మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Oct 17, 2020 , 01:12:24

కోల్‌కతాపై రోహిత్‌సేన జయభేరి

కోల్‌కతాపై రోహిత్‌సేన జయభేరి

  • మెరిసిన డికాక్‌, రాహుల్‌ చాహర్‌

కెప్టెన్‌ మారినా.. కేకేఆర్‌ రాత మాత్రం మారలేదు. బ్యాటింగ్‌లో వైఫల్యం.. బౌలింగ్‌లో అలసత్వం కొనసాగించిన కోల్‌కతా మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. మరోవైపు కట్టుదిట్టమైన బౌలింగ్‌కు సూపర్‌ బ్యాటింగ్‌ తోడవడంతో ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ముంబై.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 

అబుదాబి: ఈ సీజన్‌ ఆరంభం నుంచి ఫుల్‌ జోష్‌లో కనిపిస్తున్న రోహిత్‌సేన మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు చేసింది. కమిన్స్‌ (36 బంతుల్లో 53 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో మెరువగా.. కెప్టెన్‌ మోర్గాన్‌ (29 బంతుల్లో 39 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. ముంబై బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో రోహిత్‌ సేన 16.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' క్వింటన్‌ డికాక్‌ (44 బంతుల్లో 78 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్‌తో అలరిస్తే.. రోహిత్‌ శర్మ (35; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) రాణించాడు.

దంచికొట్టిన డికాక్‌..

ఛేజింగ్‌లో ముంబైకి అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, డికాక్‌ దంచి కొట్టడంతో ఇన్నింగ్స్‌ సాఫీగా సాగింది. తొలి బంతికే బౌండ్రీతో రోహిత్‌ శర్మ మోత మొదలుపెడితే.. డికాక్‌ దాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ ఓవర్‌లో రోహిత్‌ 2 ఫోర్లు బాదితే.. కమిన్స్‌కు డికాక్‌ అదే శిక్ష వేశాడు. ఆ తర్వాత గ్రీన్‌ బౌలింగ్‌లోనూ డికాక్‌ రెండు ఫోర్లు అరుసుకున్నాడు. ఇక ప్రసిద్ధ్‌ కృష్ణ మరుసటి ఓవర్‌లో డికాక్‌ 4,6,4 దంచాడు. దీంతో ఏడు ఓవర్లు ముగిసేసరికి ముంబై 67/0తో నిలిచింది. ఈ క్రమంలో డికాక్‌ 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తొలి వికెట్‌కు 94 పరుగులు జోడించాక రోహిత్‌ శర్మ ఔట్‌కాగా.. సూర్యకుమార్‌ (10) ఎక్కువసేపు నిలువలేకపోయాడు. అయినా హార్దిక్‌ పాండ్యా (11 బంతుల్లో 21 నాటౌట్‌; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌) అండతో డికాక్‌ చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు.

టాప్‌ విఫలం..

టాస్‌ గెలిచిన కొత్త కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించుకోగా.. కోల్‌కతాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు రాహుల్‌ త్రిపాఠి (7), శుభ్‌మన్‌గిల్‌ (21) పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. నితీశ్‌ రాణా (5), దినేశ్‌ కార్తీక్‌ (4) నిరాశ పరిచారు. ఎనిమిదో ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన డేంజర్‌ మ్యాన్‌ రస్సెల్‌ (12) ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. ఫలితంగా కోల్‌కతా 61 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కమిన్స్‌ వరుస బౌండ్రీలతో విజృంభించాడు. మోర్గాన్‌ను నాన్‌స్ట్రయికింగ్‌ ఎండ్‌కే పరిమితం చేస్తూ భారీ షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో 35 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. చివర్లో మోర్గాన్‌ కూడా బ్యాట్‌కు పనిచెప్పడంతో.. కేకేఆర్‌ పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. 


కెప్టెన్సీకి కార్తీక్‌ బై బై..

రెండున్నరేండ్లుగా కోల్‌కతా కెప్టెన్‌గా కొనసాగుతున్న దినేశ్‌ కార్తీక్‌ ఈ మ్యాచ్‌కు ముందు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో ఇంగ్లండ్‌కు వన్డే ప్రపంచకప్‌ అందించిన మోర్గాన్‌ను జట్టు యాజమాన్యం సారథిగా నియమించింది. బ్యాటింగ్‌పై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్తీక్‌ పేర్కొనగా.. వరుస వైఫల్యాల కారణంగానే అతడిపై వేటు పడిందనే ఊహాగానాలు వినిపిసున్నాయి. కార్తీక్‌ నిరయాన్ని గౌరవిస్తున్నామని కేకేఆర్‌ సీఈవో వెంకీ తెలిపారు. 

కోల్‌కతా: త్రిపాఠి (సి) సూర్యకుమార్‌ (బి) బౌల్ట్‌ 7, గిల్‌ (సి) పొలార్డ్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 21, రాణా (సి) డికాక్‌ (బి) కూల్టర్‌నీల్‌ 5, కార్తీక్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 4, మోర్గాన్‌ (నాటౌట్‌) 39, రస్సెల్‌ (సి) డికాక్‌ (బి) బుమ్రా 12, కమిన్స్‌ (నాటౌట్‌) 53, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 148/5. వికెట్ల పతనం: 1-18, 2-33, 3-42, 4-42, 5-61, బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-32-1, కూల్టర్‌నీల్‌ 4-0-51-1, బుమ్రా 4-0-22-1, కృనాల్‌ 4-0-23-0, రాహుల్‌ చాహర్‌ 4-0-18-2.

ముంబై: రోహిత్‌ (సి) కార్తీక్‌ (బి) శివమ్‌ 35, డికాక్‌ (నాటౌట్‌) 78, సూర్యకుమార్‌ (బి) వరుణ్‌ 10, హార్దిక్‌ (నాటౌట్‌) 21, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 16.5 ఓవర్లలో 149/2. వికెట్ల పతనం: 1-94, 2-111, బౌలింగ్‌: గ్రీన్‌ 2.5-0-24-0, కమిన్స్‌ 3-0-28-0, ప్రసిద్ధ్‌ కృష్ణ 2-0-30-0, రస్సెల్‌ 2-0-15-0, వరుణ్‌ 4-0-23-1, శివమ్‌ 3-0-24-1.