శనివారం 16 జనవరి 2021
Sports - Nov 25, 2020 , 02:15:41

రోహిత్‌, ఇషాంత్‌ ఔట్‌

రోహిత్‌, ఇషాంత్‌ ఔట్‌

  • ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు దూరం
  • తర్వాతి మ్యాచ్‌లకూ  అనుమానమే l గాయం నుంచి కోలుకునేందుకు ఆలస్యమే కారణం 

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను మరోసారి కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న టీమ్‌ఇండియాకు  చేదువార్త ఎదురైంది. ఐపీఎల్‌లో గాయాల పాలైన స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, స్పీడ్‌స్టర్‌ ఇషాంత్‌ శర్మ కోలుకునేందుకు మరికొంత సమయం పట్టనుంది. దీంతో ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ)లో శిక్షణ పొందుతున్న వారు ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు టెస్టులకు దూరం కానున్నారు. అయితే తదుపరి రెండు మ్యాచ్‌ల్లోనూ రోహిత్‌, ఇషాంత్‌ ఆడడం అనుమానంగా మారింది. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే వారిద్దరూ ఈ నెల 27న ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లకు పూర్తిగా దూరమయ్యారు. ‘మ్యాచ్‌ ఆడే ఫిట్‌నెస్‌ సాధించాలంటే రోహిత్‌, ఇషాంత్‌కు మరో మూడు, నాలుగు వారాల సమయం పడుతుందని ఎన్‌సీఏ నివేదిక సమర్పించింది’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఒకవేళ రోహిత్‌, ఇషాంత్‌ వారంలో ఆస్ట్రేలియాకు వెళ్లినా 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు జనవరి 7 నుంచి సిడ్నీలో జరిగే మూడో టెస్టు ఆడొచ్చు. అయితే ఇంత త్వరగా టెస్టు మ్యాచ్‌కు కావాల్సిన ఫిట్‌నెస్‌ను సాధించగలరా అన్నదే అనుమానం. దీంతో ఆస్ట్రేలియా పర్యటన మొత్తానికి రోహిత్‌, ఇషాంత్‌ దూరమయ్యేలా ఉన్నారు. తన భార్య అనుష్క శర్మ జనవరిలో తొలి సంతానానికి జన్మనివ్వనుండడంతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్వదేశానికి రానున్నాడు. ఈ నేపథ్యంలో జట్టులో రోహిత్‌ శర్మ కీలకంగా మారతాడన్న అంచనాలు వెలువడగా.. ఇప్పుడు అతడు కూడా టెస్టు జట్టులో ఆడడం కష్టమవడంతో టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బగా మారింది. టెస్టు సిరీస్‌కు రోహిత్‌ దూరం కానుండడంతో ఆ స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్‌ 17 నుంచి భారత్‌, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ మొదలుకానుంది. 

రోహిత్‌ లేకుంటే భారత్‌కు దెబ్బే: స్మిత్‌ 

సిడ్నీ: ఐపీఎల్‌లో తన ప్రదర్శనతో అసంతృప్తి చెందానని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ పేర్కొన్నాడు. మెగాటోర్నీలో లయ అందుకోలేకపోయినా.. టీమ్‌ఇండియాతో పోరుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ‘ఐపీఎల్‌ జరిగినన్ని రోజులు నా ఆటపై అసంతృప్తితో ఉన్నా. టచ్‌ దొరక్క ఇబ్బందిపడ్డా. అయితే ఇక్కడికి వచ్చాక కొత్త ఉత్తేజం వచ్చినైట్లెంది. నాపై నాకు నమ్మకం పెరిగింది. పెద్ద టోర్నీల్లో మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తా. వన్డే సిరీస్‌కు రోహిత్‌  అందుబాటులో లేకపోవడం భారత్‌కు నష్టమే. టీమ్‌ఇండియాకు నాణ్యమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. ఇక టెస్టుల్లో కోహ్లీ అందుబాటులో లేకపోవడం కూడా అంతే’అని స్మిత్‌ అన్నాడు. స్లెడ్జింగ్‌పై స్పందించిన స్మిత్‌.. ఐపీఎల్‌ వంటి టోర్నీలతో దేశవిదేశాలకు చెందిన ఆటగాళ్లు ఒక జట్టుగా ఆడుతున్నప్పుడు సహజంగానే వారి మధ్య అవగాహన ఏర్పడుతుందని  స్మిత్‌ చెప్పుకొచ్చాడు.

విరాట్‌ లేకపోవడం లోటే.. కానీ: సచిన్‌ 

ఆస్ట్రేలియా పర్యటనలో చివరి మూడు టెస్టులకు కెప్టెన్‌ కోహ్లీ లేకపోవడం టీమ్‌ఇండియాకు పెద్ద లోటేనని దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అన్నాడు. అయితే అతడి గైర్హాజరీ వల్ల సత్తాచాటేందుకు మరొకరికి అవకాశం దక్కుతుందని అన్నాడు. అలాగే విభిన్నంగా ఆడే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ను ఔట్‌ చేయాలంటే భారత బౌలర్లు ఐదో స్టంప్‌ లైన్‌లో బౌలింగ్‌ చేయాలని మాస్టర్‌ సూచించాడు. సాధారణంగా బౌలర్లు ఆఫ్‌ స్టంప్‌ లేదా నాలుగో స్టంప్‌ లైన్‌లో వేయాలనుకుంటారని, అయితే స్మిత్‌ క్రీజులో కదులుతూ ఉంటాడు కాబట్టి ఐదో స్టంప్‌ లైన్‌లో బౌలింగ్‌ చేయాలని మాస్టర్‌ సూచించాడు.