మంగళవారం 07 జూలై 2020
Sports - Apr 23, 2020 , 12:17:17

ఫెదరర్​కు స్టార్ ప్లేయర్ల మద్దతు.. నిక్ వ్యతిరేకత

ఫెదరర్​కు స్టార్ ప్లేయర్ల మద్దతు.. నిక్ వ్యతిరేకత

టెన్నిస్ పురుషుల, మహిళల సంఘాలు ఏపీటీ, డబ్ల్యూటీఏలను విలీనం చేయాలని స్విస్ టెన్నిస్ దిగ్గజం, 20 గ్రాండ్​స్లామ్ టైటిళ్ల విజేత రోజర్ ఫెదరర్ చేసిన ప్రతిపాదనకు టెన్నిస్ ప్లేయర్లు అధిక సంఖ్యలో మద్దతు తెలుపుతున్నారు. ప్రపంచ రెండో ర్యాంకర్ రఫేల్ నాదల్​తో  పాటు మహిళా స్టార్లు.. వింబుల్డన్ చాంపియన్ సిమోనా హలెప్​, పెట్రా క్విటోవా, గాబ్రిన్ ముగురుజ.. ఫెడ్ ఆలోచనను సమర్థించారు. అయితే ఆస్ట్రేలియా వివాదాస్పద యువ టెన్నిస్ ఆటగాడు నిక్​ కైర్గియోస్ మాత్రం ఫెదరర్ ప్రతిపాదనను వ్యతిరేకించాడు. మహిళా టెన్నిస్ దిగ్గజం బెల్లీ జీన్ కింగ్ కూడా ఫెదరర్​కే మద్దతు తెలిపారు.  

ఫెడ్ ప్రతిపాదనకు నాదల్ స్పందిస్తూ “నేను పూర్తిగా అంగీకరిస్తున్నా. ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు పురుషుల, మహిళల పరిపాలన సంఘాలను విలీనం చేయాలనడం గొప్ప ఆలోచన” అని నాదల్ ట్వీట్ చేశాడు. ఫెడ్​ నిర్ణయం సరైందనుకున్న వారంతా మద్దతు తెలపాలని క్విటోవా చెప్పింది. 1970 నుంచి తాను రెండు సంఘాల విలీనం గురించి చెబుతున్నానని దిగ్గజ ప్లేయర్ బెల్లీ జీన్ కింగ్ చెప్పారు. కాగా ఆస్ట్రేలియా ప్లేయర్​ నిక్​ మాత్రం ఏటీపీ, డబ్ల్యూటీఏను విలీనం చేస్తే మనకెలా మంచి జరుగుతుందంటూ ట్వీట్ చేశాడు. 


logo