మంగళవారం 07 జూలై 2020
Sports - Jan 29, 2020 , 17:10:57

రో'హిట్‌'..23 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం

రో'హిట్‌'..23 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం

న్యూజిలాండ్‌తో తొలి రెండు టీ20ల్లో విఫలమైన ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(65: 40బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు) మూడో టీ20లో పరుగుల వరద పారించాడు.

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో తొలి రెండు టీ20ల్లో విఫలమైన ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(65: 40బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు) మూడో టీ20లో పరుగుల వరద పారించాడు. హామిల్టన్‌ మైదానం కాస్త పెద్దది అయినప్పటికీ   అలవోకగా బౌండరీలు బాదేశాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మంచి అదిరే ఆరంభం అందించాడు. కివీస్‌ బౌలర్‌ బెన్నెట్‌ వేసిన ఆరో ఓవర్లో  తొలి బంతికి రాహుల్‌ సింగిల్‌ తీసి రోహిత్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు. తర్వాతి ఐదు బంతులన్నీ బౌండరీ లైన్‌ ఆవల పడ్డాయి. హిట్‌మ్యాన్‌ ఏకంగా మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది 27 పరుగులు రాబట్టాడు. ఆఖరి బంతికి భారీ సిక్సర్‌తో అతి తక్కువగా 23  బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తిచేసుకున్నాడు.

టీ20 కెరీర్‌లో రోహిత్‌కిది 20వ హాఫ్‌సెంచరీ కావడం విశేషం.  జట్టు స్కోరు 89 వద్ద మరో ఓపెనర్‌ రాహుల్‌(27) ఔటైనా తన జోరు తగ్గించలేదు. చివరికి బెన్నెట్‌ వేసిన 11వ ఓవర్లో సౌతీకి క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ నిరాశగా పెవిలియన్‌ చేరాడు. అనంతరం అదే ఓవర్‌ ఆఖరి బంతికి ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే(3) కూడా స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగాడు. 12 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 3 వికెట్లకు 99 పరుగులు చేసింది. logo