శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Jan 29, 2020 , 00:23:17

ఫెడ్‌కు తప్పిన పరాభవం

ఫెడ్‌కు తప్పిన పరాభవం

ఆరుసార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత రోజర్‌ ఫెదరర్‌ ఈసారి క్వార్టర్స్‌లోనే ఓటమి అంచుల వరకు వెళ్లి విజయం సాధించాడు. ఏకంగా ఏడు మ్యాచ్‌ పాయింట్లనుకాచుకొని వందో ర్యాంకు ఆటగాడి చేతిలో వెంట్రుక వాసిలో ఘోర పరాభవాన్ని తప్పించుకున్నాడు. మరో మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించిన రెండో సీడ్‌ జొకోవిచ్‌తో సెమీస్‌లో ఫెడ్‌ తలపడనున్నాడు. మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌, లోకల్‌స్టార్‌ ఆష్లే బార్టీతో పాటు సోఫియా కెనిన్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ రెండో రౌండ్‌లో పరాజయం పాలైన భారత సీనియర్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ నిష్క్రమించాడు. అన్‌సీడెడ్‌పై ఐదుసెట్లు పోరాడి గెలుపు సెమీస్‌లో జొకోచిచ్‌తో అమీతుమీ.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

మెల్‌బోర్న్‌: అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల వీరుడు, స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ అతి కష్టమ్మీద ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. క్వార్టర్స్‌లో ఓ దశలో వరుసగా రెండు సెట్లు కోల్పోయినా... తర్వాతి సెట్‌ టైబ్రేకర్‌లో ఏడు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకొని  విజయం సాధించాడు. మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల క్వార్టర్‌ ఫైనల్స్‌లో మూడో సీడ్‌ ఫెదరర్‌ 6-3, 2-6, 2-6, 7-6(10/8), 6-3తేడాతో వందో ర్యాంకు ఆటగాడు టెన్నిస్‌ సాండ్‌గ్రెన్‌(అమెరికా)పై మూడున్నర గంటలు పోరాడి గెలిచాడు. ఫెదరర్‌ తొలి సెట్‌ను సునాయాసంగానే చేజిక్కించుకున్నాడు. అయితే, ఆ తర్వాత అమెరికన్‌ సాండ్‌గ్రెన్‌ విజృంభణ మొదలైంది. అతడి బలమైన సర్వీస్‌లకు ఫెదరర్‌ వద్ద సమాధానమే లేకపోయింది. రెండో సెట్‌ ప్రారంభంలోనే రోజర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన సాండ్‌గ్రెన్‌ బలమైన ఫోర్‌ హ్యండ్‌ షాట్లతో రెచ్చిపోయాడు. చివరి వరకు అదే జోరుతో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. మూ డో సెట్లోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. సాండ్‌గ్రెన్‌ అదే దూకుడు కొనసాగించగా ఫెదరర్‌ ఆసాంతం వెనుకబడ్డాడు. రెండుసార్లు ఫెడ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన అమెరికన్‌ సెట్‌ నెగ్గి ఉత్కంఠ పెంచాడు. 


టై బ్రేకర్‌లో హైటెన్షన్‌ 

అత్యంత కీలకమైన మూడో సెట్‌లో ఫెదరర్‌ - సాండ్‌గ్రెన్‌ మధ్య పోరు రసవత్తరంగా సాగింది. ఇద్దరు ప్లేయర్లు సర్వీస్‌లను కాపాడుకుంటూ ముందుకు సాగడంతో ఫలితం టైబ్రేకర్‌కు చేరింది. అక్కడా మంచి జోరు కనబరిచిన సాండ్‌గ్రెన్‌ 3-3 నుంచి తన ఆధిక్యాన్ని 6-3కు పెంచుకున్నాడు. ఒక ఒక్కపాయింట్‌ గెలిస్తే సెమీస్‌లో అడుగుపెట్టేవాడే. ఆ సమయంలో ఫెదరర్‌ పుంజుకున్నాడు. 8-8తో సమమైన సమయంలో ఒత్తిడిని జయించిన స్విస్‌ దిగ్గజం ఫెడ్‌ వరుసగా రెండు పాయింట్లు ఖాతాలో వేసుకొని సెట్‌ కైవసం చేసుకున్నాడు. నిర్ణయాత్మక సెట్‌ను మాత్రం ఫెదరర్‌ సునాయాసంగా దక్కించుకొని సెమీస్‌లో అడుగుపెట్టాడు. మ్యాచ్‌ మొత్తంలో సాండ్‌గ్రెన్‌ 27ఏస్‌లు, 73విన్నర్లతో సత్తాచాటగా.. ఫెదరర్‌ ఐదు ఏస్‌లు, 44విన్నర్లతో సరిపెట్టుకున్నాడు. 


నేను ఈ రోజు చాలా అదృష్టవంతుడిని. నాకు అద్భుతాలపై నమ్మకముంది. ఈసారి సెమీస్‌కు వెళ్లేందుకు నేను పూర్తి అర్హుడిని కాను. కానీ చేరుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 

-  ఫెదరర్‌ 

ఫెదరర్‌ X జొకోవిచ్‌ 

మరో క్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌, రెండో సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ 6-4, 6-3, 7-6(7/1)తేడాతో మిలోస్‌ రవోనిక్‌(కెనడా)పై గెలిచాడు. సెమీఫైనల్లో ఫెదరర్‌తో జొకో గురువారం తలపడనున్నాడు.  

సెమీస్‌లో బార్టీ, కెనిన్‌ 

మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ(ఆస్ట్రేలియా), సోఫియా కెనిన్‌(అమెరికా) సునాయాసంగా గెలిచారు. బార్టీ 7-6(8/6), 6-2తేడాతో ఏడో సీడ్‌ పెట్రా క్విటోవా(చెక్‌రిపబ్లిక్‌)పై,  కెనిన్‌ 6-4, 6-4తేడాతో ఓన్స్‌ జబెర్‌(ట్యునీషియా)పై విజయం సాధించగా.. సెమీస్‌లో గురువారం పరస్పరం తలపడనున్నారు. భారత సీనియర్‌ ఆటగాడు లి యాండర్‌ పేస్‌కు మిక్స్‌డ్‌ డబుల్స్‌ రెండో రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. 

కోబ్‌కు జొకోవిచ్‌ కన్నీటి నివాళి

హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన బా స్కెట్‌ బాల్‌ దిగ్గజం కోబ్‌ బ్రయంట్‌కు క్వార్టర్స్‌ మ్యాచ్‌లో సెర్బియా స్టార్‌ జొకోవిచ్‌ కన్నీటి నివాళి అర్పించాడు. గత పదేండ్లుగా  మార్గనిర్దేశకుడిగా, స్నేహితుడిగా కోబ్‌ తనను ఎంతో ప్రోత్సహించాడని గుర్తు చేసుకున్నాడు. కేబీ 8, 24 అని రాసి ఉన్న టీషర్టును ధరించిన జొకో..  కోర్టులోనే కన్నీటి పర్యంతమయ్యాడు.


logo