e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, April 13, 2021
Advertisement
Home Top Slides కరోనా నీడలో క్రికెట్‌ పండుగ

కరోనా నీడలో క్రికెట్‌ పండుగ

కరోనా నీడలో క్రికెట్‌ పండుగ
  • నేటి నుంచి ఐపీఎల్‌ 14వ సీజన్‌
  • రాత్రి 7.30 గంటల నుంచి
  • తొలి మ్యాచ్‌లో ముంబై, బెంగళూరు ఢీ
  • ఈ ఏడాది ఐపీఎల్‌ ఆరు వేదికల్లో జరుగనుంది. ముంబై, చెన్నై ఆ తర్వాత అహ్మదాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.
  • 2012 సీజన్‌ తర్వాత తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయింది.
  • ఇరు జట్ల మధ్య జరిగిన గత పది మ్యాచ్‌ల్లో ముంబై ఎనిమిదింట నెగ్గగా.. బెంగళూరు రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది.

ఓ వైపు పెరుగుతున్న ఎండలు.. మరోవైపు కరోనా కేసులు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో క్రీడాభిమానులకు వినోదాన్ని పంచేందుకు క్రికెట్‌ పండుగ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సిద్ధమైంది. మెరుపు హిట్టింగ్‌.. మైమరిపించే బౌలింగ్‌.. కండ్లు చెదిరే క్యాచ్‌లు.. అద్భుత ఫీల్డింగ్‌ విన్యాసాలు.. మునివేళ్లపై నిలబెట్టే మ్యాచ్‌లు.. ఒక్క ఇన్నింగ్స్‌తో ప్లేయర్ల దశ తిరిగిపోయే వేదికకు వేళయింది.
పదమూడేండ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఐపీఎల్‌ ఈసారి కఠిన ఆంక్షల మధ్య ఖాళీ మైదానాల్లో జరుగనుంది. కొవిడ్‌-19 భయంతో గతేడాది యూఏఈకి తరలివెళ్లిన మెగాలీగ్‌.. 677 రోజుల తర్వాత స్వదేశంలో జరుగనుండటం ఊరటనిచ్చే అంశం. వరుస పండుగల మధ్య డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ సిక్సర్‌ కొట్టాలని ఉవ్విళ్లూరుతుంటే.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఎలాగైనా టైటిల్‌ పట్టాలని తహతహలాడుతున్నది. నిర్వాహకులు.. ఆటగాళ్లు అంతా సిద్ధమైన వేళ.. మండుటెండల్లో 52 రోజులు.. 60 మ్యాచ్‌లు ఆస్వాదించేందుకు మీరు రెడీ అయిపోండి!
పొట్టి ఫార్మాట్‌కు విశ్వవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ తెచ్చి పెట్టిన మెగా లీగ్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో బయో సెక్యూర్‌ వాతావరణంలో ఐపీఎల్‌ 14వ సీజన్‌కు శుక్రవారం తెరలేవనుంది. మహమ్మారి కారణంగా అట్టహాసమైన ఆరంభోత్సవాలకు దూరంగా.. ప్రేక్షకులను అనుమతించకుండా.. ఖాళీ మైదానాల్లో ముంబై, బెంగళూరు పోరుతో ఈ ఏడాది సీజన్‌ ఆరంభం కానుంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడినప్పటికీ కఠిన ఆంక్షల మధ్య ఇక్కడే లీగ్‌ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.

ఈ ఏడాది భారత్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో.. విశ్వ సమరానికి రిహార్సల్స్‌గా ఈ టోర్నీలో దుమ్మురేపేందుకు అన్ని దేశాల క్రికెటర్లు సిద్ధమయ్యారు. మరీ కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న అంతర్జాతీయ స్టార్లు మెరుస్తారా.. భారత ఆటగాళ్లు హీరోలవుతారా చూడాలి!. గతేడాది నిరాశపరిచిన చెన్నై మళ్లీ గాడిలో పడాలని చూస్తుంటే.. వరుసగా ప్లేఆఫ్స్‌కు చేరుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ట్రోఫీపై కన్నేసింది. బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్‌ తొలి టైటిల్‌ నిరీక్షణను తీర్చుకోవాలని కసిగా ఉండగా.. కోల్‌కతా మూడోసారి విజేత హోదా కోసం పరితపిస్తున్నది.
తొలి పంచ్‌ ఎవరిదో!
లీగ్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా ఐదు సార్లు టైటిల్‌ చేజిక్కించుకున్న ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో చెన్నై వేదికగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది. రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై అన్నిరంగాల్లో పటిష్టంగా ఉంటే.. మ్యాక్స్‌వెల్‌ రాకతోనైనా రాత మారుతుందా అని బెంగళూరు ఎదురుచూస్తున్నది. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌.. అద్భుత బౌలింగ్‌.. ఆల్‌రౌండర్ల అండతో పా టు దిగ్గజాల కోచింగ్‌లో ముంబై టైటిళ్ల హ్యాట్రిక్‌ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతుంటే.. ఇన్నాళ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న టైటిల్‌ను అందుకోవాలని విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు కృతనిశ్చయంతో ఉంది.
ఆల్‌రౌండ్‌ బలంతో..
రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌, కృనాల్‌ పాండ్యా, కీరన్‌ పొలార్డ్‌, జేమ్స్‌ నీషమ్‌తో శత్రుదుర్భేద్యంగా ఉన్న ముంబై బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మహమ్మద్‌ సిరాజ్‌, కైల్‌ జెమీసన్‌, సుందర్‌, చాహల్‌తో కూడిన బెంగళూరు బౌలింగ్‌ ఎలా అడ్డుకుంటుందో అనేదానిపైనే ఈ మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంది. విరాట్‌ కోహ్లీ, దేవదత్‌ పడిక్కల్‌, ఏబీ డివిలియర్స్‌, మ్యాక్స్‌వెల్‌తో ఆర్‌సీబీ నిండా మ్యాచ్‌ విన్నర్లే ఉన్నా.. వీరంతా సమిష్టిగా సత్తాచాటడమే అసలు సమస్య. తాను ఓపెనింగ్‌ చేసి డివిలియర్స్‌, మ్యాక్స్‌వెల్‌ను మిడిలార్డర్‌లో పంపాలన్న కోహ్లీ ఆలోచన ఏమేరకు సత్ఫలితాలనిస్తుందో చూడాలి.
సిరాజ్‌పైనే ఆశలు

కరోనా నీడలో క్రికెట్‌ పండుగ

ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌పై బెంగళూరు చాలా ఆశలు పెట్టుకుంది. దేశీయ పేసర్ల కోటాలో దాదాపు అన్నీ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉన్న సిరాజ్‌ విజృంభిస్తే.. బెంగళూరు బెంగ తీరినట్లే. జెమీసన్‌, నవ్‌దీప్‌ సైనీ వంటి పేసర్లు ఉన్నప్పటికీ కెప్టెన్‌ విరాట్‌.. సిరాజ్‌తోనే బౌలింగ్‌ దాడి ప్రారంభించే అవకాశాలెక్కువ.
ఐపీఎల్‌ రికార్డులు అత్యధిక పరుగులు
కోహ్లీ (ఆర్‌సీబీ) 5,878
సురేశ్‌ రైనా (సీఎస్‌కే) 5,368
వార్నర్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) 5,254
రోహిత్‌ శర్మ (ముంబై) 5,230

అత్యధిక సిక్స్‌లు
గేల్‌ (పంజాబ్‌) 349
డివిలియర్స్‌ (ఆర్‌సీబీ) 235
ధోనీ (సీఎస్‌కే) 216
రోహిత్‌ (ముంబై) 213

అత్యధిక వికెట్లు
మలింగ (ముంబై, రిటైర్డ్‌) 170
అమిత్‌ మిశ్రా (ఢిల్లీ) 160
పియూశ్‌ చావ్లా (ముంబై) 156
బ్రావో (సీఎస్‌కే) 153

పిచ్‌
లీగ్‌లో ఏ జట్టుకూ సొంత గడ్డ అనుకూలత లేకపోగా.. చెన్నై చెపాక్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరించనుంది.
తుది జట్లు (అంచనా)
ముంబై:
రోహిత్‌ (కెప్టెన్‌), ఇషాన్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌, పొలార్డ్‌, కృనాల్‌, నీషమ్‌, కౌల్టర్‌నైల్‌, రాహుల్‌ చాహర్‌, బౌల్ట్‌, బుమ్రా.
బెంగళూరు: కోహ్లీ (కెప్టెన్‌), పడిక్కల్‌, ఏబీ, మ్యాక్స్‌వెల్‌, అజహరుద్దీన్‌, క్రిస్టియన్‌, సుందర్‌, కైల్‌ జెమీసన్‌, సైనీ, సిరాజ్‌, చాహల్‌.

Advertisement
కరోనా నీడలో క్రికెట్‌ పండుగ

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement