గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Jan 29, 2020 , 17:10:23

రోహిత్‌ సూపర్‌హిట్‌..భారత్‌ స్కోరు 179

రోహిత్‌ సూపర్‌హిట్‌..భారత్‌ స్కోరు 179

టీ20 కెరీర్‌లో 20వ హాఫ్‌సెంచరీ నమోదు చేసిన హిట్‌మ్యాన్‌ కివీస్‌ బౌలర్‌ బెనెట్‌కు చుక్కలు చూపించాడు.

హామిల్టన్‌:  న్యూజిలాండ్‌తో మూడో టీ20లో టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(65: 40బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు)  తనదైన శైలిలో విజృంభించాడు. తన మార్క్‌షాట్లతో మైదానం నలువైపులా బౌండరీలు బాది జట్టుకు మంచి స్కోరు అందించాడు. రోహిత్‌ అర్ధశతకంతో మెరవడంతో 20 ఓవర్లలో భారత్‌ 5 వికెట్లకు 179 పరుగులు చేసింది.   ఈ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌(27: 19 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్‌) కాస్త నిదానంగా ఆడుతూ రోహిత్‌కు సహకారం అందించగా.. విరాట్‌ కోహ్లీ(38: 27 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్‌) కీలక సమయంలో ధాటిగా ఆడాడు.  

టీ20 కెరీర్‌లో 20వ హాఫ్‌సెంచరీ నమోదు చేసిన హిట్‌మ్యాన్‌ కివీస్‌ బౌలర్‌ బెనెట్‌కు చుక్కలు చూపించాడు. ఒకే ఓవర్లో   ఏకంగా మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది 27 పరుగులు రాబట్టాడు. ఆఖరి బంతికి భారీ సిక్సర్‌తో అతి తక్కువగా 23  బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తిచేసుకున్నాడు. తాను ఎదుర్కొన్న తొలి 18 బంతుల్లో 24 రన్స్‌ చేయగా.. తర్వాతి 5 బంతుల్లోనే 26 పరుగులు సాధించడం విశేషం. పవర్‌ప్లే ముగిసేసరికి కివీస్‌ బౌలర్లను ఆటాడుకున్నాడు. ఆరంభంలో టీమ్‌ఇండియా జోరు చూస్తే 230కి పైగా స్కోరు సాధిస్తుందని అంతా అనుకున్నారు.  

స్వల్ప వ్యవధిలో రాహుల్‌, రోహిత్‌, శివమ్‌ దూబే  వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని భారత్‌ చేజార్చుకుంది. మిడిల్‌ ఓవర్లలో శ్రేయాస్‌ అయ్యర్‌ ఆచితూచి ఆడినప్పటికీ కోహ్లీ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. ఇక ఆఖర్లో జడేజా(10 నాటౌట్‌), పాండే(14నాటౌట్‌) చెరో సిక్సర్‌ కొట్టడంతో భారత్‌ 179 పరుగులు చేయగలిగింది. కివీస్‌ బౌలర్లలో బెనెట్‌ మూడు వికెట్లు తీసినా.. తన 4 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చుకున్నాడు. సాంట్నర్‌, గ్రాండ్‌హోం చెరో వికెట్‌ దక్కించుకున్నారు. 


logo