచరీ నమోదు చేసిన హిట్‌మ్యాన్‌ కివీస్‌ బౌలర్‌ బెనెట్‌కు చుక్కలు చూపించాడు. ఒకే ఓవర్లో   ఏకంగా మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది 27 పరుగులు రాబట్టాడు. ఆఖరి బంతికి భారీ సిక్సర్‌తో అతి తక్కువగా 23  బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తిచేసుకున్నాడు. తాను ఎదుర్కొన్న తొలి 18 బంతుల్లో 24 రన్స్‌ చేయగా.. తర్వాతి 5 బంతుల్లోనే 26 పరుగులు సాధించడం విశేషం.  ఆరంభంలో టీమ్‌ఇండియా జోరు చూస్తే 230కి పైగా స్కోరు సాధిస్తుందని అంతా అనుకున్నారు.  

వ‌రుస‌గా వికెట్లు చేజార్చుకొని..

స్వల్ప వ్యవధిలో రాహుల్‌, రోహిత్‌, శివమ్‌ దూబే  వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని భారత్‌ చేజార్చుకుంది.  ఇక ఆఖర్లో జడేజా(10 నాటౌట్‌), పాండే(14నాటౌట్‌) చెరో సిక్సర్‌ కొట్టడంతో భారత్‌ 179 పరుగులు చేయగలిగింది. కివీస్‌ బౌలర్లలో బెనెట్‌ మూడు వికెట్లు తీసినా.. తన 4 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చుకున్నాడు. సాంట్నర్‌, గ్రాండ్‌హోం చెరో వికెట్‌ దక్కించుకున్నారు.
logo